AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moral Story: బావి మాత్రమే అమ్మా.. నీళ్లను కాదు.. కృష్ణదేవరాయలు సైతం విప్పలేని చిక్కు ప్రశ్న!

విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల పాలనలో తెనాలి రామకృష్ణుడు తన చతురతతో ఎన్నో క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం చూపించారు. తన తెలివితేటలతో న్యాయాన్ని కాపాడుతూ, తప్పు చేసిన వారికి తగిన బుద్ధి చెప్పేవారు. అలాంటి ఓ ఆసక్తికరమైన సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Moral Story: బావి మాత్రమే అమ్మా.. నీళ్లను కాదు.. కృష్ణదేవరాయలు సైతం విప్పలేని చిక్కు ప్రశ్న!
Moral Story Ai Image
Anand T
|

Updated on: Nov 06, 2026 | 5:14 PM

Share

ఒకప్పుడు రామయ్య అనే నిరుపేద రైతు ఉండేవాడు. ఓ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో అతని పొలంలోని పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో అతని ఇంటి సమీపంలో సోమయ్య అనే ధనిక భూస్వామికి ఓ పాత బావి ఉండేది. ఆ బావిలో మాత్రం ఏడాది పొడవునా నీళ్లు సమృద్ధిగా ఉండేవి. అయితే తన పంటను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రామయ్య సోమయ్యను కలిసి బావి నుంచి నీళ్లు తోడుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. పంట చేతికి వచ్చిన తర్వాత డబ్బులు చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. అయితే సోమయ్య మాత్రం నీళ్లు ఇవ్వడానికి నిరాకరించాడు. బావి కావాలంటే కొనుక్కోవాలని షరతు పెట్టాడు. కావాలనే అధిక ధర చెబుతూ బావికి 500 వరహాలు నిర్ణయించాడు.

అంత డబ్బు లేకపోయినా పంటను కాపాడుకోవాలనే ఆశతో రామయ్య అప్పు చేసి, తన వద్ద ఉన్న సొమ్మును కలిపి 500 వరహాలు సమకూర్చాడు. ఊరి పెద్దల సమక్షంలో సోమయ్యకు డబ్బులు చెల్లించి బావిని కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను కూడా రాయించుకున్నారు. అయితే అసలు సమస్య మరుసటి రోజే మొదలైంది. బావి దగ్గరకు వెళ్లి నీళ్లు తోడుకునేందుకు ప్రయత్నించిన రామయ్యను సోమయ్య అడ్డుకున్నాడు. నేను నీకు బావిని మాత్రమే అమ్మాను. అందులోని నీళ్లను అమ్మలేదు. కాబట్టి ఆ నీళ్లు నావే అంటూ వాదించాడు. దీంతో రామయ్య ఆశ్చర్యపోయాడు. బావి తనదైనప్పుడు అందులోని నీళ్లు కూడా తనవేనని ప్రశ్నించాడు. కానీ సోమయ్య మాత్రం ఒప్పందంలో నీళ్ల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని మొండిగా వాదించాడు.

ఈ వివాదం చివరకు ఊరి పెద్దల వద్దకు చేరింది. ఇద్దరి వాదనలు విన్న పెద్దలు ఒప్పంద పత్రాలను పరిశీలించారు. అందులో బావి అమ్మకం గురించి మాత్రమే ఉండటంతో సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. దీంతో ఇద్దరూ శ్రీకృష్ణదేవరాయల రాజసభకు వెళ్లి తమ సమస్యను విన్నవించుకున్నారు.

తెనాలి రామకృష్ణుడి చతురతతో సమస్యకు పరిష్కారం

ఇద్దరి వాదనలు విన్న శ్రీకృష్ణదేవరాయలు సోమయ్యను ప్రశ్నించారు. బావిని అమ్మావా? డబ్బులు తీసుకున్నావా? ఇప్పుడు బావి ఎవరిది? అని అడిగారు. అందుకు సోమయ్య బావి రామయ్యదేనని అంగీకరించాడు. అయితే అందులోని నీళ్లు మాత్రం తనవేనని వాదించాడు. దీంతో రాజు ఈ సమస్యకు పరిష్కారం చూపించగల తెనాలి రామకృష్ణుడిని సభకు పిలిపించారు. జరిగిన విషయమంతా వివరించారు. సోమయ్యను ప్రశ్నించిన తెనాలి.. బావిని అమ్మినట్లు, అందులోని నీటిని అమ్మలేదని చెప్పినట్లు నిర్ధారించుకున్నాడు. తర్వాత తెనాలి రామకృష్ణుడు చమత్కారంగా తీర్పు చెప్పాడు. సోమయ్యా.. నీ మాట ప్రకారం బావి రామయ్యది, అందులోని నీళ్లు నీవి. అలాంటప్పుడు నీళ్లను రామయ్య బావిలో ఎందుకు ఉంచావు? నీళ్లు నీకు చెందినవే అయితే వెంటనే వాటన్నింటినీ బావి నుంచి తీసుకెళ్లి నీ స్థలంలో పెట్టుకో అని ఆదేశించాడు.

తెనాలి మాటలకు సోమయ్య ఖంగుతిన్నాడు. బావిలోని నీళ్లను ఎలా తీసుకెళ్లగలనని ప్రశ్నించాడు. వెంటనే తెనాలి స్పందిస్తూ.. నీళ్లు నీకు చెందినవని చెబుతున్నావు కదా! వాటిని ఇతరుల బావిలో ఉంచుకునే హక్కు నీకు లేదు. ఒకవేళ అక్కడే ఉంచాలనుకుంటే బావిని ఉపయోగించుకుంటున్నందుకు రామయ్యకు అద్దె చెల్లించాలి అని స్పష్టం చేశాడు. దీంతో సోమయ్యకు తన మోసం తనకే ఉచ్చుగా మారిందని అర్థమైంది. తెనాలి తెలివితేటల ముందు అతని వాదన నిలబడలేదు. చివరకు తన తప్పును అంగీకరించి మౌనంగా నిలబడిపోయాడు. తెనాలి రామకృష్ణుడి తీర్పుతో సంతోషించిన శ్రీకృష్ణదేవరాయలు రామయ్యకు బావిని పూర్తిగా ఉపయోగించుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. ఇకపై సోమయ్య ఎలాంటి అభ్యంతరం చెప్పకూడదని, ఒక్క వరహా కూడా అదనంగా అడగకూడదని ఆదేశించారు.

తనకు న్యాయం చేసిన తెనాలి రామకృష్ణుడికి రామయ్య కృతజ్ఞతలు తెలిపాడు. మరోవైపు సోమయ్య తన తప్పును తెలుసుకుని రామయ్యను క్షమాపణ కోరాడు. మొత్తంగా ఇక్కడ మనకు అర్థమైన నీతి ఏమంటంటే.. ఇతరులను మోసం చేయడానికి మాటల్లో మెలికలు పెట్టడం తెలివి కాదని, అలాంటి మోసాలు చివరకు మనకే తిరిగి వస్తాయని తెలుస్తోంది. నిజమైన తెలివితేటలు అంటే సమస్యను చాకచక్యంగా పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయడమే.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us