Reliance: ఫ్యూచర్ స్టోర్స్‌ని రీబ్రాండింగ్ చేస్తున్న రిలయన్స్.. 30 వేల మందికి ఉద్యోగాలు
Reliance: రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ రిటైల్ మధ్య కుదిరిన ఒప్పందంతో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. స్టోర్ లీజులు రిలయన్స్ పేరు
Reliance: రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ రిటైల్ మధ్య కుదిరిన ఒప్పందంతో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. స్టోర్ లీజులు రిలయన్స్ పేరు మీద ఉండడంతో ఫ్యూచర్ రిటైల్ స్టోర్స్‌ని తీసుకోవడాన్ని రిలయన్స్ ప్రారంభించింది. ఇకపై ఫ్యూచర్ వీటిని నిర్వహించే వీలుండదు. ఈ స్టోర్స్‌లో పని చేసే వారందరికీ రిలయన్స్ ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. ఫ్యూచర్ రిటైల్ నెట్ వర్క్ లో పని చేస్తున్న దాదాపు 30,000 మంది కొనసాగించేందుకు వీలు కల్పిస్తుంది. దీంతో ఫ్యూచర్ కంపెనీ ఉద్యోగులు హర్షిస్తున్నారు. నెలల తరబడి కొనసాగిన అనిశ్చితి నుంచి వారు ఉపశమనం పొందారు. ఉద్యోగభద్రత దొరికిందని సంబరపడుతున్నారు.
అదే విధంగా విక్రేతలు, సరఫరాదారులు కూడా ఊరట చెందారు. వారు తమ బకాయిలు పొందుతున్నారు. వ్యాపారం నిలకడగా కొనసాగుతుందని భావిస్తున్నారు. భారీ కార్పొరెట్ సంస్థ తమ నూతన కస్టమర్ కావడం కొత్త వ్యాపార అవకాశాలను అందించగలదన్న ఆశాభావంతో ఉన్నారు. భవన యజమానులు సైతం తమ స్టోర్స్‌ని రిలయన్స్‌కి లీజుకు ఇస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది అద్దెలు ఫ్యూచర్ గ్రూప్ నుంచి వారికి అందలేదు. ఆ బకాయిలను తీర్చే విషయంలో ఫ్యూచర్ శక్తి సామర్థ్యా లపై వారు అనుమానంగా ఉన్నారు. ఇప్పుడు రిలయన్స్ వారి పాత బకాయిలను తీర్చింది. ఇప్పుడు అద్దెలను క్రమం తప్పకుండా పొందగలుగుతున్నారు.
ఫ్యూచర్ రెండేళ్ల నుంచి కష్టాల్లో చిక్కుకుంది. రుణదాతలకు చెల్లింపులు చేయలేకపోయింది. 2020 మధ్యలో తన రిటైల్ ఆస్తులను రిలయన్స్‌కి విక్రయించేందుకు చర్చలు జరిపింది. కానీ అమెజాన్ లేవనెత్తిన అంశం అడ్డుగా నిలిచింది. ఫ్యూచర్ రిటైల్ బిజినెస్ నియంత్రించేందుకు ఇది అవరోధంగా మారింది. అదే సమయంలో అమెజాన్ ఈ మల్టీ బ్రాండ్ రిటైల్‌లో ఇన్వెస్ట్ చేయలేకపోయింది. ఎందుకంటే అలా ఇన్వెస్ట్ చేసేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు అంగీకరించవు. అయితే ఈ రిటైలర్ సంస్థను నియంత్రించాలన్న అమెజాన్ ఆరాటం న్యాయపరమైన వివాదాలకు దారి తీసింది. దీంతో రిలయన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆలస్యం జరిగింది.
అది ఉద్యోగుల్లో అనిశ్చితిని పెంచింది. విక్రేతలకు, సరఫరాదారులకు వ్యాపారాన్ని తగ్గించింది. భవనాల యజమానులకు, సప్లయర్స్‌కి రుణదాతలకు భారీగా బకాయిపడేలా చేసింది. దీంతో రుణదాతలు ఒత్తిళ్లను అధికం చేశారు. మరో వైపున కంపెనీ దివాళా తీయడం ప్రారంభమైంది. అది గనుక జరిగితే రుణదాతలకు ఎంతో నష్టం. అదే విధంగా కంపెనీ సిబ్బంది అంతా ఉద్యోగాలు కోల్పోతారు. కాగా ఫ్యూచర్ గ్రూపునకు దేశవ్యాప్తంగా 1700 దాకా ఔట్‌లెట్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 200 ఔట్‌లెట్లను రిలయన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.