ఆటగాళ్లకు సరికొత్త సవాల్‌ను విసురుతోన్న ఐపీఎల్‌

వ్యక్తిగత కారణాలతోనే తాను స్వదేశానికి వచ్చానని, తనకు ఎవరితోనూ ఎలాంటి వివాదాలు లేవని రైనా చెప్పుకొచ్చినా కొందరు ఏదేదో ఊహించుకున్నారు.. అలా ఐపీఎల్ కు కాసింత ముందస్తు పబ్లిసిటీ లభించింది.. అసలు ఐపీఎల్‌-2020పైనే బోలెడన్ని అనుమానాలొచ్చాయి..

ఆటగాళ్లకు సరికొత్త సవాల్‌ను విసురుతోన్న ఐపీఎల్‌
Follow us
Balu

| Edited By: Ravi Kiran

Updated on: Sep 10, 2020 | 5:24 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభ సంబరంలో బాణాసంచా వెలుగులు విరజిమ్మడం పరిపాటి.. ఈసారి సరేశ్‌ రైనా ఎపిసోడ్‌ ఆ ముచ్చట తీర్చింది.. రైనా దుబాయ్‌ నుంచి వెనక్కి రావడంతో నలుగురు నాలుగు రకాలుగా అనుకున్నారు.. వ్యక్తిగత కారణాలతోనే తాను స్వదేశానికి వచ్చానని, తనకు ఎవరితోనూ ఎలాంటి వివాదాలు లేవని రైనా చెప్పుకొచ్చినా కొందరు ఏదేదో ఊహించుకున్నారు.. అలా ఐపీఎస్‌కు కాసింత ముందస్తు పబ్లిసిటీ లభించింది.. అసలు ఐపీఎల్‌-2020పైనే బోలెడన్ని అనుమానాలొచ్చాయి.. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ టోర్నమెంట్‌ జరుగుతుందా లేదా అన్న సందేహం పట్టిపీడించింది.. మొత్తానికి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఇండియాలో కాకుండా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరిపేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసింది.. ఈ నెల 19 నుంచి జరిగే ఈ మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ 53 రోజుల పాటు సాగుతుంది.. మొత్తం నవంబర్‌ పదిన జరిగే ఫైనల్‌ మ్యాచ్‌తో కలిసి మొత్తం 60 మ్యాచ్‌లు జరుగుతాయి.. రౌండ్‌ రాబిన్‌లో జరిగే 56 మ్యాచ్‌లను నిర్వహించడానికి దుబాయ్‌, అబుదాబి, షార్జా క్రికెట్‌ స్టేడియంలు సిద్ధమయ్యాయి..

ఈసారి జరిగే ఐపీఎల్‌ ప్రత్యేకతేమిటంటే స్టేడియంలో ఒక్క ప్రేక్షకుడు కూడా ఉండకపోవడం.. ఖాళీ స్టేడియంలలోనే మ్యాచ్‌లను నిర్వహిస్తారు.. ఆటగాళ్లు, ఐపీఎల్ సిబ్బంది కూడా బయో సెక్యూర్‌ బబుల్‌లోనే ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా తిరిగితే కుదరదు.. ఈ మధ్యనే ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు వెస్టిండీస్‌, పాకిస్తాన్‌ సిరీస్‌లను సమర్థంగా నిర్వహించింది. ఈ రెండు సిరీస్‌లను సవాల్‌గా తీసుకుంది.. ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంది.. కాకపోతే ఇంగ్లాండ్‌లో జరిగిన ఆ రెండు సిరీస్‌లతో పోలిస్తే ఐపీఎల్ నిర్వహణ చాలా చాలా కష్టం. ఎందుకంటే ఐపీఎల్‌లో పాల్గొనే జట్ల సంఖ్య ఎక్కువ.. దాంతో సహజంగానే ఆటగాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది.. సిబ్బంది సరేసరి! కరోనా కాలంలో సుమారు రెండు నెలల పాటు టోర్నమెంట్‌ను నిర్వహించడం నిజంగానే కష్టంతో కూడుకున్న పని! అధికారులు, సిబ్బంది అటూ ఇటూ తిరగాల్సి ఉంటుంది.. ఇక అడ్వర్‌టైస్‌మెంట్‌ కోసం షూటింగ్‌లు గట్రాలు సరేసరి! బయో సెక్యూర్‌ బబుల్‌ను దాటి ఇవన్నీ చేయడమన్నది కత్తిమీద సామే!

ఖాళీ మైదనాలలో క్రికెట్‌ ఆడటమన్నది ప్లేయర్లకు కూడా కొత్తే! రెండు నెలల పాటు ఎక్కడికి కదలకుండా .. ఓరకంగా ఐసోలేషన్‌లో ఉంటూ కేవలం హోటల్‌, స్టేడియంలకే పరిమితం కావడం కూడా వారికి కొత్త అనుభవమే! ఎక్కడ కరోనా సోకుతుందోన్న భయం ఆటగాళ్ల మానసికస్థితిపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది.. ఇప్పటికే చెన్నై సూపర్‌ కింగ్స్‌ శిబిరానికి కరోనా భయం ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది.. ఇద్దరు ఆటగాళ్లతో పాటు 13 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ రావడంతో మిగతావారు కంగారుపడ్డారు. సురేశ్‌ రైనా వెనక్కి వచ్చింది కూడా ఈ ఆందోళనతోనేనని కొందరు అన్నారు కూడా!

ఇక ప్రేక్షకులు లేని స్టేడియంలలో ఆటగాళ్లు బాగా రాణించగలరా అన్న ప్రశ్న ఉద్భవిస్తోంది.. ఉమేశ్‌ యాదవ్‌ వంటి ఆటగాళ్లు ఖాళీ స్టేడియంలలో ఆడటం తమకు కొత్త కాదని చెప్పారు.. నిజమే రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో ఎక్కువ శాతం ప్రేక్షకులు లేకుండానే జరుగుతుంటాయి. స్టేడియం మొత్తం లెక్కపెడితే ఓ పది పదిహేను మంది ఉంటారంతే! వచ్చినవాళ్లు కూడా ఏదో కాలక్షేపం కోసం వచ్చిన బాపతే అయి ఉంటారు.. కాబట్టి రాణించడం, రాణించకపోవడమంటూ ఉండదు.. స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌ పాడీ ఉప్టాన్‌ చెబుతున్నదాని ప్రకారం ఆటగాళ్లలో చాలామందికి కరోనా భయం కొద్దిగా ఉన్నా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు వచ్చిన అరుదైన అవకాశాన్ని జారవిడుచుకోవద్దనే భావనతో ఉన్నారు.. ఇప్పుడు సురేశ్‌రైనా, హర్భజన్‌సింగ్‌ ఐపీఎల్‌ నుంచి తప్పుకోవడం వల్ల వారికొచ్చిన నష్టమేమీ లేదు.. వారు ఆస్వాదించడానికే తప్ప ఆటలో వారికి నిర్దిష్టమైన లక్ష్యాలంటూ లేవు.. అందుకే ఏ మాత్రం మొహమాటం లేకుండా ఐపీఎల్‌ నుంచి వైదొలిగారు.. కానీ సంజు సామ్సన్‌, మయాంక్‌ అగర్వాల్‌ వంటి ఆటగాళ్ల పరిస్థితి వేరు.. వారికి కొన్ని గోల్స్‌ ఉన్నాయి.. జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవడం, దాన్ని నిలుపుకోవడమన్నది వారికి చాలా ముఖ్యం.. అందుకే కష్టమైనా సరే ఎమిరేట్స్‌లో ఆడేందుకు సిద్ధమయ్యారు..