AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐదేళ్ల ప్రేమ.. ఆపై పెళ్లి.. తర్వాత నెలకే ఒకరి తర్వాత మరొకరి ఆత్మహత్య.. అసలు ఏమైందంటే..?

ఐదేళ్లపాటు ప్రేమించుకుని, ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆ జంట సంతోషం నెల రోజులు కూడా నిలవలేదు. విభేదాలు రావడంతో విడాకుల వరకు వెళ్లిన వ్యవహారం.. చివరకు ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఆ మనస్తాపంతో భర్త రైలు కింద పడి తనువు చాలించాడు. ఒక్కరోజు వ్యవధిలోనే నవదంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఈ విషాద ఘటన ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లాల్లో తీవ్ర కలకలం రేపింది.

ఐదేళ్ల ప్రేమ.. ఆపై పెళ్లి.. తర్వాత  నెలకే ఒకరి తర్వాత మరొకరి ఆత్మహత్య.. అసలు ఏమైందంటే..?
Newlywed Couple Dies By Suicide In Khammam
N Narayana Rao
| Edited By: |

Updated on: Oct 13, 2026 | 3:14 PM

Share

ఐదేళ్లు ప్రేమించుకుని.. పెళ్లైన నెలరోజులకే విభేదాల కారణంగా భార్యభర్తలు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఎర్రుపాలెంకు చెందిన మహేష్ (25) విజయవాడలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే అప్పుడే అతనికి ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం బెల్లంకొండవారిపాలెంకు చెందిన వెంకటరమణ (23) అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొన్నాళ్లు ప్రేమగా మారడంతో ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ బంధం ఐదేళ్లపాటు ఎంతో ఆనందంగా కొనసాగింది. అనంతరం ఇరువైపులా పెద్దలను ఒప్పించి నెల రోజుల క్రితమే వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

మనస్పర్థలు.. విడాకుల పంచాయితీ

ఐదేళ్ల ప్రేమలో రాని విభేదాలు పెళ్లయిన నెల రోజులకే వారి మధ్య మొదలయ్యాయి. దంపతుల మధ్య మనస్పర్థలు తీవ్రమవడంతో కలిసి ఉండలేక పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో వ్యవహారం విడాకుల వరకు వెళ్లింది. పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగి విడాకులు తీసుకోవడానికి అంతా సిద్ధమైంది. అయితే, ఈ పరిణామంతో భార్య వెంకటరమణ తీవ్ర మనోవేదనకు గురైంది.

ఆసుపత్రిలో భార్య, రైలు కింద పడి భర్త ఆత్మహత్య

తీవ్ర బాధలో ఉన్న వెంకటరమణ నందిగామ నుంచి పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలోని తన తాతగారింటికి వెళ్లింది. అక్కడ ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన విజయవాడ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. మరోవైపు ఐదేళ్లు ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇక లేదన్న నిజాన్ని మహేష్ జీర్ణించుకోలేకపోయాడు. భార్య మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఒక్కరోజు వ్యవధిలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న నవదంపతులు ప్రాణాలు కోల్పోవడంతో ఏపీలోని బెల్లంకొండవారిపాలెం, తెలంగాణలోని ఎర్రుపాలెం గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us