Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎప్పుడో కనుమరుగైన చరిత్ర ఇప్పటికీ రగులుతోంది.. దురాక్రమణదారులా? హీరోలా?

వెయ్యేళ్ల నాటి చారిత్రక పాత్రలు ఇప్పటికీ వివాదం అవుతున్నాయి.. ఎందుకు? రాజకీయ నాయకులు గత చరిత్రపై మంటలు పుట్టిస్తూనే ఉన్నారు.. ఎందుకు? చరిత్రలో వాస్తవాలే ఉన్నాయా? లేదా వక్రీకరణ జరిగిందా? ఏది నిజం, ఏది చరిత్ర. ఒకప్పటి చరిత్ర ఇప్పటి రాజకీయాల్లోకి ఎందుకని ప్రవేశిస్తోంది? ఒకసారి తెలుసుకుందాం..

ఎప్పుడో కనుమరుగైన చరిత్ర ఇప్పటికీ రగులుతోంది..  దురాక్రమణదారులా?  హీరోలా?
Controversial Kings In Indian History
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 07, 2025 | 9:22 PM

చరిత్రలో ఉన్నవన్నీ నిజాలు కాదు, అందులో రాయనంత మాత్రాన అబద్ధం అనడానికీ లేదు. హిస్టరీ బుక్స్‌లో ఉన్నవి వాస్తవాలు-అవాస్తవాలు అనుకోవడమే ఒక భ్రమ. ఎందుకంటే.. వాటిని చూసే కోణం ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది కాబట్టి. ఆ కారణంగానే.. వెయ్యేళ్లైనా వారి చరిత్రపై రగడ జరుగుతూనే ఉంటుంది. ఔరంగజేబుపై జరుగుతున్న రాద్ధాంతమే తీసుకుందాం. మొఘల్స్‌ ఆఖరి నవాబు ఔరంగజేబు ఒక గొప్ప పాలకుడు, దేవాలయాలు సైతం నిర్మించాడంటూ కామెంట్ చేశారు మహారాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అబు అజ్మీ. ఆ ఒక్క మాటతో మహారాష్ట్ర బీజేపీ రగిలిపోయింది. ఔరంగజేబు నిజంగా అంతమంచి పాలకుడే అయితే.. ఆ సమాధిని తమ ఇళ్లల్లో పెట్టుకోవాలంటూ కౌంటర్‌ ఇచ్చారు మాజీ ఎంపీ నవనీత్‌ కౌర్.

అలాగే, అయోధ్య-బాబ్రీ మసీద్‌ విషయంలో ఎంత రగడ జరిగిందో చూశాం. కొన్ని దశాబ్దాల పాటు రగిలిపోయింది ఆ ఇష్యూ. అంతకుముందు.. రాహుల్‌గాంధీ బాబర్‌ సమాధిని సందర్శించిన ఘటన పెద్ద చర్చకు దారి తీసింది. 2005లో ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్లి బాబర్‌ సమాధిని సందర్శించి వచ్చారని నానాయాగీ చేసింది బీజేపీ. కొన్నేళ్ల క్రితం పాక్‌ జాతిపిత అయిన జిన్నాను పొగుడుతూ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ కామెంట్ చేశారు. దేశాన్ని విభజించిన జిన్నాను ఎలా కీర్తిస్తారంటూ బీజేపీ మండిపడింది. జిన్నాను కొనియాడినందుకే తమను విమర్శిస్తే.. మరి ఎల్‌కే అద్వానీ జిన్నా సమాధికి చాదర్‌ సమర్పించారు కదా దానికేం అంటారని రివర్స్‌ కౌంటర్‌ వేశారు.

ఇక టిప్పు సుల్తాన్‌ చరిత్రపైనా ఇప్పటికీ రగడ జరుగుతూనే ఉంటుంది కర్ణాటకలో టిప్పు జయంతిని అధికారికంగా జరపాలని సిద్ధరామయ్య.. కర్ణాటకను పాలించిన గొప్ప పాలకులు ఇంకెవరూ లేరా అని కుమారస్వామి.. తగువులాడుకున్నారు. తెలంగాణలోనూ నిజాం పాలనపై ఇలాంటి వాదోపవాదాలే జరిగాయి. మాజీ సీఎం కేసీఆర్‌ నిజాంను కీర్తిస్తే.. హిందువులను ఊచకోత కోసిన నిజాం మంచోడెలా అవుతాడంటూ కౌంటర్‌ ఇచ్చింది తెలంగాణ బీజేపీ.

శతాబ్దాలు గడిచినా, దశాబ్దాలు మారుతున్నా.. చరిత్రలోని కొందరు వ్యక్తులపై ఇంకా ఎందుకీ రచ్చ జరుగుతోంది? మనదేశంలోనే ఒక రాజకీయ పార్టీకి నచ్చిన చరిత్రకారుడు మరో సంస్థకు ఎందుకు నచ్చడం లేదు? ఔరంగజేబ్‌, టిప్పు సుల్తాన్‌, అక్బర్‌, బాబర్‌.. వీరంతా దురాక్రమణదారులా..? లేక.. చారిత్రక వీరులా? హిందూ సామ్రాజ్య స్థాపకుడిగా హిందూ సంస్థలు కీర్తించే మహరాజా ఛత్రపతి శివాజీ విషయంలోనూ ఎందుకీ రగడ? ఒకప్పటి చరిత్ర ఇప్పటి రాజకీయాల్లోకి ఎందుకని ప్రవేశిస్తోంది? ఒకసారి తెలుసుకుందాం..

ఎప్పుడో కనుమరుగైన చరిత్ర ఇప్పటికీ రగులుతోందంటే కారణం.. బుజ్జగింపు రాజకీయాలు, ఒక వర్గాన్ని సంతృప్తిపరచడానికి జరిగిన ప్రయత్నాలే. దేశ స్వాతంత్రానికి ముందు నుంచే ఆ తరహా పాలిటిక్స్‌కు బీజం పడింది. స్వాతంత్రం తరువాత ఓట్ల కోసం, అధికారం కోసం పరిస్థితులను మరింత దిగజార్చారనేది పచ్చి నిజం. మతోన్మాదులను, నరహంతుకులను మానవతావాదులుగా చూపించడం, చరిత్రలో ఎన్నో త్యాగాలు చేసి, దేశం కోసం పోరాడిన వారిని చరిత్ర పుస్తకాల్లోనే లేకుండా చేయడం జరిగింది. ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోసం ఎవరికి వారు, ఒక్కొక్కరి చరిత్రను ఒక్కోలా చెప్పుకోవడమూ మొదలైంది.

కొన్నేళ్ల క్రితం కర్నాటక సీఎం సిద్ధరామయ్య.. టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు. చరిత్ర పుస్తకాల ప్రకారం.. టిప్పుసుల్తాన్ ఒక స్వాతంత్ర్య సమరయోధుడు. ఆంగ్లేయులను తరిమి దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని మహనీయుడు. ఆ రోజుల్లోనే టెక్నాలజీ దిగుమతి చేసుకుని.. ఆధునిక భారతావనికి పునాదులు వేశాడని చెప్పుకుంటుంటారు. పరమత సహనంతో ఉంటూ హిందూ ఆలయాలకు కానుకలు ఇచ్చాడని చెబుతుంటారు. అందుకే కాబోలు సిద్ధరామయ్య అప్పట్లో ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. మరి.. ఆ స్టేట్‌మెంట్‌ రాగానే మైసూరు, మలబార్, కొడగు ప్రాంతాల్లోని హిందువులు, మంగళూరు క్రిస్టియన్లు ఎందుకని నిరసన తెలిపారు అనేది కొందరు విసిరిన ప్రశ్న. తన సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉన్న టిప్పు సుల్తాన్‌.. కేరళ, కొడగు, మంగళూరులోని క్రైస్తవులపై దాడి చేశారనేది కొందరి వర్షన్.

ఇస్లాం రాజ్య స్ధాపనే అతని ధ్యేయం అని చెప్పేవారూ లేకపోలేదు. మతం మార్చటమే ధ్యేయంగా ఏమాత్రం కనికరం లేకుండా హత్యాకాండ జరిపారనే వాదనలూ ఉన్నాయి. M.H. గోపాల్ అనే చరిత్రకారుడు చెబుతున్న ప్రకారం.. టిప్పుసుల్తాన్‌ పాలనలో ముస్లింలందరికీ ఇంటిపన్ను, గృహావసరాల వస్తువులపై పన్నులు ఉండేవి కావని ప్రస్తావించారు. టెక్నాలజీని వాడడంలో దిట్ట అనే పేరు ఉండడం వల్లో ఏమో.. పాకిస్తాన్ తయారుచేసిన మిస్సైల్స్‌లో ఒకదానికి టిప్పు అనే పేరు పెట్టారు. ఘోరీ, గజిని, బాబర్.. ఇలాంటి పేర్లు తన మిస్సైల్స్‌కు పెట్టుకున్న చరిత్ర పాకిస్తాన్‌ది. సో, అలాంటిది ఒక క్షిపణికి టిప్పు పేరు పెట్టారంటే.. దానర్ధం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

మొఘల్‌ పాలకుడు షాజహాన్‌ గురించి చరిత్ర పుస్తకాల్లో చాలా గొప్పగా ఉంటుంది. ఆయన కట్టించిన తాజ్‌మహల్‌ ప్రేమకు చిహ్నం అని కితాబు ఇస్తుంటారు చాలామంది. తనలోని ప్రేమను ప్రేమించిన వారికి చెప్పాలంటే.. ఎంచుకునే దారి తాజ్‌మహల్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడమే. కాని, షాజహాన్‌లోని ఒక కోణాన్ని మాత్రమే పుస్తకాల్లో రాశారంటారు కొందరు. బాద్‌షా నామా, లాహోరీ వంటి పుస్తకాల్లో షాజహాన్‌ దురాగతాల గురించి ఉందని చెబుతుంటారు. ఆ పాలనలో స్త్రీలు తమ గౌరవాన్ని కాపాడుకోడానికి ఆత్మార్పణం చేసుకున్న ఘటనలు అనేకం అనేది కొందరి వాదన. ఇప్పటికీ.. తాజ్‌మహల్‌పై వివాదం నడుస్తూనే ఉంది. ఉత్తరప్రదేశ్ పాలకుల్లోని కొందరు తాజ్‌మహల్‌ ఒకప్పటి తేజోలయ్ అనే శివాలయం అంటుంటారు. ఏదేమైనా.. ఒకప్పటి చరిత్రను తవ్వడం అంటే.. ఓట్ల రాజకీయానికి వాడుకోవడమే అనేది విశ్లేషకుల భావన.

మహ్మద్ గజిని గురించి చిన్నప్పటి పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. 17 సార్లు దండయాత్ర చేసి ఓడిపోయి.. మరోసారి యుద్ధం చేసి గెలిచాడు. పట్టు వదలకుండా పోరాడడం అంటే అదీ అని చాలా గొప్పగా కీర్తించారు. ఓడినంత మాత్రాన నిరుత్సాహపడనక్కర్లేదు.. మహ్మద్‌ గజినిని చూడండి ఓటమినే ఎలా గెలుపుగా మలుచుకున్నాడో అని చెబతుంటారు. కాని, అదే మహ్మద్‌ గజిని గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయాన్ని దోచుకున్నాడని ఎందుకని చెప్పరు అనేది కొందరి వర్షన్. సోమనాథ్ ఆలయ ఆక్రమణలో దాదాపు 50వేల మందిని వధించాడనేది కొందరి వాదన. అయినా.. భారతదేశంపై దురాక్రమణకు వచ్చిన ఒక రాజును.. జీవితంలో గెలవాలంటే గజిని చరిత్రను చదవాలని ఎలా చెబుతారని ప్రశ్నిస్తుంటారు. పైగా గజని 17 సార్లు దండయాత్ర చేసింది ఎవరి మీద! ఇది ముఖ్యం కాదా! అని అడిగేవాళ్లూ లేకపోలేదు.

హైదరాబాద్‌నే తీసుకుందాం. ఉస్మానియా పేరుతో ఒక గొప్ప విశ్వవిద్యాలయం, అతిపెద్ద ఆసుపత్రి, ఎయిర్‌పోర్ట్, రైల్వే.. ఇలా ఎంతో అభివృద్ధి చేశారు నిజాంలు. హైదరాబాద్‌ ఐకాన్‌ చార్మినార్‌ను కట్టించింది కూడా ఒకప్పటి నిజాంలే. గోల్కొండ ప్రభువుల నుంచి నిజాంల వరకు చేసిన అభివృద్ధి ఫలితంగానే హైదరాబాద్‌ ఇప్పుడొక మెట్రో సిటీగా ఎదిగిందని చెబుతారు. నిజాం గురించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్లు తెలంగాణ మొత్తం విన్నది. కాని, అదే నిజాం గురించి బీజేపీ నేతలు ఏమంటున్నారన్నది కూడా తెలంగాణ సమాజం వింటోంది. నిన్న మొన్నటి హైదరాబాద్ నిజాం.. ఆడవాళ్లని నగ్నంగా బతుకమ్మ ఆడించిన చరిత్ర కళ్లరా చూసినవాళ్లు ఇప్పటికీ జీవించే ఉన్నారనేది బీజేపీ ఇస్తున్న కౌంటర్. ఎప్పుడో జరిగిపోయినదాన్ని ఇప్పుడు ప్రస్తావించుకోవడం ఎందుకూ అంటే.. పక్కా ఓటు రాజకీయానికే అనేది విశ్లేషకుల మాట. అందుకే, నిజాం పాలనలోని కొన్ని ఘట్టాలను ప్రస్తావిస్తూ సినిమా తీయడం ఆలస్యం.. రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటుంది.

అయినా.. సినిమాని సినిమాలా చూడడం లేదిప్పుడు. సలీం-అనార్కలి పేరుతో సినిమా తీస్తే కులాలు, మతాలకు అతీతంగా హిట్‌ చేశారు. మొఘల్‌-ఏ-అజమ్ సినిమాను అందరూ కీర్తించారు. కాని, ఈ కాలంలో అలాంటి సినిమాలు వివాదం లేకుండా ఆడతాయా అనేది ప్రశ్న. అందులో వివాదాస్పదం లేకపోయినా సరే.. రాజకీయ లబ్ది కోసం ఏదో ఒక అంశాన్ని వివాదంగా మారుస్తారు. గతంలో వచ్చిన సినిమాల నుంచి నేటి ‘ఛావా’ వరకు ఎన్నెన్ని వివాదాలో. పద్మావత్‌ సినిమా వచ్చినప్పుడు ఎంత గొడవ జరిగిందో చూశాం. రాణి పద్మిని ఏకంగా 14వేల మంది స్త్రీలతో మంటల్లో దూకి ఆత్పార్పణం చేసుకుంది. అందుకు కారణం.. అల్లావుద్దీన్‌ ఖిల్జీ, అతని సైన్యం నుంచి తమ శీలాలను కాపాడుకోవడానికే అని ఆ సినిమా చూపించింది. కాని, మరో వర్గం మాత్రం.. స్వలింగ సంపర్కుడు అయిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ రాణి పద్మినిని మోహించడం ఏంటి అని వాదిస్తుంటారు. ఎవరో ఏదో చెప్పిన కథను తీసుకొచ్చి.. చరిత్రలో ఇది జరిగింది అని చెప్పడం ఏంటని కౌంటర్ ఇస్తుంటారు. ఏదేమైనా.. ఒక రాజకీయ యుద్ధానికి ఉపయోగపడింది ఈ సినిమా.

ఛావా.. చరిత్రను ఈ రేంజ్‌లో తవ్వుకోడానికి కారణం.. ఆ సినిమానే. ఛావాలో ఔరంగజేబు చేసిన దురాగతాలు, దాష్టికాలను చూపించాక.. రెండు వర్షన్లు బయటికొచ్చాయి. ఒకటి.. చరిత్రను కప్పేస్తే దాగదు అంటూ మరాఠీ హిందువులు ఘనంగా చెప్పుకున్నారు. రెండోది.. అసలు ఔరంగజేబు అలాంటి వ్యక్తే కాదంటూ చెప్పుకున్నారు మరో వర్గం వాళ్లు. శంభాజీని 40 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి, గోళ్లు పీకి, కళ్లు పెరికి, చర్మం ఒలిచి, నాలుకను కత్తిరించిన ఔరంగజేబును పొగడడం ఏంటనేది ఓ వర్గం వాదన. ఇదే సమయంలో ఛత్రపతి శివాజీ చరిత్రను కూడా మరోసారి గుర్తుతెచ్చుకుంది యావత్‌ భారతం.

హిందూరాజ్య స్థాపనలో భాగంగా మొఘలులను ఎదిరించి, ఒక్కో కోటను జయిస్తూ వెళ్లారు ఛత్రపతి. ఆ చరిత్ర నిజమే. కాని, అందులోనూ కొంత అవాస్తవాలు ఉన్నాయంటోంది మరో వర్గం. శివాజీ పోరాడింది హిందూరాజ్య స్థాపనకే అయితే.. మరి శివాజీ సైన్యంలో ముస్లింలు ఎలా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. అందుకే, ఇలాంటి సినిమాలపై వివాదం రగులుతూనే ఉంటుంది. దాన్ని రాజకీయ నాయకులు ఓట్లుగా మార్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఛావా ఒక్కటనే కాదు.. చరిత్రకారులపై తీసిన సినిమాలన్నిటిపైనా ఇవేరకమైన వివాదాలు. ఆ వివాదమే ఒకరకంగా సినిమా హిట్‌ అవడానికీ కారణమవుతోంది. పద్మావత్, తానాజీ, కేసరి, కాశ్మీరీ ఫైల్స్.. ఇలాంటి సినిమాలన్నింటినీ విజయవంతం చేశారు ప్రేక్షకులు. కారణం.. చరిత్రలో చెప్పని ఒక కొత్త కోణాన్ని, ఒకరి ఘనకీర్తిని చరిత్రలో చాలా తక్కువ చేసి చూపడాన్ని తట్టుకోలేకపోవడమే. అదే సమయంలో.. కావాలనే, కేవలం ఒక వర్గాన్ని కించపరిచేలా చూపించడం వల్లే అలాంటి సినిమాలు హిట్‌ అవుతున్నాయనేది మరో వర్గం వాదన.

ఒకప్పటి మొఘల్స్‌ పాలనను, ఆ పాలకులను ఎందుకని తక్కువ చూసి చూపిస్తున్నారు అనేవారూ లేకపోలేదు. చరిత్రలో ఏవో కొన్ని సంఘటనలను మాత్రమే పట్టుకుని.. వాళ్లు చేసిన మంచిని ఎందుకు చూడలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు.. కుతుబ్‌ మినార్. ఇండో-ఇస్లామిక్-ఆఫ్ఘనీ సంస్కృతిని ప్రతిబింబించేలా కుతుబుద్దీన్‌ ఐబక్‌ కట్టించిందే కుతుబ్‌ మినార్‌ అంటుంటారు కొందరు. ఇప్పుడు చూస్తున్న భారతదేశం ఒకప్పుడు ఒకే రాజ్యంగా లేదు. ఎన్నో రాజ్యాల సమూహం.. భరతఖండం. అలాంటి భూభాగాన్ని ఒక దేశంగా మార్చిందే మొఘల్స్‌ అనే వారూ ఉన్నారు. చిన్నచిన్న రాజ్యాలుగా ఉంటూ, అంతర్‌ యుద్ధాలతో నలుగుతున్న రాజ్యాలను ఒక్కొక్కటిగా గెలిచిన మొఘల్‌ రాజులు.. మొత్తం భూభాగాన్నే ఏకతాటిపైకి తెచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు. ఒకవేళ మొఘలులే గనక భరతఖండానికి రాకపోయి ఉంటే.. ఢిల్లీ ఒక రాజ్యం, రాజ్‌పుత్‌లకు ఒక రాజ్యం, బెంగాల్‌ రాజ్యం, మాల్వాల రాజ్యం, గుజరాతీ రాజ్యం, మేవార్‌ రాజ్యం.. ఇలా రాజ్యాలుగానే ఉండేది తప్ప ఇప్పటిలా ఒక దేశంగా మారేది కాదనేది వారి వాదన.

మొఘలుల పాలన భారతదేశంలో ఓ స్వర్ణయుగం అని కొనియాడుతుంటారు కొందరు. దేశం మొత్తానికి ఒక అత్యద్భుత రోడ్ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ను తీసుకొచ్చిందే మొఘలులు అంటుంటారు. దేశం మొత్తం ఒకే నగదు చెలామణి అయ్యేలా చేసిందే మొఘల్ పాలకులు అని చెబుతుంటారు. వీటివల్లే వాణిజ్యం, వర్తకం, ఆర్థిక అభివృద్ధి జరిగింది అనేవారూ లేకపోలేదు. ఔరంగజేబు హయాంలో భారత సరిహద్దులు ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అటు మయన్మార్‌ వరకు విస్తరించాయని, అప్పట్లోనే ప్రపంచ జీడీపీలో మనదేశ జీడీపీ వాటా 24 శాతం వరకు ఉందని లెక్కలు చెబుతున్నారు. మొఘల్స్‌ భారత దేశ సంపదను కొల్లగొట్టడం కాదు.. ప్రపంచ దేశాల్లో ఉన్న బంగారం, వెండి అంతా హిందుస్తాన్‌కు చేరుకున్నది మొఘలుల పాలనలోనే అని ఫ్రెంచ్‌ యాత్రికుడు ఫ్రాంకోయిస్‌ రాసిన పుస్తకాన్ని ప్రస్తావిస్తున్నారు. అక్బర్ తన ఆస్థానంలో నవరత్నాలు అని పిలిచే కవులను పెట్టుకున్నారని, అసలు రామాయణ, మహాభారతాలను వివిధ భాషల్లో అనువదించేలా చేసిందే మొఘల్‌ సామ్రాట్స్‌ అని అంటున్నారు.

నిజాం పాలనలో కొన్ని అకృత్యాలు జరిగి ఉండొచ్చు గానీ.. ఎన్నో అద్భుతాలను ఎలా మరిచిపోగలరు అని ప్రశ్నిస్తున్నవారూ ఉన్నారు. మొత్తం 224 ఏళ్లు పాలించిన నిజాముల పాలనలో హైదరాబాద్ ఒక స్వర్ణయుగాన్ని చూసిందంటారు. మొదటి రైల్వే వ్యవస్థను నెలకొల్పిందే నిజామ్స్‌ కదా, 1913లోనే సొంతంగా పవర్‌ సప్లై ఉన్నది నిజాం పాలనోని హైదరాబాద్‌లో కదా, హైదరాబాద్‌ నుంచి సుదూర ప్రాంతాలకు రోడ్లు వేయించిందే నిజాం హయాంలో కదా, రిజర్వాయర్లు, ఇరిగేషన్ వ్యవస్థలను గొప్పగా తీర్చిదిద్దిందే నిజాములు కదా అంటూ ఒక లిస్ట్‌ చెబుతున్నారు. ఆరోజుల్లోనే ఉన్నత చదువులకు స్కాలర్‌షిప్స్‌ అందజేసింది నిజామ్స్‌ కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఈజిప్ట్‌ నిర్మాణ శైలికి పోటీగా ఒక తాజ్‌మహల్‌ను, వన్నెతరగని ఎర్రకోటను, ఠీవీగా నిలబడిన చార్మినార్‌ను, ధమ్‌ బిర్యానీ, పత్తర్‌ కా ఘోష్, కిచిడి, ఖీమా వంటి మొఘలుల రుచులు అందించింది మొఘల్సే కదా అని చెబుతున్నారు.

నిజమే.. మొఘల్స్, నిజాంల పాలనలోనూ మెచ్చుకోదగ్గ అంశాలున్నాయి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు చెప్పుకోవాల్సిందే ఎవరైనా. కాని, చరిత్రను దాచి కేవలం ఒక కోణాన్నే ఎందుకు చూపిస్తున్నారంటున్నారు కొందరు చరిత్రకారులు. వందల రాజ్యాలుగా ఉన్న భరతఖండాన్ని ఒక దేశంగా మార్చింది మొఘలులే కదా, రాజ్యాల మధ్య యుద్ధాలను ఆపింది మొఘలులు వచ్చాకే కదా అనే మాటకు కౌంటర్‌ ఇస్తున్నారు. తమలో తాము కొట్లాడుకొన్నా, శత్రువులుగా ఉన్నా, యుద్ధాలు చేసుకున్నా సరే.. దేశ అఖండ సంపద, సంస్కృతి-సంప్రదాయాలు అలాగే ఉండేవి కదా అని గుర్తు చేస్తున్నారు. రాజులు రాజ్యాలను గెలిస్తే.. ఓడిన రాజ్యంలోని స్త్రీలను చెరిచిన ఘటన రాజ్యాలు ఉన్నప్పుడు కనిపించాయా అని గుర్తు చేస్తున్నారు.

అసలు.. నిజమైన అభివృద్ధి జరిగిందే మొఘలుల పాలనకు ముందు అని కొన్ని సాక్ష్యాధారాలు చూపుతున్నారు. ఇంద్రప్రస్థం, పాటలీపుత్రం, ద్రవిడ దేశం, మలయాళీ దేశం.. ఇలా ఎన్నో నగరాలు అప్పట్లోనే గొప్ప అభివృద్ధిని సాధించాయని చెబుతున్నారు. మొఘలుల వాసనే తగలని ఇప్పటి చెన్నై, కొచ్చిన్ ఎందుకని ఆనాడే గొప్ప నగరాలుగా విలసిల్లాయో చెప్పగలరా అనే ప్రశ్న సంధిస్తున్నారు. అసలు.. భరతఖండంలో అఖండ సంపద, గొప్ప అభివృద్ధే లేకపోతే.. మొఘలులు ఎందుకని దండయాత్ర చేయాల్సి వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు. చక్కటి విద్యావ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, నీటిపారుదల వ్యవస్థ, వర్తకం-వాణిజ్యంలో గొప్పగా రాణించిన భరతఖండానికి మొఘలులు కొత్తగా నేర్పిందేంటో చెప్పాలంటారు కొందరు చరిత్రకారులు. అజంతా ఎల్లారో, మహాబలిపురం, రామేశ్వరం, కోణార్క్ సూర్యదేవాలయం వంటి చారిత్రక కట్టడాల ముందు తాజ్‌మహల్, ఎర్రకోట, చార్మినార్‌ ఏమాత్రం తూగుతాయని సవాల్ చేస్తున్నారు.

ఒక యూనివర్సిటీని కట్టించి అదే అద్భుతం అనుకోవాలని చెబుతున్న ఓ వర్గం వాళ్లు.. ప్రపంచానికే విద్యను నేర్పిన నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల గురించి ఏం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. మొఘలుల పాలనలో ప్రపంచ దేశాల నుంచి బంగారం, వెండి రావడం కాదు.. రత్నమాణిక్యాలను కూరగాయల్లా అమ్మిన చరిత్ర మొఘలులు రాకముందే ఉందని చెబుతున్నారు. సిరిసంపదలతో వెలిగిపోతున్న భరతఖండంతో స్నేహం కోసం, వ్యాపారం కోసం ఎంత వెంపర్లాడాయో ఒక్కసారి చరిత్రను తవ్వి తెలుసుకోండంటున్నారు. నిజంగా మతసామరస్యంతో పాలించి ఉంటే.. 64వేల దేవాలయాల విధ్వంసాలు, 22 గొప్ప విశ్వ విద్యాలయాల మూసివేతలు జరిగేవా అని క్వశ్చన్ చేస్తున్నారు.

ఫైనల్‌గా ఏం చెప్పదలుచుకున్నారు అని ప్రశ్నిస్తే.. రెండు పార్శ్వాలు, రెండు కోణాలు, రెండు రకాల అభిప్రాయాలు కలగలిపి ఉన్నదే చరిత్ర. అంతేనా.. ఒక్కసారి చరిత్రలో వెనక్కి వెళ్లి.. చరిత్రను పరిశీలిస్తే.. విజేతలు రాసిందే చరిత్ర. వందల ఏళ్లుగా మన దేశంలోనూ జరుగుతున్నదదే. కానీ.. నిజం కూడా నిప్పులాంటిది.. చిన్న నిప్పురవ్వగా మొదలైనా.. దహించక మానదు. నిజం బహిర్గతం కాకా మానదు. కాబట్టి… ఏ వర్గం అయినా సరే.. ఆ చరిత్ర మాయలో పడకుండా సాటి మనిషిని మానవత్వంతో చూడ్డం ఒక్కటే ఇక్కడ జరగాల్సింది..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..