Metro Trains: మెట్రో స్టేషన్లలో ఈ పసుపు రంగు లైన్ ఎందుకు ఉంటుందో తెలుసా..?
మెట్రో స్టేషన్లలో మనం తరచూ పసుపు రంగుతో ఉండే టైల్స్‌ను చూస్తాము. ఇవి ఎందుకు ఉన్నాయి, ఏ ప్రయోజనం కోసం వేశారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది ఈ టైల్స్ జారిపోకుండా నడవడానికి సహాయపడతాయని అనుకుంటారు, కానీ అది పూర్తిగా నిజం కాదు. దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ కారణం ఉంది. ఈ సారి మెట్రోలో ప్రయాణించే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

రోజూ మెట్రోలో ప్రయాణించేవారు ఈ విషయాన్ని గమనించే ఉంటారు. మనం నడిచే మార్గంలో ఏ ప్లాట్ ఫాం ఎటువైపో తెలిపే గుర్తులను ఫూట్ ప్రింట్ ను ఆ ప్లాట్ ఫాం నంబర్ ను వేసి ఉంచుతారు. అయితే, దాని పక్కనే పసుపు రంగులో ఓ టైల్ మార్గం కనిపిస్తుంటుంది. చాలా మంది దీనిపైనే నడిచి వెళ్తుంటారు. కానీ దీని గురించి అంతగా గమనించి ఉండరు. మెట్రో స్టేషన్ మొత్తం ఈ పసుపు లైన్ కనపడుతుంటుంది. వీటి వల్ల మనకెవ్వరికీ తెలియని చాలా ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని డిజైన్ కోసమో లేక జారకుండా నడవడానికి గ్రిప్పింగ్ కోసమో వేసి ఉంటారనుకుంటే మీరు పొరపడినట్టే. వీటిని వికలాంగులకు, అంధులకు, వయసుపైబడి చూపు మందగించిన వారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేస్తారని మీకు తెలుసా..?
ఈ టైల్స్‌ను టెక్స్‌టైల్ టైల్స్ అంటారు, ఇవి ఉన్న మార్గాన్ని టెక్స్‌టైల్ పాత్ అని పిలుస్తారు. దృష్టి లేని వారి సౌలభ్యం కోసం ఈ టైల్స్‌ను రూపొందించారు, వీటిని మొదట జపాన్‌లో ఉపయోగించారు. టైల్స్‌పై ఉన్న వివిధ ఆకృతులు గుండ్రని బొడిపె లాంటివి, దాని పక్కనే నిలువు గీతలు డిజైన్ చేస్తారు. కళ్లు లేని వారు మార్గం గుర్తించడంలో ఇవి కీలకంగా సహాయపడతాయి. వారు తమ చేతి కర్రతో ఈ టైల్స్‌ను తడిమితే, ట్రైన్ ఎక్కాల్సిన రూట్ ను లేదా బయటకు రావాల్సిన మార్గాలను గుర్తించవచ్చు. ఈ టైల్స్‌ను బ్రెయిలీ టైల్స్ అని కూడా అంటారు.
ఈ టైల్స్ డిజైన్ అంధులకు మార్గం చూపడంలో చాలా ఉపయోగపడుతుంది. సాధారణంగా, పసుపు రంగు టైల్స్‌ను ప్లాట్‌ఫాం అంచు దగ్గర, మెట్ల వద్ద లేదా ఎస్కలేటర్ల దగ్గర వేస్తారు. ఇవి అంధులకు ప్లాట్‌ఫాం అంచు లేదా ప్రమాదం ఉన్న ప్రదేశం దగ్గరకు వచ్చామని సూచిస్తాయి, దీంతో వారు జాగ్రత్తగా ఉండి ప్రమాదాలను తప్పించుకోగలరు.
అలాగే, వికలాంగుల కోసం కూడా ఈ టైల్స్ ఉపయోగకరంగా ఉంటాయి. వీల్‌చైర్ వాడేవారు లేదా నడవడంలో ఇబ్బంది ఉన్నవారికి ఈ టైల్స్ దిశ చూపిస్తాయి. ఈ ఆకృతులు వారు ఎటు వెళ్తున్నారో అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి, ఇది వారి భద్రతకు చాలా ముఖ్యం.