Dogs: బైక్‌పై వెళ్తుంటే కుక్కలు వెంటపడుతున్నాయా..? ఇలా చేస్తే ఠక్కున ఆగిపోతాయి..
మీరు హాయిగా బైక్‌పై లేదా కారులో వెళుతుంటే, రోడ్డుపై చుట్టుపక్కల ఉండే కుక్కలు బిగ్గరగా అరుస్తూ, మీ వాహనంవైపు దూసుకురావడం మీరు గమనించే ఉంటారు.
కాలనీల్లో నడవాలంటేనే కంగారు పడేలా.. రోడ్డు మీదకు రావాలంటేనే వణికిపోయేలా.. కుక్కలు దాడి చేస్తున్నాయ్. రోజూ ఎంతో మంది కుక్కకాటుకు గురవుతూనే ఉన్నారు. గుంపులు గుంపులుగా మీద పడుతున్న కుక్కలను చూస్తే మనం ఊర్లో ఉన్నామా లేక అడవిలో ఉన్నామా.. అనిపిస్తోంది. ముఖ్యంగా పగటి సమయాల్లో కావొచ్చు, రాత్రి సమయాల్లో కావొచ్చు.. బైక్స్ లేదా ఇతర వాహనాల మీద వెళ్తుంటే.. కుక్కలు గట్టిగా అరుస్తూ వెంటాడుతూ ఉంటాయి. దీంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. ఇలా చాలా మంది కాళ్లు చేతులు విరగ్గొట్టుకున్నారు. ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
నిపుణులు చెబుతున్న సమాచారం ప్రకారం.. కుక్కలు అలా వెంటపడటానికి కారణం వాహనాల టైర్లు. డాగ్స్.. ఎక్కువగా వాహనాల టైర్లపై మూత్రం పోయడం మీరు చూసే ఉంటారు. అలానే అవి వాసనను గుర్తు పెట్టుకుంటాయి. వాటికి వాసనాశక్తి నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. ఈ వాహనాలు కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. టైర్ల నుంచి వచ్చే మూత్రం వాసన కారణంగా.. తమ ఏరియాకు వేరే కుక్కలు వచ్చాయని వెంటపడతాయి. ప్రాంత పరిధికి లోబడి కుక్కలు ఉంటాయి. తమ ప్రాంతానికి ఇతర కుక్కలు రావడాన్ని అవి అస్సలు అంగీకరించవు. ఈ క్రమంలోనే వాహనాల టైర్లు ముందుకు కదులుతున్నప్పుడు అవి అటాక్ చేస్తున్నట్లుగా భావించి.. కౌంటర్ అటాక్ షురూ చేస్తాయి.
వాహనదారులు కంగారుపడి.. స్పీడ్ పెంచడం వంటివి చేస్తారు. కొందరు మహిళలు ఇంకాస్త భయంతో బైక్‌పై నుంచి దూకేస్తారు. ఇలానే ప్రమాదాలు జరుగుతాయి. వాహనం వేగం పెంచింతే.. అనుమానం మరింత బలపడి.. కుక్కలు దూకుడుగా మీదకొస్తాయి. ఇలాంటి సమయాల్లో వెహికిల్స్ స్పీడ్ పెంచొద్దని నిపుణులు సూచిస్తున్నారు. వాహనం స్పీడ్ తగ్గిస్తే.. కుక్కలు ప్రమాదం లేదని భావించి వెనక్కి తగ్గుతాయి. స్పీడ్ పెంచితే మాత్రం ఇంకాస్త వేగంగా దూసుకువస్తాయి.
మనం వేసుకున్న దుస్తుల రంగులు నచ్చకపోయినా, కళ్లు జోళ్లు పెట్టుకున్నా, వింతగా కనిపించినా.. కుక్కలు వెంటాడే ప్రమాదం ఉంటుంది. మనం స్లో అయితే అవి స్లో అవుతాయి. అలా నిదానంగా అక్కడి నుంచి వెళ్లిపోవాలి. అలా చేసినా కుక్కలు మీదకు వస్తుంటే.. చేతిలోకి ఒక కర్రో, రాయో తీసుకోవాల్సిందే.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం