24 ఏళ్లకే డిప్యూటీ మేయర్.. ఒంగోలులో చర్పిత సరికొత్త రికార్డు!
24 ఏళ్ల వయసులోనే కార్పొరేటర్‌గా ఎన్నికై.. ఇప్పుడు డిప్యూటీ మేయర్ పీఠాన్ని అధిరోహించారు ఒంగోలుకు చెందిన చావలి చర్పిత. సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచార వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఎంటెక్ చదివిన చర్పిత ఉద్యోగాన్ని పక్కనపెట్టి ప్రజా సేవను ఎంచుకున్నారు.

రాజకీయాల్లో అనుభవమే అర్హత అనుకునే రోజులు మారుతున్నాయి.. యువత కూడా ప్రజాప్రతినిధులుగా తమదైన ముద్ర వేస్తున్నారు. ఎన్నికల బరిలోకి దిగి గెలవడమే కాదు.. కీలక బాధ్యతలు చేపడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అలాంటి యువ నాయకుల్లో ఒంగోలుకు చెందిన చావలి చర్పిత ఇప్పుడు ప్రత్యేకంగా నిలుస్తున్నారు. కార్పొరేటర్‌గా గెలిచిన కొద్ది రోజులకే డిప్యూటీ మేయర్ పీఠాన్ని అధిరోహించారు.
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌లో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మేయర్‌గా శ్రీశిల్ప, డిప్యూటీ మేయర్‌గా చర్పిత బాధ్యతలు చేపట్టారు. ఇద్దరు మహిళల చేతుల్లో నగర పాలనా బాధ్యతలు ఉండటం విశేషం. అందులోనూ కేవలం 24 ఏళ్ల వయసులో డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన చర్పితకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
చర్పిత రాజకీయ ప్రస్థానం కూడా ఆసక్తికరమే. ఒంగోలు 27వ డివిజన్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన ఆమె, ఎన్నికల ప్రచారంలో తనదైన శైలితో ప్రజలకు చేరువయ్యారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను పలకరించడం, చిరునవ్వుతో మాట్లాడటం, ప్రచార వీడియోలు, రీల్స్ ద్వారా యువతతో కనెక్ట్ కావడం ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్నికల సమయంలోనే చర్పిత పేరు బాగా వినిపించింది. చివరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై విజయం సాధించి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.
ఎంటెక్ చదివిన చర్పితకు చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా, ప్రజా జీవితంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆమె ఎస్ఆర్ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేశారు. కుటుంబ నేపథ్యం కూడా ఆమె రాజకీయ ప్రవేశానికి బలాన్నిచ్చింది. తండ్రి మున్సిపల్ కాంట్రాక్టర్ కాగా, తాత చావలి కృష్ణయ్య గతంలో కౌన్సిలర్‌గా పనిచేశారు. అమ్మమ్మ అనంతమ్మ ప్రస్తుతం అన్నవరం దేవస్థానం బోర్డు డైరెక్టర్‌గా ఉన్నారు. కుటుంబానికి టీడీపీతో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా చర్పిత తనను ఆదరించిన ప్రజలను మర్చిపోలేదు. 27వ డివిజన్‌లో ప్రతి ఓటరును కలిసి కృతజ్ఞతలు తెలిపి తన విజయాన్ని ప్రజల విజయంగా అభివర్ణించారు. ఇప్పుడు డిప్యూటీ మేయర్‌గా కొత్త బాధ్యతలు చేపట్టడంతో ఆమె ముందున్న సవాలు ఒక్కటే.. యువత రాజకీయాల్లోకి రావడమే కాదు, పాలనలోనూ తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడం.
