Lightning: తెలుగు రాష్ట్రాల్లో పిడుగుల బీభత్సం.. అసలు ఇవి ఎందుకు పడతాయి.. సైన్స్ ఏం చెబుతుంది
ఏపీ, తెలంగాణలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. కడప, ఖమ్మం జిల్లాల్లో పిడుగులు ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి.
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం వచ్చెట్టు ఉందని, పనిమీద బయటకు వెళ్లిన ఇంటికి బయల్దేరుతున్నారు. ఇంతలో భారీ శబ్ధం వినిపించింది. ఓ చెట్టు పిడుగు పడి చెట్టు కాలిపోతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అక్కడి ప్రజలు. అన్నమయ్య జిల్లా(Annamayya district)వీరబల్లి మండలం(Veeraballi Mandal) ఇంటిగపల్లెలో ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. ఇళ్ల మధ్యలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగి, దగ్ధమైంది. కొంత సమయం తర్వాత స్థానికులు మంటలు అర్పివేశారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ఇంటిగపల్లె గ్రామస్తులు. చెట్టుపై పిడుగు పడి కాలుతున్న దృశ్యాలను కొందరు సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలోనూ చాలాసార్లు ఇలా చెట్లపై పిడుగులు పడిన ఘటనలు ఉన్నాయి. సైన్స్ ప్రకారం, రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు సమీపంలోని ధనావేశిత మేఘాలవైపు ఆకర్షితమవుతుంటాయి. ధనావేశిత మేఘాలు చాలా ఎత్తుకు వెళ్లిపోయినప్పుడు దగ్గరలో మరే వస్తువు ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు ప్రయాణిస్తాయి. ఆ క్రమంలోనే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్ క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకొస్తాయి. దాన్నే పిడుగు పడటం అంటారని చెబుతున్నారు విపత్తు నిర్వహణ శాఖ నిపుణులు. మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు విడుదలయ్యే సమయంలోనే ఉరుములు, మెరుపులు ఉంటాయని చెబుతున్నారు అధికారులు. మేఘాల నుంచి పడే పిడుగులో దాదాపు 30 కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది, అది మనిషిని అక్కడిక్కడే కాల్చి బూడిద చేస్తుంది. అందుకే ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కిందికి వెళ్లొందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.
పిడుగుపాటును ముందస్తుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానాన్ని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ వినియోగిస్తోంది. అందుకోసం అమెరికాకు చెందిన ఎర్త్‌నెట్ వర్క్‌తో పాటు, ఇస్రో సహకారం తీసుకుంటోంది. 2017లో ఎర్త్ నెట్‌వర్క్ ద్వారా రాష్ట్రంలో సెన్సర్ల ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ సమయంలో పిడుగులు పడే అవకాశముందో ఈ సెన్సర్ల ద్వారా అధికారులు ఓ అంచనాకు వస్తారు. దాంతో మండలాల వారీగా ప్రజల ఫోన్లకు ఎస్సెమ్మెస్‌లు పంపి అలెర్ట్ చేస్తున్నారు. దీని ద్వారా 30 నుంచి 40 నిమిషాల ముందే పిడుగు పడబోయే ప్రాంతాన్ని గుర్తించవచ్చు.
Also Read: Weather News: మండుతున్న ఎండలు.. కూల్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ