కృష్ణా బోర్డుకు ఏపీ సర్కార్ లేఖ

కృష్ణాలో మరో 77 టీఎంసీలు ఇవ్వాలంటూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది ఏపీ సర్కార్. పోతిరెడ్డిపాడుకు 66 టీఎంసీలు, హంద్రినీవాకు 5 టీఎంసీలు కేటాయించాలని బోర్డును కోరింది.

కృష్ణా బోర్డుకు ఏపీ సర్కార్ లేఖ
Follow us

|

Updated on: Sep 05, 2020 | 12:28 PM

కృష్ణా నదీ జలాల్లో వాటాల ప్రకారం నీటి వినియోగానికి సంబంధించి వివాదం కొనసాగుతోంది. ప్రతి ఏటా వినియోగానికి కేటాయించిన నీటిని ఆ సమయంలో వాడుకోకుండా, మరుసటి సంవత్సరం కేటాయించాలంటూ చేస్తున్న డిమాండ్ పై సందిగ్ధత నెలకొంది. కృష్ణాలో మరో 77 టీఎంసీలు ఇవ్వాలంటూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది ఏపీ సర్కార్. పోతిరెడ్డిపాడుకు 66 టీఎంసీలు, హంద్రినీవాకు 5 టీఎంసీలు కేటాయించాలని బోర్డును కోరింది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు ఈ నీటిని ఇవ్వాలని బోర్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. గతంలో.. పోతిరెడ్డిపాడుకు 9టీఎంసీలు, హంద్రినీవాకు 8టీఎంసీలు బోర్డ్ కేటాయించారు. వీటికి అదనంగా మరో 71 టీఎంసీలు ఇవ్వాలంటూ ఏపీ తాజాగా కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.

కాగా, గతంలోనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాసింది. రాష్ట్ర విభజన తర్వాత గత ఆరేళ్లుగా కృష్ణా నదీ జలాల వినియోగపు లెక్కలను కృష్ణా బోర్డు స్పష్టంగా తేల్చి చెప్పింది. ఉమ్మడి రాష్ట్రంలో నీటి వినియోగం లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉండేది కాదు. కాని రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో అంతర్రాష్ట్రాల నీటి వినియోగం ఒప్పందాల ప్రకారం ఏ రాష్ట్రం ఎంత నీటిని వినియోగించుకుందో స్పష్టం చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దీంతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జోక్యం చేసుకుని ఇరు రాష్ట్రాల నీటి వినియోగపు లెక్కలను తేల్చిచెప్పింది.

నీటి వినియోగాల సంవత్సరం జూన్‌ 1వ తేదీ నుండి ప్రారంభమై, మే 31న ముగుస్తుంది. ఈ నీటి సంవత్సరంలో శ్రీశైలం జలాశయానికి భారీగా 1,782 టీఎంసీల ప్రవాహం వచ్చింది. నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్‌లు నిండాయి. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 169.668 టీఎంసీలు, హంద్రీ-నీవా ద్వారా 41.918, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా 5.410, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 3.333టీఎంసీలు మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్‌ 220.329 టీఎంసీలు వినియోగించుకుందని కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది.