AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghost Fear: మారుమూల పల్లెలో మరణ ఘోష.. అంతు చిక్కని మిస్టరీ.. అసలేం జరుగుతోంది..?

అదొక అటవీ ప్రాంతం. చిన్నగా చీకటి పడుతోంది. అక్కడక్కడా పచ్చని చెట్లు గాలికి ఊగుతున్నాయి. అప్పుడే ఇంట్లోంచి బయటకొచ్చింది ఓ మహిళ. వింత శబ్దాలు రావడంతో ఏంటా అని నాలుగు అడుగులు అడవి వైపు వేసింది. అలా వెళ్లిన ఆమె గట్టిగా అరుస్తూ ఊరిలోకి పరుగులు తీసింది. అసలు అక్కడ ఏం జరిగింది..?

Ghost Fear: మారుమూల పల్లెలో మరణ ఘోష.. అంతు చిక్కని మిస్టరీ.. అసలేం జరుగుతోంది..?
Ghost Fear
Balaraju Goud
|

Updated on: Jun 24, 2024 | 7:37 AM

Share

ఊరు పేరు చుట్టుమెట్ట. అదొక అటవీ ప్రాంతం. చిన్నగా చీకటి పడుతోంది. అక్కడక్కడా పచ్చని చెట్లు గాలికి ఊగుతున్నాయి. అప్పుడే ఇంట్లోంచి బయటకొచ్చింది ఓ మహిళ. వింత శబ్దాలు రావడంతో ఏంటా అని నాలుగు అడుగులు అడవి వైపు వేసింది. అలా వెళ్లిన ఆమె గట్టిగా అరుస్తూ ఊరిలోకి పరుగులు తీసింది. అసలు అక్కడ ఏం జరిగింది..? ఆమె ఏం చూసింది..? అన్న విషయాలు వణుకు పుట్టిస్తున్నాయి. పొలిమేర సినిమాను మించిపోయే ట్విస్టులు, మసూదను మరిపించే సీన్స్‌ను అక్కడ ఎన్నో జరిగాయంటున్నారు గ్రామస్తులు.

విరూపాక్ష లాంటి హారర్‌ డ్రామా కాదిది. కాంచన లాంటి కల్పిత కథ అసలే కాదు. ఓ ఊరిలో జరిగిన రియల్‌ స్టోరీ. మనుషులను హత్య చేస్తున్న మోస్ట్‌ వాంటెడ్‌ గోస్ట్‌ మిస్టరీ. ఇది అల్లూరి జిల్లాలోని పెదబయల మండలంలో ఉన్న చుట్టుమెట్ట అనే చిన్న గ్రామం. కూలీ నాలీ చేసుకుని బ్రతుకే మనుషులు. కల్మషం లేని మనసులు ఉండే ప్రాంతం. పని, ఇళ్లు తప్ప వేరే లోకం తెలియని ఈ గ్రామానికి దెయ్యం భయం పట్టుకుంది. అకారణంగా జనాలు చనిపోతుండటం వణుకు పుట్టిస్తోంది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది..? చావులకు కారణం నిజంగా దెయ్యమేనా..? అసలు దెయ్యాలు నిజంగానే ఉన్నాయా..? అంటే అవుననే అంటున్నారు ఇక్కడున్న జనం. లేటెస్ట్‌గా జరిగిన ఓ సంఘటన మయూరి సినిమానే మించిపోయిందని అంటున్నారు.

అప్పుడప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నాయి. చెట్టు ఊగుతున్నాయి. అప్పుడే బయటకొచ్చింది ఆనాసమ్మ అనే మహిళ. పనిమీద అడవిలోకి వెళ్లింది. ఆమె అలా అడవిలోకి ఎంటర్‌ కాగానే పెద్ద అరుపులు, ఒకటే కేకలు. ఏంటి..? ఏంటీ శబ్దం అంటూ జనమంతా గుమికూడారు. అప్పుడే గట్టిగా ఆరుస్తూ.. ఊర్లోకి వచ్చింది ఆనాసమ్మ. ఆ సాయంత్రం నుంచి ఆమె పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి వింతగా ప్రవర్తించడం స్టార్ట్‌ చేసింది.

ఆమెలో మార్పును గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భూత వైద్యుడిని పిలిపించారు. ఇక పట్టింది దెయ్యమే ఈజీగా తరిమేస్తానంటూ.. పొలిమేర సినిమా రేంజ్‌లో సెట్‌ వేసి పూజలు స్టార్ట్‌ చేశాడా భూతవైద్యుడు. గాలి వదిలించే సమయంలో గట్టిగా పట్టుకోవడానికి ఓ మనిషి ఆమెతో పాటు ఉండాలన్నాడు. ఇక అంతా సిద్ధం చేసుకుని పని మొదలుపెట్టాడు. మరి ఏమైందో ఏమో… మహిళను పట్టుకున్న వ్యక్తి, ఆ భూతవైద్యుడు ఇద్దరూ అపస్మారకస్థితిలోకి వెళ్లి చనిపోయారు. ఇంకేముంది ఊరు ఊరంతా వణికింది. రాత్రంటే భయం మొదలైంది. బయటకు వెళ్లాలంటే బేంబేలెత్తిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ స్టోరీలో ట్విస్ట్‌ ఏంటంటే, వాళ్లు చనిపోయిన తర్వాత రోజు నుంచే మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో, జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఊరికి దెయ్యం పట్టిందని గజగజ వణుకిపోతున్నారు. మరోవైపు ఇంకో బిగ్‌ ట్విస్ట్‌ బెంబేలెత్తిస్తోంది. వాళ్లు చనిపోయే ముందు రోజే ఊరిలో వైద్య శిబిరం నిర్వహించారు. ఊరిలో ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవన్నారు వైద్యులు. దీంతో అసలు ఊరిలో ఏం జరుగుతోందో అర్ధం కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మొత్తంగా… చుట్టుమెట్ట గ్రామంలో మరణాల మిస్టరీ అంతు చిక్కట్లేదు. ఇద్దరు ఒక్కసారే చనిపోవడం.. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వాళ్లు ఒక్కసారిగా ఆనారోగ్యానికి గురికావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు చుట్టుమెట్ట మరణాల గురించి చుట్టుపక్క గ్రామాలు కథలు కథలుగా చెప్పుకుంటున్నాయి.

మరిన్ని హ్యమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..