Hyderabad: అర్ధరాత్రి గర్బవతిని, ఇద్దరు పిల్లలను ఇంటి నుంచి గెంటేసిన భర్త.. !
పెళ్లి జరిగినప్పటి నుంచి తన భర్త తనను తీవ్ర వేధింపులకు గురి చేసినట్లు బాధితురాలు పోలీసుల ముందు గోడు వెళ్ళబోసుకుంది. మొదటిసారి ఆడపిల్లకు జన్మనిచ్చిన సమయంలో కూడా అదనపు కట్నం తేవాలని భర్త, అత్తామామ తనను చిత్రహింసలు పెట్టారని బోరున విలపించింది. ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది.

ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంత ముందుకు వెళ్తున్నా.. కొందరికి ఇప్పటికీ ఆడవాళ్లను తక్కువ చూపు చేసే బుద్ధి మాత్రం పోవడం లేదు. మనకు జన్మనిచ్చేది ఓ తల్లి.. పెళ్లి చేసుకునేది కూడా ఓ ఆడది.. కానీ, పుట్టే బిడ్డ మాత్రం ఆడపిల్ల కాకూడదని ఆలోచించే ప్రబుద్ధులు ఎందరో మన చుట్టూనే ఉన్నారు. ఇక్కడ కూడా ఓ మూర్ఖుడు.. తనకు పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అవుతుందేమోనని అనుమానంతో బరితెగించాడు. అర్థరాత్రి నిండు గర్భవతి అని కూడా చూడకుండా భార్యను బయటికి గెంటేశాడు. భార్యతోపాటు ఇద్దరు పసి పిల్లలను వీధీ పాలు చేశాడు ఈ హృదయ విదారక సంఘటన మన హైదరాబాద్ మహా నగరంలోనే చోటు చేసుకుంది.
హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్బర్ ఖాన్ అనే ఓ వ్యక్తి తన భార్య హుమేరా బేగం తనకు వద్దంటూ ఇంటి నుంచి గెంటేశాడు. దీనికి గల కారణం ఏంటో తెలిస్తే మీరు కూడా ఆ ప్రబుద్ధుడిని క్షమించరు. తనకు ఆడపిల్ల పుడుతుందని కట్టుకున్న భార్యను అందులోనూ గర్భవతిని అర్ధరాత్రి వేళ కనికరం అనేదే లేకుండా పుట్టింటికి పంపించేశాడు. ఆమెతో పాటు తన ఇద్దరు పిల్లలను కూడా గెంటేసిన కసాయి భర్త ప్రవర్తనకు ఇరుగుపొరుగు వారు సైతం దుమ్మెత్తి పోస్తున్నారు. అత్తామామ కూడా కొడుకుకే వత్తాసు పలకడం, కోడలిని ఇంటి నుంచి గెంటివేస్తున్నా అడ్డుకోకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది హుమేరా బేగం. తన పెళ్లి సమయంలో సారెగా పెట్టిన సామాన్లను సైతం అత్తవారింటికి పంపించి వేశారు. దీంతో ఆ నిండు చూలాలు దిక్కు తోచనిస్థితిలో రోడ్డు పాలై అష్టకష్టాలు పడుతోంది. దీంతో ఎలాగైనా తనను ఆదుకోవాలని, ఈ సమస్య నుంచి గట్టెక్కించాలని బాధితురాలు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పెళ్లి జరిగినప్పటి నుంచి తన భర్త తనను తీవ్ర వేధింపులకు గురి చేసినట్లు బాధితురాలు పోలీసుల ముందు గోడు వెళ్ళబోసుకుంది. మొదటిసారి ఆడపిల్లకు జన్మనిచ్చిన సమయంలో కూడా అదనపు కట్నం తేవాలని భర్త, అత్తామామ తనను చిత్రహింసలు పెట్టారని బోరున విలపించింది. ఇంతకు ముందు రెండు సార్లు గర్భవతి కావడం, అందులోనూ రెండు సార్లు ఆడపిల్లలే పుట్టడంతో భర్త వేధింపులు మరింత ఎక్కువయ్యాయని తెలిపింది. అంతేకాదు పుట్టింటికి వెళ్లగొట్టాడని తెలిపింది. ఇప్పుడు తాను ఎటూ వెళ్లలేని స్థితిలో ఉన్నానని, పైగా గర్భం దాల్చి ఉన్నానని తనకు దిక్కు ఎవరంటూ భర్త అక్బర్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ వేడుకుంటోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..