కొడుకు మరణం కలచివేసింది.. తన కష్టం ఎవరికి రావద్దనుకున్నాడు.. అంబులెన్స్ కొని ఉచిత సేవ చేస్తూ ఆదర్శంగా నిలిస్తున్నాడు..!

కరోన మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో.. ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలబడుతూ మానవత్వం ఇంకా మిగిలి ఉంది అని నిరూపిస్తున్నారు..

కొడుకు మరణం కలచివేసింది.. తన కష్టం ఎవరికి రావద్దనుకున్నాడు.. అంబులెన్స్ కొని ఉచిత సేవ చేస్తూ ఆదర్శంగా నిలిస్తున్నాడు..!
Free Ambulance Service For Covid 19 Victims

Free Ambulance Service: కరోనe మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో.. ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలబడుతూ మానవత్వం ఇంకా మిగిలి ఉంది అని నిరూపిస్తున్నారు.. కరోనా సోకినవారిని సొంత మనుషులే పట్టించుకోక వదిలిపెట్టి పోతున్న సందర్భల్లో తనవంతు సహాయం చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ యువకుడు.

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన అంజాద్.. కరోనా కష్ట కాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వారికి అండగా నిలబడుతున్నాడు. ఇప్పటికే మహమ్మారి వ్యాధికి గురై.. ఎటు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నవారిని ఓదార్చే వారు లేకపోవడంతో చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. ఇలాంటి ఘటనలు అంజాద్ ను తీవ్రంగా కలిచి వేసాయి. ఎదో విధంగా వారిని సాయం అందించాలనుకున్నాడు. దీంతో వారికోసం అంజాద్ సేవ చేయడానికి ముందుకు వచ్చాడు.

తన స్వంత డబ్బులతో ఒక అంబులెన్స్‌ను కొని ప్రత్యేకంగా కోవిడ్ బాధితుల కోసం ఆ వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. అంబులెన్స్‌లో కరోనా బాధితులను ఎక్కించుకొన్న మొదలు.. ఆ బాధితున్ని హాస్పిటల్ కు చేర్చే వరకు అన్ని తనే దగ్గరుండి చూసుకుంటాడు. దీనికోసం వారి నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అంబులెన్స్ సర్వీసులను ఉచితంగా అందిస్తున్నాడు. ఇప్పటి వరకు సుమారు 200 మంది వ్యక్తులకు ఉచిత సహాయాన్ని అందించాడు అంజాద్. కోవిడ్ తో మరణించిన మృతదేహాలకు సైతం కుటుంబ సభ్యులు ఎవరు రాకపోతే అంత్యక్రియలు తానే దగ్గరుండి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడు ఫోన్ చేసిన రాత్రి, పగలు అనే తేడా లేకుండా తన సేవలను అందిస్తున్నాడు అంజాద్. సదాశివపేట నుండి హైద్రాబాద్ వరకు.. రోగులు కోరుకున్న హాస్పిటల్ వరకు వారిని తీసుకెళ్తాడు.

ఒక్క అంబులెన్స్ సర్వీస్ కాకుండా సదాశివపేట బస్ స్టాండ్ వద్ద పేదవారికి ప్రతిరోజు దాదాపు 150 మంది వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. మొదటి విడత లాక్ డౌన్‌లో కూడా ఎంతో మంది పేదవారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేసాడు. అప్పటి నుండి తనకు తెలిసిన మిత్రులతో కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఎంతో మంది అభాగ్యుల ఆకలి తీరుస్తున్నాడు. దీనికోసం ప్రతి నెల దాదాపు 60 వేల రూపాయల తన స్వంత డబ్బును ఖర్చు పెడుతున్నాడు అంజాద్. కోవిడ్ బాధితులను ఇలా తీసుకువెళ్తున్నారు మీకు ఏదయినా జరుగుతుందని భయం వేయడం లేదా అని అడిగితే.. అతను చెప్పే సమాధానం ఏం చేయకుండా చనిపోవడం కంటే సేవ చేస్తూ చనిపోవడం తనకు ఇష్టం అని చిరునవ్వుతో సమాధానం ఇస్తున్నాడు అంజాద్. ఈ మాటలే అతని సేవ దృక్పధనికి నిదర్శనం.

సయ్యద్ అంజాద్ చిరు వ్యాపారి. ఏడేళ్ల క్రితం అంజాద్ మూడు నెలల వయస్సున్న తన కుమారుడు అనారోగ్యం పాలయ్యాడు. ఆరోగ్యం విషమిస్తుండటంతో తక్షణమే హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. వెంటనే అంబులెన్స్ పిలిపించమన్నారు. హైదరాబాద్‌కు వెళ్లేందుకు 3,500 రూపాయలు అంబులెన్స్ కు చెల్లించాలని చెప్పారు. చేతిలో అంత డబ్బులు లేని అంజాద్ డబ్బుల కోసం ప్రయత్నిస్తుండగానే బాబు పరిస్థితి విషమించి కన్నుమూశాడు..తనలాంటి కష్టం ఏ తండ్రికి రాకూడదని ఆ క్షణమే అంజాద్ ఉచిత అంబులెన్స్ సర్వీస్ నడపాలని నిర్ణయించుకున్నాడు. 7 సంవత్సరాల పాటు కూడబెడుతూ దాదాపు 8 లక్షల రూపాయలు జమ చేశాడు. కొత్త అంబులెన్స్ కొనుగోలు చేసి సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల్లో ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కోవిడ్ బాధితులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. దీంతో పాటు వారసత్వంగా వచ్చిన ఆయుర్వేద వైద్యంను సైతం ఉచితంగా నిర్వహిస్తూ అందరి ఆదరణ పొందుతున్నారు.

అంజాద్ చేస్తున్న సేవలకు సదాశివపేట పట్టణంలోని ప్రజలు అభినందిస్తున్నారు. తమలాంటి పేదవారికీ ఇతని సహాయం ఎంతగానో ఉపయోగపడుతుంది అని అంటున్నారు.. మరోవైపు ఆసుపత్రి వర్గాలు కూడా ప్రస్తుత కోవిడ్ పరిస్థితులలో అతను చేస్తున్న సహాయాన్నీ ప్రశంసి స్తున్నారు. ఏలాంటి ఆదాయాన్ని ఆశించకుండా ఎంతోమందికి ఈ కష్టకాలంలో ఆదుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also…  మాస్క్‏ను ఎప్పుడూ ధరించడం వలన ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతాయా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే..