Omicron: భయపెడుతోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌.. బూస్టర్‌ డోస్‌ ఎవరికి అవసరం.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

శాంతించిందనుకుంటోన్న కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ రూపంలో మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ ప్రపంచాన్ని భయపెడుతోంది.

Omicron: భయపెడుతోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌.. బూస్టర్‌ డోస్‌ ఎవరికి అవసరం.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Omicron

శాంతించిందనుకుంటోన్న కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ రూపంలో మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ ప్రపంచాన్ని భయపెడుతోంది. డెల్టా వేరియంట్‌ కంటే ఈ కొత్త వేరియంట్‌ మరింత ప్రమాదకరమైనదని, టీకాలు కూడా తక్కువ ప్రభావం చూపిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. టీకాల పంపిణీ త్వరగా పూర్తి చేయాలని సూచించింది. ఇక కొత్త వేరియంట్‌ విజృంభణ నేపథ్యంలో బూస్టర్‌(మూడో) డోస్‌ తీసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇప్పటికే అనేక దేశాలు తమ పౌరులకు బూస్టర్‌ డోస్‌ పంపిణీని ప్రారంభించాయి. అయితే మన దేశంలో మాత్రం ఇప్పటికీ ఆ డోస్‌ ఊసే లేదు. ఈ నేపథ్యంలో బూస్టర్‌ డోస్‌ అవసరమా? అవసరమైతే ఎలాంటి వారు తీసుకోవాలి? అన్న విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం రండి.

ఎందుకు తీసుకోవాలంటే.. కొవిడ్‌ నుంచి రక్షణ పొందాలంటే కనీసం రెండు డోసుల టీకా తీసుకోవాల్సి ఉంటుందని సైంటిస్టులు, వైద్య నిపుణులు చెబుతున్నారు . దీంతో ప్రతి ఒక్కరికీ కనీసం రెండు డోసులు వేసేలా అన్ని దేశాల చర్యలు తీసుకుంటున్నాయి. అయితే టీకా వేసిన కొన్ని నెలల తర్వాత శరీరంలో ఉత్పత్తైన యాంటీబాడీల (ప్రతిరక్షకాలు) సంఖ్య తగ్గుతున్నదని పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ రావడంతో బూస్టర్‌ డోస్‌ ప్రస్తావన వస్తోంది. ఇప్పటికే 73 దేశాల్లో బూస్టర్‌ డోస్‌ను పంపిణీ చేస్తున్నారు. కాగా ఈ విషయంపై ముంబయికి చెందిన ప్రముఖ వైద్యుడు స్పందిస్తూ ‘ దేశంలో ఇంకా కరోనా మహమ్మారి ఉంది . వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇప్పటికే చాలామంది రెండు డోసుల టీకా తీసుకుని వారి వారి పనుల్లో బిజీ అవుతున్నారు. అయితే టీకా తీసుకున్న తర్వాత కూడా రోగనిరోధక శక్తిపై చర్చ ఇంకా సాగుతోంది. అయితే రెండో డోస్‌ తీసుకున్న కనీసం 14 రోజుల తర్వాత యాంటీబాడీ టెస్ట్‌ ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ స్థాయులను తెలుసుకోవచ్చు. ఇప్పుడున్న టీకాలు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ అందిస్తున్నప్పటికీ పూర్తి స్థాయి ప్రభావం మాత్రం చూపడం లేదు. అందుకే కొద్ది కాలం తర్వాత రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి బూస్టర్‌ డోస్‌ పంపిణీ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరముంది’ అని చెప్పుకొచ్చారు.

ఎవరు తీసుకోవాలంటే.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు బూస్టర్‌ డోసు తీసుకోవాల్సిన అవసరముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, షుగర్‌, బీపీ, మూత్ర పిండాలు, కాలేయ సంబంధిత రోగులు, రేడియోథెరపీ, కీమోథెరపీ చేయించుకున్న రోగులు, 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, అన్ని రకాల హెల్త్‌కేర్ వర్కర్లకు అదనపు డోస్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

భయం వద్దు.. జాగ్రత్తగా ఉండాలి.. అయితే ఈ కొత్త వేరియంట్‌ ప్రమాదంపై ఇప్పటివరకు స్పష్టమైన అంచనాలు లేవు. ఇతర వేరియంట్ల కంటే డేంజర్‌ అని చెబుతున్నప్పటికీ దీని వల్ల నమోదైన మరణాల గురించి నివేదికలు లేవు. కాబట్టి ఈ వైరస్‌పై ఇప్పుడే కచ్చితంగా ఒక అంచనాకు రాలేమని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కొత్త మ్యూటెంట్లు వచ్చినప్పుడల్లా దాని క్లినికల్ ప్రొఫైల్, దాని తీవ్రత, ప్రభావాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది. అదేవిధంగా కొత్త వేరియంట్లు రోగనిరోధకశక్తి పై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. అప్పటివరకు కనీసం రెండు డోసుల టీకా తప్పనిసరిగా తీసుకోవాలి. అదే సమయంలో వైరస్‌ నుంచి రక్షణకు ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలి. అదే మనకు శ్రీరామ రక్ష.

Also read:

TS Govt. on Vaccination: ఈ నెలాఖరు నాటికి 100 శాతం వాక్సినేషన్.. తెలంగాణ సర్కార్ ప్రత్యేక కార్యాచరణ!

Covishield:ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయాల నేపథ్యంలో సీరమ్ అలర్ట్.. కోవిషీల్డ్‌ బూస్టర్‌ కోసం డీసీజీఐకు దరఖాస్తు

Omicron: చాపకింద నీరులా వ్యాపిస్తున్న ఒమిక్రాన్.. ఇప్పటి వరకు ఈ వేరియంట్‌ ఎన్ని దేశాలకు వ్యాపించిందంటే..!

Published On - 9:19 am, Thu, 2 December 21

Click on your DTH Provider to Add TV9 Telugu