AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Father’s Day: గెలిచినప్పుడు పది మందికి హ్యాపీగా చెప్పుకొనే వ్యక్తి.. ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునేది నానొక్కడే

Father's Day 2022: నాన్న..తన బిడ్డల ఆశయాలను నెరవేర్చే బాధ్యతను భుజాలకెత్తుకుని, వారి కలలను సాకారం చేసే ఓ రథంలా జీవించినంతకాలం కష్టపడుతూనే ఉంటాడు. నిజానికి ప్రతి ఇంటిలోనూ ఉండే..

Father's Day: గెలిచినప్పుడు పది మందికి హ్యాపీగా చెప్పుకొనే వ్యక్తి.. ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునేది నానొక్కడే
Subhash Goud
|

Updated on: Jun 18, 2022 | 8:30 PM

Share

Father’s Day 2022: నాన్న..తన బిడ్డల ఆశయాలను నెరవేర్చే బాధ్యతను భుజాలకెత్తుకుని, వారి కలలను సాకారం చేసే ఓ రథంలా జీవించినంతకాలం కష్టపడుతూనే ఉంటాడు. నిజానికి ప్రతి ఇంటిలోనూ ఉండే సర్వసాధారణమైన విషయం..నాన్న కష్టం ఎవరికీ కనిపించకపోవడం. ఎందుకంటే పిల్లల్ని కని, పెంచి, పెద్దచేసి, జీవితాన్నిచ్చి, పెళ్లిళ్లు చేసేంత వరకూ వారికి కనిపించేది అమ్మ కష్టమే. కానీ ఆ అమ్మ కష్టం వెనకాల నాన్న ఉంటాడు. అమ్మ ఇంట్లో కష్టపడితే.. నాన్న మనకన్నా ముందే లేచి మనకోసం పని, ఉద్యోగం అంటూ వెళ్లిపోతుంటాడు. అందుకే చాలా మందికి అమ్మలతోనే ఎక్కువ బంధం ముడిపడి ఉంటుంది. నాన్న మా కోసం ఏం చేశాడు ? అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు.

నాన్నే లేకపోతే అమ్మ మనకి జన్మని ఎలా ఇస్తుంది ? నాన్నే లేకపోతే ఎవరు మన బరువు, బాధ్యతల్ని తలకెక్కించుకుంటారు ? నాన్నే లేకపోతే ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవారమా ? నాన్నల్ని విమర్శించేవారంతా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే నాన్న గొప్పతనమేమిటో తెలుస్తుంది. చిన్నతనంలో మనకి ఏ చిన్న జ్వరమొచ్చినా.. కిందపడి దెబ్బతగిలినా అయ్యో నా బంగారు తండ్రికి, నా చిట్టితల్లికి ఎంత దెబ్బ తగిలింది అని ఏడ్చే తల్లుల్ని చూసుంటారు.. కానీ అమ్మకి కూడా కనిపించకుండా మనకోసం ఏడ్చిన తండ్రుల్ని ఎంతమంది చూసుంటారు. ఎంత కష్టమొచ్చినా ఆ బాధ పైకి కనిపించకుండా లోలోపలే దిగమింగుకుంటూ తన ఆశయాల్ని పక్కన పెట్టి నీ కోసం, నీ జీవితం కోసం తన జీవితాన్ని పక్కనపెట్టి చెమటోర్చి పనిచేస్తాడు. పుట్టినప్పటి నుంచి నీకు 25 ఏళ్ల వయసొచ్చేంతవరకూ నాన్న నీ కోసం ఎంత కష్టపడ్డాడో..నువ్వు ఓ బిడ్డకు తండ్రివైనప్పుడే అర్థమవుతుంది.

ఏసీ గదిలో నాన్న నీ పక్కన కూర్చుని.. నువ్వు చదివిన విశేషాలు చెప్తుంటే విని మురిసిపోతాడు. అబ్బా.. నా కూతురు, నా కొడుకు ఎంతటి ప్రయోజకులయ్యారో అనే ఆనందం ముందు తాను పడిన కష్టాన్నంతా మరిచిపోతాడు నాన్న. అలాంటి తండ్రుల్ని ఈ రోజుకి కూడా భారంగా భావించే భావితరాల తండ్రులు కూడా ఉన్నారు. కానీ వారు గ్రహించాల్సిన సత్యమొకటి ఉంది. మనం మన తల్లిదండ్రుల్ని ఎలా చూస్తామో.. మన పిల్లలు కూడా మనల్ని అలాగే చూస్తారు. ఎందుకంటే ప్రతి కొడుక్కి, కూతురుకి కూడా ఫస్ట్ అండ్ ది బెస్ట్ రోల్ మోడల్ నాన్నే కదా. పాతికేళ్లు అల్లారుముద్దుగా, ఏ కష్టం రానివ్వకుండా పెంచుకున్న కూతురు పెళ్లి అనే ఒకే ఒక్క బంధంతో ఒక్కరోజులో అప్పగింతలతో పుట్టింటి గడప దాటిపోతుంటే తండ్రి పడే వేదన అంతా ఇంతా కాదు. ఆ తండ్రి పడే బాధ ఎవరికీ అర్థం కాదు..ఒక్క కూతురికి తప్ప. తండ్రి – కూతుళ్ల మధ్య అంతటి అనుబంధం ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి

కొడుకు సుఖపడతాడు కదా అని తన కడుపు చూసుకోకుండా సంపాదించినా రూపాయి రూపాయి కూడబెట్టి ఇళ్లు, పొలాలు కొనిచ్చే తండ్రులున్నారు. కానీ..తండ్రి ఆస్తి పంపకాలు చేశాక ఆ తండ్రులను గెంటేసిన కొడుకులు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కొంతమంది వృద్ధులు ధర్మం అడుగుతుంటారు. వారిలో కొంతమందైనా ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నవారే ఉంటారు.

ఇది చదువుతున్న మీలో కొంతమందికి మాకు నాన్న లేడు..మాకు ఆ ప్రేమ తెలీదు అని అనిపించవచ్చు. కానీ తండ్రి లేకపోయినా తండ్రి బాధ్యతల్ని తన భుజానికెత్తుకుని ఇద్దరి ప్రేమను కలిపి పంచుతున్న తల్లులున్నారు. బిడ్డలకోసం జీవితకాలం కష్టపడే తండ్రుల కోసం సంవత్సరంలో ఒక్క రోజు సరిపోదు. అందుకే ఈ రోజైనా నాన్నకి ప్రత్యేక అభినందనలు తెలుపుదాం.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి