55 వసంతాల ఏఆర్ రెహమాన్ : కీ బోర్డ్ ప్లేయర్‌గా కెరీర్ ప్రారంభించి, ప్రపంచ సంగీత సామ్రాజాన్ని ఏలుతున్న మేధావి

ఇంతింతై వటుడింతయై వామనుడు మూడు లోకాలను ఆక్రమించుకున్నట్లు.. చిన్న వయసులో కీ బోర్డ్ ప్లేయర్ గా సినీ పరిశ్రమలో కెరీర్ ను ప్రారంభించి...

55 వసంతాల ఏఆర్ రెహమాన్ : కీ బోర్డ్ ప్లేయర్‌గా కెరీర్ ప్రారంభించి, ప్రపంచ సంగీత సామ్రాజాన్ని ఏలుతున్న మేధావి
Follow us
Anil kumar poka

|

Updated on: Jan 06, 2021 | 9:33 AM

ఇంతింతై వటుడింతయై వామనుడు మూడు లోకాలను ఆక్రమించుకున్నట్లు.. చిన్న వయసులో కీ బోర్డ్ ప్లేయర్ గా సినీ పరిశ్రమలో కెరీర్ ను ప్రారంభించి… ఇప్పుడు ప్రపంచ సంగీత సామ్రాజాన్ని ఏలుతున్నాడు స్వర చక్రవర్తి ఏ ఆర్ రెహమాన్. సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, గీత రచయిత, నిర్మాత, సంగీతకారుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు నేడు. ఈ సంగీత మాంత్రికుడు నేటితో 54 ఏళ్ళు పూర్తిచేసుకొని 55 ఏళ్లలోకి అడుగు పెడుతున్నారు. జనవరి 6 తేదీ 1967 సంవత్సరంలో ఆర్. కె. శేఖర్, కస్తూరి దంపతులకు జన్మించాడు రెహమాన్. శేఖర్ సంగీత దర్శకుడు. ఆలయాల్లో భజన పాటలు పాడేవాడు. రెహమాన్ కు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు. అక్క కొడుకు జి. వి. ప్రకాష్ కూడా ప్రముఖ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. రెహమాన్ నాలుగేళ్ళ వయసు నుంచే తండ్రి దగ్గర పియానో వాయించడం నేర్చుకున్నాడు. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. దీంతో కుటుంబాన్ని పోషించడానికి .. 11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉన్నాడు. గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్‌లో పనిచేస్తూ జీవితం ప్రారంభించాడు. కొన్ని ప్రకటనలకు జింగిల్స్ సమకూర్చాడు. అయితే ఎ. ఆర్. రెహమాన్ ఎదుగుదలకు అన్ని విధాలా అండగా నిలబడిన తల్లి కరీమా బేగమ్ అనారోగ్యంతో గత కొన్ని రోజుల క్రితమే కన్నుమూశారు.

ట్రెడిషనల్ క్లాసిక్స్ నుంచి పాప్ వరకు అన్నిరకాల మ్యూజిక్స్‌ను మిక్స్ చేసి మ్యాజిక్ చేయగల సమర్థుడు ఏఆర్ రెహమాన్. ప్రపంచవ్యాప్తంగా ఈయన సంగీతానికి భారీ డిమాండ్‌తో పాటు సూపర్ ఫాలోయింగ్ ఉంది. భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఈ స్వర మాంత్రికుడు.. సంగీత దర్శకుడిగా మలయాళ దర్శకద్వయం సంతోష్-శివన్ ల దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకునిగా నటించిన యోధ సినిమాతో పరిచయం అయ్యాడు. అయితే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రంతో భారతదేశమంతటా పేరు పొందాడు. మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫస్ట్ మూవీతోనే జాతీయ స్థాయి ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు అందుకొని అందరి చూపును తనవైపుకు తిప్పుకున్నాడు.

దాదాపు రెండు దశాబ్ధాలకు పైగా సంగీత సాగరంలో ఈదుతున్న రెహమాన్.. ఏ భారతీయ సంగీత దర్శకుడూ చేరుకోలేని ఉన్నత శిఖరాల్ని అందుకున్నాడు. రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకుని భారతీయ సినిమా సత్తాను అంతర్జాతీయ వేదికపైకి సగర్వంగా తీసుకెళ్లిన ఘనత కూడా రెహమాన్‌ దే. రెండు గ్రామీ పురస్కారాలు, ఒక బిఎఎఫ్‌టిఎ పురస్కారం, ఒక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, 19 ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు వంటి ఎన్నో అవార్డులతో పాటు రివార్డులు రెహమాన్ చెంతకు చేరాయి.

కంపొసర్స్ … క్రీయేటర్స్… సృష్టి కర్త.. లకి తాము సృష్టించిన వాటిపై హక్కులు కలిగివుంటారు. మైకేల్ జాక్సన్, ఎల్విస్ ప్రేస్లీ వంటి సింగర్స్ కం పెర్ఫార్మర్స్ మరణించిన అనంతరం తర్వాత కూడా రాయల్టీ చట్టం వల్ల సుమారు 600 వందల కోట్లు ప్రతీ సంవత్సరమూ సంపాదిస్తున్నారు.. ఇదే అంశంపై ఏ ఆర్ రెహమాన్ పెద్ద యుద్ధమే చేసి విజయం సాధించారు. రాయల్టీ ఇవ్వడానికి షారూక్ ఖాన్ ఒప్పుకోలేదనీ.. ఆయన నిర్మించిన ఓం శాంతి ఓం సినిమా లొంచి బయటకి కూడా వచ్చేశారు.

2005 లో టైం మ్యాగజీన్ ఎంపిక చేసిన 10 ఉత్తమ సౌండ్ ట్రాక్స్ లో రోజా చిత్రంలోని పాటకు చోటుదక్కింది. 2009 లో ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులలో ఒకడిగా గుర్తింపులభించింది. రెహమాన్ గౌరవార్ధం కెనడా లోని ఒంటారియో రాష్ట్రంలోని ఒక వీధికి అతని పేరు పెట్టారు. సామాన్య కుటుంబంలో జన్మించి సినీ చరిత్ర పుటల్లో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న ఏ ఆర్ రెహమాన్ మరింత ఉన్నత శిఖరం అధిరోహించాలని కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతుంది టీవీ 9 వెబ్ టీం.