లాక్‌డౌన్ నేపథ్యంలో.. జాతీయ రహదారిపై 400 కుటుంబాల ఆందోళన..
కోవిద్-19 మహమ్మారి విజృంభిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో ప్రజల ఆందోళనలు పెరుగుతున్నాయి. నిన్న ముంబయి బాంద్రాలో వలస కూలీలు ఒక్కసారిగా ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా

కోవిద్-19 మహమ్మారి విజృంభిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో ప్రజల ఆందోళనలు పెరుగుతున్నాయి. నిన్న ముంబయి బాంద్రాలో వలస కూలీలు ఒక్కసారిగా ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా పశ్చిమ్‌బెంగాల్‌లోని జాతీయ రహదారిపై 400 కుటుంబాలకు చెందిన ప్రజలు ధర్నాకు దిగారు. ముర్షిదాబాద్ జిల్లా దోమకల్ మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిపై వీరంతా బైఠాయించడంతో మూడు గంటల పాటు ఆ ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. పేదలకు ఉచితంగా రేషన్ అందిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెబుతున్నా, తమకు గత 20రోజులుగా తిండి లేక పస్తులుంటున్నామని వారు ఆరోపించారు.
కరోనా కట్టడికి లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే.. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ, పిల్లలు, పెద్దలు సుమారు 400 కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో పోలీసులు, అధికారులు షాకయ్యారు. చాలామంది మాస్క్‌లు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం గమనార్హం. సమాచారం తెలుసుకున్న దోమకల్ మున్సిపాలిటీ ఛైర్మన్ హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగిన ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రేషన్ కార్డులు ఉన్నా, డీలర్లు తమకు ఇప్పటి వరకూ రేషన్ ఇవ్వలేదని ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించిన వారికి అధికారులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.