రోడ్డు మధ్యలో ఉన్న ఆ బండకు మొక్కితే మోకాళ్లు, కీళ్ల నొప్పులు మటుమాయమవుతాయట
బండకు మొక్కితే మోకాళ్లు, కీళ్ల నొప్పులు మాయం..? అయ్యోయ్యో మేమేం ఇలాంటివి నమ్మమని చెప్పమండీ బాబు.. ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మితే త్వరగా షెడ్డుకు వెళ్లడం ఖాయం. అందుకే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్లను సంప్రదించండి.

మోకాళ్ల నొప్పులు చాలా ఇబ్బంది పెడతాయి. ఏ పనీ చేయడానికి కుదరదు. తిన్నగా నడిచే వీలు కూడా ఉండదు. కీళ్ల నొప్పులతో కూడా ఇంచుమించు ఇలాంటి సమస్యలే ఉంటాయి. కాగా ఇలాంటి నొప్పులకు కొందరు ఇంగ్లీషు మెడిసిన్ వాడతారు.. కొందరు ఆయుర్వేదిక్ మెడిసిన్ ట్రై చేస్తారు. ఇంకొందరు ప్రకృతి వైద్యం లేదా నాటుమందు కూడా వినియోగిస్తారు. కానీ కర్ణాటక చామరాజనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివశిస్తున్న కొందరు మాత్రం ఇలాంటి పెయిన్స్ వస్తే.. వెంటనే ఓ నేషనల్ హైవేపై ఉన్న రాయి వద్దకు వెళ్తున్నారు. అక్కడ మొక్కులు చెల్లిస్తే.. ఎలాంటి నొప్పులైనా ఇట్టే మటుమాయం అవుతున్నాయట. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
యలందూర్ నుంచి మాంపల్లి వైపు వెళ్తున్న నేషనల్ హైవేపై ఓ బండ చాలాకాలంగా ఉంది. ఎవరు ప్రచారం చేశారో.. ఎందుకు చేశారో తెలియదు కానీ.. ఆ బండకు మొక్కితే.. బాడీ పెయిన్స్, మోకాళ్లు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి నుంచి విముక్తి కలుగుతుందని ఊరూ వాడా మారుమోగిపోతుంది. దీంతో ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆ బండకు పూజలు చేసేందుకు పోటెత్తుతున్నారు. ఈ రూట్‌లో వచ్చే చాలామంది ఆ బండ వద్ద ఆగి మొక్కి వెళ్తున్నారు. నారికల్లు మారమ్మ అక్కడ కొలువు తీరిందని.. ఆమె తన మహిమతో ప్రజలు సమస్యలు పారద్రోలుతుందని స్థానికులు చెబుతున్నారు. అందుకే ఆ హైవేపై వాహనాల రద్దీ ఉన్నప్పటికీ జనాలు వెనక్కి తగ్గడం లేదు.
కాగా మెడిసిన్ వాడకుండా ఇలాంటి పూజలు చేస్తే.. ఎటువంటి ప్రయోజనం ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. మూఢ నమ్మకం కారణంగా సైకలాజికల్‌గా కాస్త స్వాంతన కలిగినట్లు అనిపించినా.. కాలం గడిచేకొద్దీ సమస్యలు తీవ్రం అవుతాయని.. అందుకే వెంటనే సంబంధిత డాక్టర్ల వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..