Elderly Life Quality: దేశంలోని ఈ రాష్ట్రాల్లో మెరుగ్గా వయోవృద్ధుల జీవన నాణ్యత.. పూర్తి వివరాలు
దేశంలో వయోవృద్ధుల జీవన నాణ్యతకు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీకి ఆర్థిక సలహా కమిటీ ఛైర్మన్ బిబేక్ దేబ్రోయ్ విడుదల చేసిన ఈ అధ్యయన నివేదికలో ఆసక్తికర అంశాలున్నాయి.
దేశంలో వయోవృద్ధుల జీవన నాణ్యతకు సంబంధించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కేంద్ర ప్రభుత్వం బుధవారం ఈ అధ్యయన నివేదికను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీకి ఆర్థిక సలహా కమిటీ ఛైర్మన్ బిబేక్ దేబ్రోయ్ ఈ అధ్యయన నివేదిక విడుదలచేశారు. దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పండుటాకుల జీవన స్థితిగతులను ఈ నివేదికలో పొందుపరిచారు. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మిజోరం, చండీగఢ్‌లో వయోవృద్ధుల జీవన నాణ్యత మెరుగ్గా ఉన్నట్లు తేల్చారు. వయోవృద్ధుల జనాభా 50 లక్షలకంటే ఎక్కువున్న రాష్ట్రాల కేటగిరీలో రాజస్థాన్, 50 లక్షలకు దిగువున ఉన్న కేటగిరీలో హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చండీగఢ్‌లో పెద్దవారి జీవన నాణ్యత బాగున్నట్లు తేల్చారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అధ్యయనం చేసిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ సంస్థ ఈ ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ఎల్డర్లీ ఇండెక్స్’ను రూపొందించింది. వయోవృద్ధుల ఆర్థిక, సామాజిక, ఆరోగ్య పరిస్థితులు, ఆదాయ భద్రత ప్రామాణికలను పరిగణలోకి తీసుకుని వారి జీవన నాణ్యతను అంచనావేశారు.
వయోవృద్ధుల జీవన నాణ్యతలో తెలంగాణ, గుజరాత్‌లు అత్యల్ప స్థాయిని నమోదుచేసుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరం అగ్రస్థానంలో నిలవగా.. అరుణాచల్‌ప్రదేశ్ చివరి స్థానంలో నిలిచాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్ మొదటి స్థానంలో నిలవగా, జమ్మూకశ్మీర్ చివరి స్థానంలో నిలిచింది. దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో వారికి ఆదాయ భద్రత, ఆర్థిక శ్రేయస్సు అంతంత మాత్రంగానే ఉన్నట్లు తేలింది.
దేశంలో వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో..వారి సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందని బిబేక్ దేబ్రోయ్ పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వారి జీవన నాణ్యతపై అవగాహనకు వచ్చేందుకు ఈ అధ్యయనం చేపట్టినట్లు వివరించారు. ముందుముందు వయోవృద్ధుల కోసం సరైన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విధానాల రూపకల్పనకు ఈ అధ్యయన నివేదిక దిక్సూచి అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
Also Read..
లిప్ట్‌లో ఇరుక్కుపోయిన వరంగల్ మేయర్ గుండు సుధారాణి.. సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ముప్పు