పెళ్లిలో చికెన్ లెగ్ పీస్ తెచ్చిన తంట.. వేదికపైనే విడాకులు చెప్పిన పెళ్లికొడుకు..!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విచిత్ర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కాన్పూర్‌లోని బిల్హౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక వివాహ వేడుకలో ఈ ఘటన జరిగింది. భోజనంలోని చికెన్ లెగ్ పీస్ విషయంలో తలెత్తిన వివాదం వరుడి తరఫు వారికి, వధువు తరఫు వారికి మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో, ఆగ్రహించిన వరుడు వేదికపై నుంచే విడాకులు ప్రకటించాడు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విచిత్ర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కాన్పూర్‌లోని బిల్హౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక వివాహ వేడుకలో ఈ ఘటన జరిగింది. భోజనంలోని చికెన్ లెగ్ పీస్ విషయంలో తలెత్తిన వివాదం వరుడి తరఫు వారికి, వధువు తరఫు వారికి మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో, ఆగ్రహించిన వరుడు వేదికపై నుంచే విడాకులు ప్రకటించాడు. అయితే, ఆ తర్వాత ఇరు పక్షాల మధ్య రాజీ కుదరడంతో, పురోహితుడు మిగిలిన వివాహ తంతును పూర్తి చేసి వధువును సాగనంపాడు.
బంగర్‌మౌ పట్టణానికి చెందిన గుడ్డు, బిల్హోర్‌కు చెందిన పప్పు కుమారుడు ఫజల్‌తో తన కుమార్తె నిషా వివాహాన్ని నిశ్చయించాడు. శనివారం (ఏప్రిల్ 11) రాత్రి బిల్హోర్‌లోని ఒక అతిథి గృహంలో వివాహ తంతు పూర్తయింది. పెళ్లికూతురు, కొడుకుకి భోజనం వడ్డించారు. ఇంతలో, పెళ్లికి వచ్చిన అతిథులలో కొందరు తమ భోజనంలో లెగ్ పీస్ కావాలని డిమాండ్ చేశారు. లెగ్ పీస్ కొరత కారణంగా వారికి ఇతర మాంసం ముక్కలను వడ్డించారని, దీనివల్ల కొందరు అతిథులు ఆగ్రహానికి గురయ్యారు. పరిస్థితిని చక్కదిద్దడానికి వధువు మామ జమీల్, కజిన్ సలీం అక్కడికి చేరుకున్నారు. జీషాన్ అనే వరుడి స్నేహితుడితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఇది ఇరు వర్గాల మధ్య భీకరమైన గొడవకు దారితీసింది. ఈ ఘర్షణలో వధువు పక్షానికి చెందిన జమీల్, సలీం గాయపడ్డారు.
ఆ వాగ్వాదం జరుగుతున్నప్పుడు, వేదికపై ఉన్న పెళ్లికొడుకు ఫజల్ కూడా ఆగ్రహానికి గురయ్యాడు. అతను వేదికపై నుండి లేచి “తలాక్, తలాక్, తలాక్” అని గట్టిగా అరిచినట్లు సమాచారం. దీని తర్వాత, వేడుక మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఇరుపక్షాలు ఒకరినొకరు తేరిపార చూసుకున్నారు. సంఘటన గురించి సమాచారం అందుకున్న తర్వాత బిల్హౌర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత ఇరు పక్షాలు కలిసి కూర్చుని వివాదాన్ని పరిష్కరించుకున్నారని ఇన్‌స్పెక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. ఏ పక్షం కూడా లిఖితపూర్వక ఫిర్యాదు దాఖలు చేయలేదు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. కానీ రాజీ కుదరడంతో వివాహ వేడుక ప్రశాంతంగా ముగిసింది. మతగురువు మిగిలిన నికాహ్ తంతును పూర్తిచేశారు. వధువు అంగీకారంతో ఆమెను సాగనంపారు.
మరిన్ని హ్యమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
