Srikakulam: అబ్బాయికి అమ్మాయి తాళి కట్టే వింత ఆచారం.. పెళ్లి చేసుకోవాలంటే మూడేళ్లు ఆగాల్సిందే
ఊరంతా పందిరి. ఇంటింటా పెళ్లి బాజాలు. మూడు రోజుల పాటు జరిగే పెళ్లి తంతు. ఒకే రోజు, ఒకే ముహూర్తానికి ఏకమైన 62 జంటలు. అమ్మాయి మెడలో అబ్బాయి తాళి కట్టడం అన్ని చోట్లా ఉండేదే. కానీ ఇక్కడ మాత్రం రివర్స్. అబ్బాయి... అమ్మాయి మెడలో తాళి కట్టడం వరకు ఓకే. తర్వాత అమ్మాయి నేనేం తక్కువ తిన్నానా అంటూ ఏం చేస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఇక ఆ ఊళ్లో పెళ్లి చేసుకోవాలంటే మూడేళ్లు ఆగాల్సిందే.
గ్రామాల్లో పెళ్లి అంటే ఆ సందడే వేరు. ఒక పెళ్లి జరిగితేనే ఆ సందడి ఊహించలేం. అలాంటిది గ్రామంలో ఒకేసారి 62 పెళ్ళిళ్ళు జరిగితే ఆ సందడి ఊహకే అందదు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని మత్స్యకార గ్రామమైన నువ్వల రేవు గ్రామానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ గ్రామస్తులకు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలంటే ఎనలేని గౌరవం. అందుకే ఏళ్లు గడుస్తున్నా.. సామూహిక వివాహాల సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మూడేళ్లకు ఒకసారి.. ఊరంతా పందిళ్లు వేసి, పచ్చని మామిడి తోరణాలతో అలంకరించి, వీధులను విద్యుత్ కాంతులతో నింపి.. ఒకే ముహూర్తంలో.. ఎంతో వైభవంగా వందల కొత్త జంటలు ఒక్కటవుతుంటాయ్.
నువ్వలరేవులో 3500కు పైగా కుటుంబాలున్నాయి. 13వేల జనాభా ఉంటుంది. శతాబ్దాల క్రితం ఒడిశా నుంచి వలసొచ్చిన కేవిటి కులస్తులు.. నువ్వలరేపు కేంద్రంగా నివాసం ఏర్పరచుకుని స్థిరపడ్డారు. మూడేళ్లకు ఒకసారి పెద్దల కుదిర్చిన ముహూర్తంలోనే.. గ్రామంలో పెళ్లీడుకొచ్చిన యువతీయువకులు ఒక్కటవుతుంటారు. ఈ గ్రామానికి చెందిన అమ్మాయిలకు.. అదే గ్రామానికి చెందిన అబ్బాయిలతో.. వివాహాలు జరిపించడం ఆనవాయితీ. ఇంటి పెద్దల అంగీకారం, అమ్మాయి, అబ్బాయిల ఇస్టానుసారమే పెళ్లిళ్లు నిర్ణయిస్తుంటారు. ఒకే ముహూర్తంలో.. అన్ని జంటలకు సామూహిక మాంగల్యధారణ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. కేవిటి సంప్రదాయం ప్రకారం.. రంగులు చల్లుకుంటూ ఊరేగింపుగా కులదేవత బృందావతి అమ్మవారి ఆలయానికి వెళ్తారు. అక్కడ కోనేరు నుంచి తెచ్చిన నీటితో పెళ్లికొడుకు మంగళ స్నానం చేసి ఇంటి ముందు పీటపై కూర్చుంటాడు. తర్వాత వధూవరులు ఆకువక్కలతో.. ఇంటింటికి వెళ్లి.. బంధువులు, స్నేహితులను పెళ్లికి ఆహ్వానిస్తారు.
పెళ్లికి కూడా చాలా ప్రత్యేకంగా ముస్తాబవుతారు. కట్నకానుకలు లేకుండా.. కేవలం అత్తారింటి వారిచ్చిన బట్టలు, స్నేహితులు, బంధువులు ఇచ్చిన కరెన్సీ నోట్లను దండగా మెడలో వేసుకొని.. పెళ్లి పీటలపై కూర్చుంటాడు పెళ్లి కొడుకు. అంతేకాదు.. హిందూ వివాహ పద్ధతిలో.. వరుడు.. వధువు మెడలో తాళి కడతాడు. తర్వాత.. వధువు కూడా వరుడికి బంగారంతో తయారు చేసిన ఆభరణాన్ని తాళిగా కడుతుంది. దీనిని.. దురుసం అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఒకరి మెడలో ఒకరు తాళి కట్టడం వల్ల సంసార జీవితంలో ఇద్దరు సమాన భాగస్వాములుగా సమాన బాధ్యతలతో ముందుకు వెళతామని చెప్పటం. పెళ్ళికూతురు పెళ్ళికొడుకుకు కట్టిన తాళిని18 రోజుల తర్వాత తీసి తన శతమానంలో కట్టుకుంటుంది పెండ్లి కుమార్తె.
మూడేళ్లకు ఒకసారి జరిగే ఈ సామూహిక వివాహాల కోసం.. చిన్నా, పెద్దా అంతా కలిసి వస్తారు. ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వలసెళ్లిన వాళ్లంతా.. గ్రామానికి చేరుకుంటారు. ఈ ఏడాది గ్రామంలో 62 సామూహిక వివాహాలు జరిగాయి. దీంతో దాదాపుగా ప్రతి వీధిలో బాజా భజంత్రీల సందడి నెలకొంది. ఈ సామూహిక వివాహాలకు మంత్రి అప్పలరాజు హాజరై, నూతన వధూవరులను అహ్వానించారు. కొన్ని శతాబ్దాల క్రితం మొదలైన ఈ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు.. కొత్త తరాలు కూడా సై అంటున్నాయ్. తరాలు మారినా, తమ సంస్కృతీ సంప్రదాయాలు చెరగవంటున్నారు గ్రామస్తులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…