AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అట్టహాసంగా పెళ్ళి వేడుకలు.. బరాత్‌ల పేరుతో హంగామాపై మతపెద్దల సంచలన నిర్ణయం!

హైదరాబాద్ నగరం పాతబస్తీ ప్రాంతంలో అర్థరాత్రి వరకు జరిగే వివాహాలపై ఇక్కడి ముస్లిం మత పెద్దలు మండిపడుతున్నారు. రోజంతా చాలదు అన్నట్లు అర్ధరాత్రి సమయంలో పెళ్లి తంతు పెట్టుకుని వీధుల్లో నానా హంగామా సృష్టిస్తున్నారని, దీనివల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అట్టహాసంగా పెళ్ళి వేడుకలు.. బరాత్‌ల పేరుతో హంగామాపై మతపెద్దల సంచలన నిర్ణయం!
Marriage Baraat
Noor Mohammed Shaik
| Edited By: Balaraju Goud|

Updated on: Jul 03, 2024 | 3:29 PM

Share

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే అతి పెద్ద ముచ్చట. దాని కోసం ఎంతైనా ఖర్చు పెట్టి, పది మందిని పిలిచి జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకుని ఆనంద పడాలని చాలా మందికి ఉంటుంది. కానీ, ఇక్కడ తమ ఆనందం కోసం ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఎంత కౌన్సిలింగ్ ఇస్తున్నా, కొందరిలో మార్పు రావడంలేదు.

హైదరాబాద్ నగరం పాతబస్తీ ప్రాంతంలో అర్థరాత్రి వరకు జరిగే వివాహాలపై ఇక్కడి ముస్లిం మత పెద్దలు మండిపడుతున్నారు. రోజంతా చాలదు అన్నట్లు అర్ధరాత్రి సమయంలో పెళ్లి తంతు పెట్టుకుని వీధుల్లో నానా హంగామా సృష్టిస్తున్నారని, దీనివల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిడ్‌నైట్‌ తర్వాత జరిగే వివాహాలకు తామెవరం వెళ్లడం లేదని, అలాంటి వాటిని ప్రోత్సహించేది లేదని తేల్చి చెబుతున్నారు.

ఇటీవల కాలంలో పెళ్లి వేడుకల రూపురేఖలు మారిపోయాయి. హంగు ఆర్భాటాలు ఎక్కువయ్యాయి. చాలా మంది ముస్లిం యువకులు మసీదులో నిఖా నిర్వహించుకుని అర్ధరాత్రి సమయాల్లో బరాత్‌లు చేస్తున్నారు. బరాత్ అంటే మరి సాధారణంగా ఉంటుందా?.. పెద్ద పెద్ద డీజేలు పెట్టి చెవులు చిల్లులు పడేలా సౌండ్ పెట్టి నడిరోడ్డు మీద డాన్సులు చేస్తూ హంగామా సృష్టిస్తున్నారని, దీనివల్ల ప్రతి ఒక్కరికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు. పైగా ఇలాంటి కార్యక్రమాల్లో యువత పాల్గొని మద్యం తాగి విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తారని, ఇలాంటి చర్యల వల్ల ఇళ్లల్లో కుటుంబంతో కలిసి సరిగా నిద్ర కూడా పోలేకపోతున్నామని చెబుతున్నారు.

పెళ్లి కూతురి నుంచి వరకట్నం తీసుకుని ఇప్పటి యువత బరాత్‌లు, బ్యాండ్‌ బాజాలు పెట్టి ఇష్టానుసారం డబ్బులు ఖర్చు పెడుతున్నారనేది మత పెద్దల వాదన. సరైన సంపాదన కూడా లేని కొందరు ఇలా అమ్మాయి డబ్బుతో ఆర్భాటాలకు పోతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముస్లిం మతపెద్దలు మండిపడుతున్నారు. ఇది ఇంతటితో ఆగకుండా బరాత్‌లలో కత్తులు, తల్వార్లతో విన్యాసాలు చేస్తూ చట్ట విరుద్ధమైన చర్యలకు సైతం పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇతరులను ఇబ్బంది పెట్టడమే కాకుండా మర్ఫా, బ్యాండ్‌ బాజాలతో అనవసరమైన ఖర్చులు పెట్టి ఆర్థికంగా వారు కూడా దెబ్బతింటున్నారని, దీనిపై వారికే ఒక అవగాహన రావాలని అంటున్నారు. విచ్చలవిడిగా అనవసరమైన ఖర్చులు పెట్టే వివాహాలను ఖాజీలు జరిపించకూడదని, దీనిపై వక్ఫ్‌బోర్డు చర్యలు తీసుకోవాలని ముస్లిం మత పెద్దలు కోరుతున్నారు. అయితే.. ఇదిలా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లకు అనవసర ఖర్చులు చేస్తున్న పలు ప్రాంతాల్లో ఖాజీలు నిఖాలు జరపబోమని నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే..!

ఈనేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు సైతం అర్థరాత్రి బరాత్‌లపై చర్యలు తీసుకుంటారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించి, ట్రాఫిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసే వారిపట్లు కఠినంగా వ్యవహారిస్తున్నారు.

మరిన్ని హ్యమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…