చికెన్ కూర స్నేహితుడి ప్రాణం తీసింది.. అహోబిలంలో విషాదం!
చికెన్ వండలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లా అహోబిలంలో వెలుగుచూసింది. కేవలం టమోటా చట్నీ చేసినందుకు ప్రాణాలు తీయడం స్థానికంగా కలకలం రేపింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఎరుకల శంకర్, వడ్డే శివ స్నేహితులు. వీరిద్దరూ అహోబిలం గ్రామ సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో ఒకే గదిలో నివసిస్తున్నారు. ఇద్దరికీ మద్యానికి బానిసలయ్యే అలవాటు ఉంది. రోజూ మద్యం తాగి గొడవ పడటం వీరికి పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే మే నెల 14వ తేదీ రాత్రి ఇరువురు కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో చికెన్ వండాలని శివ తన స్నేహితుడు శంకర్‌కు చెప్పాడు. అయితే, శంకర్ చికెన్ వండకుండా టమోటా పచ్చడి తయారు చేశాడు. దీంతో శివ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. మనసులో కక్ష పెంచుకున్న శివ, రాత్రి 9 గంటల సమయంలో శంకర్ నిద్రిస్తున్న తరుణంలో రోకలిబండతో అతని నుదుటిపై, తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో శంకర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం పరారైన నిందితుడు శివ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ నెల 20వ తేదీన ఆళ్లగడ్డ – అహోబిలం రహదారిలోని పడకండ్ల గ్రామ దుర్గామాత ఆలయం వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. క్షణికావేశం ఒకరి ప్రాణం తీయడమే కాకుండా, మరొకరిని జైలు పాలు చేసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..