రన్నింగ్ ట్రైన్లో విలువైన వస్తువులు మాయం.. పోలీసుల ఆపరేషన్‌లో బయటపడ్డ షాకింగ్ నిజాలు..!
రైల్వే శాఖలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ప్రయాణికులకు రక్షణగా ఉండాల్సిన ఓ అధికారి.. దొంగగా మారి తోటి ప్రయాణికులనే నిలువుదోపిడీ చేశాడు. చివరకు పాపం పండి పోలీసులకు చిక్కాడు. ఈ విస్తుగొలిపే ఘటన కర్నూలు రైల్వే సర్కిల్ పరిధిలో వెలుగుచూసింది. ప్రయాణికుల బ్యాగులు మాయమవుతున్నాయన్న ఫిర్యాదులు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు.

రైల్వే శాఖలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ప్రయాణికులకు రక్షణగా ఉండాల్సిన ఓ అధికారి.. దొంగగా మారి తోటి ప్రయాణికులనే నిలువుదోపిడీ చేశాడు. చివరకు పాపం పండి పోలీసులకు చిక్కాడు. ఈ విస్తుగొలిపే ఘటన కర్నూలు రైల్వే సర్కిల్ పరిధిలో వెలుగుచూసింది.
అనంతపురం జిల్లా యాడికికి చెందిన పి. బాలరాజు (36) ఆదోనిలో రైల్వే జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా అతనికి రైళ్లలో ఉచితంగా, తరచుగా ప్రయాణించే వెసులుబాటు ఉంది. అయితే, ఈ అవకాశాన్ని ప్రజల సేవకు కాకుండా, వారి సొమ్ము దోచుకోవడానికి ఆయుధంగా మార్చుకున్నాడు. గత కొంతకాలంగా నంద్యాల, కర్నూలు రూట్లలో ప్రయాణికుల బ్యాగులు మాయమవుతున్నాయన్న ఫిర్యాదులు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు.
గుంతకల్ రైల్వే డీఎస్పీ కె. శ్రీనివాసచారి పర్యవేక్షణలో పోలీసు బృందం సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించింది. కర్నూలు శివారులోని ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలరాజును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడు జూనియర్ ఇంజినీర్ అని తెలిసి పోలీసులు సైతం విస్తుపోయారు.
బాలరాజు పక్కా ప్లాన్‌తో దొంగతనాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. రాత్రి సమయాల్లో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకునేవాడు. చడీచప్పుడు కాకుండా వారి బ్యాగులను అపహరించి, విలువైన బంగారు ఆభరణాలు, నగదు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు మాత్రమే తీసుకునేవాడు. బాధితుల సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డులు, బట్టలు వంటివి పోలీసులకు దొరక్కుండా కాల్చివేసేవాడు. పోలీసులు నిందితుడి నుంచి సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు, భారీగా నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బాధ్యతాయుతమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, విలాసాలకు అలవాటు పడి ఇలాంటి నేరాలకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ప్రయాణికులు రైలు ప్రయాణాల్లో అపరిచితుల పట్ల, ముఖ్యంగా రాత్రి వేళల్లో తమ లగేజీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని రైల్వే పోలీసులు సూచించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
