Success story: గుంటూరు టు సౌదీ వయా హైదరాబాద్.. మన ఆడపడుచు జర్నీ ఇది.. సౌదీ అరేబియాలో తొలి మెట్రో పైలెట్‌గా రికార్డు..
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ప్రతిభ చాటుతున్న భారతీయ మహిళలు సౌదీ అరేబియాలో కూడా తమ సత్తా చాటుతున్నారు. సౌదీ అరేబియాలో హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ లోకో పైలట్ గా పనిచేస్తున్నారు. ఆమే ఇందిరా ఈగలపాటి.
సౌదీ అరేబియా మంచి టూరిస్ట్ డెస్టినేషన్. అలాగే యువకులకు ఉపాధి కల్పనలో ముందుంటుంది. అయితే అది పురుషులకు మాత్రమే. మహిళలకు అక్కడ అంత స్వేచ్ఛ లేదు. వారు ఎప్పుడూ ముసుగు వేసుకోవాల్సిందే. కానీ ఇటీవల కాలంలో సౌదీ అరేబియా క్రమక్రమంగా మహిళలపై ఆంక్షలను ఎత్తివేస్తోంది. కఠిన నిబంధనలను సడలిస్తోంది. మహిళల పురోగతికి అడ్డుచెప్పడం లేదు. మహిళలు ఎట్టిపరిస్థితుల్లోను డ్రైవింగ్ చేయరాదని ఇంత కాలం ఉన్న నిబంధనను తాజాగా తొలిగించింది. దీంతో మహిళలు వాహనాలు నడిపే అవకాశం దక్కింది. అంతేకాక రియాద్ మెట్రో రైలులో ఓ మహిళా పైలెట్‌ను నియమించారు. అది కూడా తెలుగింటి ఆడపడుచు ఆ దేశంలో మొట్టమొదటి మెట్రో పైలెట్‌గా పనిచేస్తుండటం విశేషం.
విజన్ 2030లో భాగంగా..
సౌదీ అరేబియాలో విజన్ 2030లో భాగంగా మహిళలు ఇప్పుడు సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. మూస పద్ధతులు విడనాడతున్నారు. కొత్త దారుల్లో పయనిస్తున్నారు. అక్కడి మహిళలు ఇప్పుడు వాహనాలే కాదు, రైళ్లను కూడా నడుపుతున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ప్రతిభ చాటుతున్న భారతీయ మహిళలు సౌదీ అరేబియాలో కూడా తమ సత్తా చాటుతున్నారు. సౌదీ అరేబియాలో హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ లోకో పైలట్ గా పనిచేస్తున్నారు. ఆమే ఇందిరా ఈగలపాటి. సౌదీ అరేబియాలో మెట్రో రైలు నడుపుతున్నారు తెలుగు మహిళ ఇందిర.
గుంటూరులో పుట్టి.. హైదరాబాద్‌లో చేరి..
ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన ఇందిర హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆమె ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆమె ఇప్పుడు సౌదీలో మెట్రో రైలు నడుపుతున్నారు. రియాద్ మెట్రో రైలులో పైలట్‌గా పనిచేస్తున్నారు. సౌదీ అరేబియాలో రైళ్లు నడపడానికి ముందు..ఇందిర హైదరాబాద్ మెట్రో రైల్‌లో మూడేళ్లు పనిచేశారు. ఐటీ ఇంజనీరింగ్ పోస్ట్-గ్రాడ్యుయేట్ అయిన ఇందిర ఇప్పటివరకు 15,000 కిలోమీటర్లకుపైగా రైలు నడిపారు. ఐటీ రంగంలో ఈజీగా రాణించే ప్రతిభ ఉన్నా ఆమె మాత్రం తన స్నేహితుల కంటే విభిన్నంగా ఆలోచించారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జాబు కంటే రైలు నడపటమే ఇష్టంగా చేసుకున్నారు. ఆమె స్నేహితులు సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడినా ఆమె మాత్రం వారికి భిన్నంగా లోకో పైలెట్ అయ్యారు. ఇదే క్రమంలో ఆమె ప్రతిభను గుర్తించి సౌదీ అరేబియాలోని రియాద్ మెట్రో ఆమెకు ఉద్యాగాన్ని అందించింది.
నాన్న గొప్పతనమే..
తన రైలు ప్రయాణం గురించి ఇందిర ఎన్నో విషయాలు వెల్లడించారు. ‘నా చిన్నతనంలో నేను మెకానిక్ గా ఉన్న మా నాన్నకు పనిముట్లు అందిస్తూ సహాయం చేసేదాన్ని. అలా నేను నా అభిరుచులకు అనుగుణంగా లోకో పైలెట్ అయ్యా. నేను ప్రపంచంలోని అత్యంత అధునాతన రైళ్లలో ఒకదాన్ని నడుపుతున్నా. మేము ముగ్గురం ఆడపిల్లలమే అయినా మా నాన్న మమ్మల్ని చదివించారు. కానీ మా బంధువులు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలి..కానీ వారిని చదివిస్తూ డబ్బులు ఇలా వృధా చేస్తున్నావు..ఆడపిల్లలు ఎంత చదివినా పెళ్లి చేయాల్సిందే కదా..అని చెప్పినా మానాన్న మాత్రం మమ్మల్ని చదివించి విద్యావంతుల్ని చేశారు. ఈరోజున నేను అధునాతన రైళ్లు నడపగలుగుతున్నాను అంటే మానాన్న గొప్పతనమే’ అని చెప్పారు.
అంతదూరం అవసరమా..
‘నేను రియాద్ మెట్రోకు ఎంపికైనప్పుడు.. మా బంధువుల్లో చాలా మంది ఒంటరి మహిళ రైలు పైలట్‌గా పనిచేయడానికి సౌదీ అరేబియాకు ఎలా పంపిస్తారు? అంటున్నా మానాన్న ఏమాత్రం భయపడలేదు. భయపడితే అనుకున్నది సాధించలేం అంటూ ప్రోత్సహించారు. నా పట్టుదల చూసి మా నాన్న ప్రోత్సహించారు..అలా నేను దేశం దాటి సౌదీకి చేరుకున్నా’.
భర్త కూడా..
ఫుట్‌బాల్ ప్రపంచకప్ సమయంలో సౌదీ అరేబియా అక్కడికి పంపిన తర్వాత ఇందిర కూడా రైలును దోహాలో నడిపారు. విజన్ 2030లో భాగంగా సౌదీ అరేబియాలో మహిళా సాధికారతతో ఆమె తన సౌదీ మహిళా సహోద్యోగులను ప్రశంసించారు. సౌదీ మహిళా పైలట్‌లు.. మెట్రో రైలు పైలట్‌లలో ప్రధాన భాగం అని పేర్కొన్నారు. ఇందిర సౌదీ వెళ్లేనాటికి వివాహం కాలేదు. కానీ ఇప్పుడు ఆమె వివాహిత. ఆమె భర్త కూడా ఖతార్‌లో లోకో పైలట్‌గా పనిచేస్తున్నారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..