భారత్‌బంద్‌కు టీసర్కారు మద్ధతివ్వడంపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం, ప్రజల్ని ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శ
భారత్‌బంద్‌కు తెలంగాణ సర్కారు మద్ధతు తెలపడంపై భారత జనతాపార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు..

భారత్‌బంద్‌కు తెలంగాణ సర్కారు మద్ధతు తెలపడంపై భారత జనతాపార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది రైతులు లేని ఆందోళన అని, బంద్ పూర్తిగా విఫలమైందని, ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నారంటూ ప్రజలే అనేక చోట్ల బంద్ ను అడ్డుకున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఇంతకాలం ఎందుకు ఆందోళన చేయలేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ సర్కారు చేస్తున్న అక్రమాలపై ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త రైతు చట్టంపై ప్రభుత్వం రోడ్లపైకెక్కి ప్రజలకు ఇబ్బందులు సృష్టించడం వింతగా ఉందన్నారాయన. పోలీసులు పూర్తి స్థాయిలో బంద్ కు వెన్నుదన్ననుగా నిలవడాన్ని ఖండిస్తున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు. నగరంలోని అనేక ప్రాంతాలు, రాష్ట్రంలోని రహదారులపై నిరసనలు చేపట్టి ప్రభుత్వమే ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం దారుణమన్నారు. పెన్షన్ దారులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారినికి అన్ని మున్సిపల్ కేంద్రాల్లో వచ్చే మూడు, నాలుగు నెలల్లో ఆందోళన కార్యక్రమాలు అమలు చేస్తామని ఉద్యోగ సంఘం నాయకులు మద్దతిస్తారో లేదో చూస్తామని సంజయ్ అన్నారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ప్రకటించాలని ఈ రెండు విషయాలపైనా బీజేపీ పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తుందని ఆయన ప్రకటించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక విలేఖరిని బండ బూతులు తిడుతున్నారంటూ ఆ ఫోన్ వాయిస్ ను బండి సంజయ్ ప్రెస్ మీట్లో వినిపించారు. రూ. 2500 చొప్పున సన్నబియ్యం ధర నిర్ణయించాల్సిందేనని ఆయన కేసీఆర్ సర్కారుని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలు అనేక చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే, పోలీసులు ఒక్క అరెస్ట్ కూడా చేయలేదని ఆయన అన్నారు.



