AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paragliding: పీడకలగా మారిన పారాగ్లైడింగ్‌.. రెండు గంటల పాటు గాలిలోనే ప్రాణాలు..

మీరు ఊపిరి సినిమా చూశారా? అందులో నాగార్జున శరీరం మొత్తం పక్షవాతం ఉంటుంది. మెదడు మాత్రమే పనిచేస్తుంది. ఆ సినిమాలో హీరో అలా అవడానికి కారణం పారాగ్లైడింగ్‌. సరిగ్గా అలాంటి ఘటన కేరళలో జరిగింది. అయితే ఆ పారాగ్లైడర్ల అదృష్టం కలిసొచ్చి ప్రాణాలతో బయటపడ్డారు.

Paragliding: పీడకలగా మారిన పారాగ్లైడింగ్‌.. రెండు గంటల పాటు గాలిలోనే ప్రాణాలు..
Paragliding(Representation picture)
Madhu
|

Updated on: Mar 09, 2023 | 1:15 PM

Share

మీరు ఊపిరి సినిమా చూశారా? అందులో నాగార్జున శరీరం మొత్తం పక్షవాతం ఉంటుంది. మెదడు మాత్రమే పనిచేస్తుంది. ఆ సినిమాలో హీరో అలా అవడానికి కారణం పారాగ్లైడింగ్‌. ఈ సాహస క్రీడ చేస్తూనే ప్రమాదానికి గురై హీరో అలా జీవచ్ఛవంలా మారిపోతాడు. ఇప్పుడెందుకు ఈ స్టోరీ అని ఆలోచిస్తున్నారా? సరిగ్గా అలాంటి ఘటన కేరళలో జరిగింది. అయితే ఆ పారాగ్లైడర్ల అదృష్టం కలిసొచ్చి వారు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ రెండు గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గాలిలో వేలాడుతూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ప్రాణాల మీదకు తెచ్చిన సరదా..

పారాగ్లైడింగ్‌కు వెళ్లిన ఓ 28ఏళ్ల పర్యాటకురాలితో పాటు దాని శిక్షకుడు.. బలమైన గాలులకు దారితప్పి ఎత్తయిన హైమాస్ట్‌  స్తంభానికి చిక్కుకుపోవడం స్థానికకంగా కలకలం రేపింది. కేరళలోని వర్కళ బీచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన ఒక మహిళ బీచ్‌కు వచ్చి పారాగ్లైడింగ్ చేయాలనుకుంది. దీంతో ఆమెను ఒక ప్రొఫెషనల్ పారాగ్లైడర్ తనతోపాటు పారాషూట్ ద్వారా గాల్లోకి తీసుకెళ్లాడు. అయితే, గాల్లో ఎగురుతుండగా ఉన్నట్లుండి గాలి దిశ మారింది. అది కూడా వేగంగా గాలి వాళ్లిద్దరినీ మరోవైపు లాక్కెళ్లింది. దీంతో వెళ్లాల్సిన దిక్కు కాకుండా ఇంకో దిక్కుకు కదిలిపోయారు. చివరకు ఒక ఎత్తైన హైమాస్ట్‌ లైట్ పోల్‌కు చిక్కుకున్నారు. అంత ఎత్తులో అక్కడ అమర్చిన లైట్లకు వారి పారాషూట్ చిక్కుకుంది.

గాలిలో వేలాడుతూ..

పారాషూట్‌ స్తంభానికి చుట్టుకోవడంతో దాని తాళ్లతో వేలాడుతూ, వాళ్లు ఆ పోల్‌ను పట్టుకుని ఉండిపోయారు. దాదాపు యాభై అడుగుల ఎత్తులో ప్రాణాలు అరచేత పట్టుకుని పోల్‌కు వేలాడుతూ ఉండిపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అయితే, వాళ్లు ఉన్నంత ఎత్తుకు సరిపడా నిచ్చెన వాళ్ల దగ్గర లేదు. దీంతో వారిని రక్షించడం కష్టమైంది. కానీ, ముందు జాగ్రత్తగా కింద వల, మ్యాట్రెస్ వంటివి ఏర్పాటు చేశారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి వారిని కిందికి దించారు. ఈ ఘటనలో వారికి స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..