వంటింటి చిట్కాలు.. పదే పది నిమిషాలు.. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పికి ఇలా గుడ్‌బై చెప్పండి..
Ayurvedic: దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దాంతో చలి తీవ్రత అధికమవుతోంది. దానికి తోడు వర్షాలు..
Ayurvedic: దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దాంతో చలి తీవ్రత అధికమవుతోంది. దానికి తోడు వర్షాలు కూడా పడుతండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఏకకాలంలో అటు చలి.. ఇటు వర్షాలు పడుతుండటంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత వ్యాధులతో పాటు, జ్వరం బారిన పడుతున్నారు. ఇదే సమయంలో కరోనా రక్కసి వ్యాప్తి చెందుతుండటంతో ఆందోళనలో ఉన్న ప్రజలు తమకు కరోనా సోకిందేమో అని భయాందోళనకు గురవుతున్నారు. ఇలా ఓవైపు కరోనా మహమ్మారి.. మరోవైపు సీజనల్ వ్యాధులతో సతమవుతున్న ప్రజలు ఆస్పత్రులకు వెళ్లి తమ జేబులను గుల్ల చేసుకుంటున్నారు.
అయితే, చిన్న చిన్న జబ్బులైన జలుబు, దగ్గు, జ్వరానికి సైతం ప్రజలు విపరీతంగా శాస్త్రీయ మందులు వాడేస్తున్నారు. ఇలా ప్రతిదానికి మందులు వాడటం అంత మంచిది కాదని ప్రకృతి వైద్యులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ప్రకృతి పరంగా వచ్చిన వ్యాధులను ఇంట్లోని వస్తువులతోనే నయం చేయొచ్చునని చెబుతున్నారు. వంటింట్లో నిత్యం వాడే మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి, తేనే వంటి పదార్థాలతో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడమే కాకుండా.. చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చునని చెబున్నారు.
ఇక భారతీయ సంస్కృతిలో ఆయుర్వేదానికి ఉన్న ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎంతటి కఠినమైన జబ్బు అయినా సరే.. ప్రకృతిలో లభించే మూలికలు, ఇతరాలతో ఇట్టే నయం చేయొచ్చు. ఇక జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి చిన్న చిన్న సమస్యలను వంటింట్లో లభించే మసాలా దినుసులతోనే పూర్తిగా నయం చేయవచ్చు. అంతేకాదు.. కరోనా మహమ్మారిని సైతం ఎదుర్కోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. మరి ఆరోగ్య సంరక్షణ కోసం వంటి చిట్కాలెంటో.. వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
దాల్చినచెక్క-లవంగాలతో కషాయం ఈ కషాయం తయారు చేయడం కోసం మొదటగా చిన్నపాటి మట్టి కుండలో ఒక గ్లాసు నీరు పోయాలి. ఆ నీరు మరిగాక దాల్చినచెక్క ముక్క, రెండు మూడు లవంగాలు, కొన్ని ఏలకులు వేయాలి. ఇప్పుడు ఒక టీస్పూన్ పార్స్లీ, ఒక టీస్పూన్ తురిమిన అల్లం, సగం టీస్పూన్ నల్ల ఉప్పు, సగం టీస్పూన్ పసుపు, సగం టీస్పూన్ నల్ల మిరియాలు వేయాలి. వాటితో పాటు 5-6 తులసి ఆకులను వేయాలి. వీటన్నింటినీ కలిపి అందులోని నీరు సగం అయ్యే వరకు ఉడకబెట్టాలి. ఆ తరువాత మిశ్రమాన్ని వడపోసి భద్రపరుచుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజుకు కనీసం రెండుసార్లు తాగాలి. దీన్ని తాగడం వల్ల జలుబు, ఛాతి నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వైరస్‌ల నుంచి సంరక్షిస్తుంది.
అల్లంతో కషాయం ముందుగా ఒక చిన్న మట్టి కుండ గానీ, పాత్ర గానీ తీసుకుని అందులో నీటిని వేడి చేయాలి. ఆ తరువాత వేడి నీటిలో లవంగాలు, నల్ల మిరియాలు, ఏలకులు, అల్లం, బెల్లం వేసి కలపాలి. అలా వాటిని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఆ తరువాత కొన్ని తులసి ఆకులను కూడా వేయాలి. పాత్రలోని నీరు సగం అయ్యేవరకు మరిగించాలి. ఆ తరువాత కిందకు దింపి దానిని వడపోసి భద్రపరుచుకోవాలి. ఈ కషాయంలో బెల్లం కలపడం వల్ల కాస్త టెస్టీగా ఉంటుంది. కాబట్టి పిల్లలు సైతం సులువగా తాగుతారు. దీని ద్వారా గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
మిరియాలు, నిమ్మరసంతో కషాయం ఒక కప్పు నీటిని వేడిచేయాలి. ఆ నీటిలో ఒక టీస్పూన్ మిరియాలు, నాలుగు టీస్పూన్ల నిమ్మరసం వేసి మరిగించాలి. ఇలా చేసిన ఈ రసాన్ని ప్రతి రోజూ ఉదయం తాగాలి. ఈ కషాయాన్ని సేవించడం ద్వారా చలి నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో వేడిని పెంచుతుంది. అంతేకాకుండా.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను పూర్తిగా తగ్గిస్తుంది. చురుకుదనం, ఉత్సాహం పెరుగుతాయి.
వాము – బెల్లంతో కషాయం ఒక పాత్రలో గ్లాసు నీరు తీసుకుని బాగా మరిగించాలి. ఆ తరువాత సగం టీ స్పూన్ వాము, సరిపడా బెల్లం అందులో వేసి మరిగించాలి. అలా కాసేపు దానిని మరిగించాలి. ముందుగా మనం పోసిన నీరు సగం అయ్యే వరకు మరిగించాలి. ఆ తరువాత ఆ కషాయాన్ని వడపోసి తాగాలి. దీని ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణ వ్యవస్థను సరిదిద్దడంతో ఇది చాలా దోహదపడుతుంది. అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలను తొలగిస్తుంది. అంతేకాదు.. దగ్గు, కడుపునొప్పి సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.