Heart Attack: ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు.. ఇలా చేస్తే సెకన్లలోనే ప్రాణాలు సేఫ్
ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే భయపడకుండా కొన్ని తక్షణ చర్యలు తీసుకోవడం ప్రాణాపాయం నుండి బయటపడటానికి సహాయపడుతుంది. వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేసి, ఆస్ప్రిన్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోవద్దు. ప్రశాంతంగా ఉండి, నెమ్మదిగా శ్వాస తీసుకోవడం ముఖ్యం. ఇలా మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రాణాలను కాపాడుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

ఈ మధ్యకాలంలో గుండెపోటు అందరినీ భయపెడుతుంది. ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్ద వరకు అందరినీ ఇది కబళిస్తుంది. ముఖ్యంగా గుండెపోటుతో యువత ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తుంది. గుండెపోటుకు తక్షణ వైద్య సహాయం అవసరం. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే తట్టుకోవడం మరింత కష్టం. కానీ భయపడకుండా, సరైన సలహాలను పాటిస్తే ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు. గుండెపోటు సమయంలో ఆందోళన, భయం కలగడం సహజమే అయినప్పటికీ.. జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ముఖ్యం.
అతి ముఖ్యమైన మొదటి అడుగులు
మీకు గుండెపోటు వచ్చిందని అనిపిస్తే వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయండి. ఆ తర్వాత మీకు ఆస్ప్రిన్ అలర్జీ లేకపోతే ఆస్ప్రిన్ ట్యాబ్లెట్ వేసుకోండి. ఇది మీకు రిలీఫ్ ఇస్తుంది. ఈ సమయంలో ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. విశ్రాంతి తీసుకుని, సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోండి. మీకు ఇప్పటికే గుండె సమస్య ఉంటే మీ అత్యవసర మందులను దగ్గరలో ఉంచుకోవడం మంచిది. రక్తంలో ఆక్సిజన్‌ను నిర్వహించడానికి నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఈ సమయంలో ఎలాంటి శారీరక శ్రమ చేయకూడదు. పరిస్థితి మరింత క్లిష్టతరం కాకుండా ఉండటానికి ఏదైనా తినడానికి లేదా త్రాగడానికి ప్రయత్నించవద్దు.
గుండెపోటు అంటే ఏమిటి?
గుండెపోటు లేదా మైయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మీ గుండె కండరాల భాగాలకు తగినంత రక్త ప్రవాహం లేనప్పుడు ఇది సంభవిస్తుంది. ఇది సాధారణంగా గుండెలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ధమనులలో అడ్డంకి కారణంగా జరుగుతుంది. రక్త ప్రసరణ లేకపోతే ప్రభావితమైన గుండె కండరం చనిపోవడం ప్రారంభమవుతుంది. రక్త ప్రసరణ త్వరగా పునరుద్ధరించకపోతే అది మరణానికి దారితీస్తుంది.
గుండెపోటు సంకేతాలు – లక్షణాలు
ఛాతీలో అసౌకర్యం: ఛాతీ మధ్యలో కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండే లేదా వచ్చి వెళ్ళిపోయే అసౌకర్యం. ఇది బరువుగా, నిండుగా, పిండడం లేదా నొప్పిగా అనిపించవచ్చు.
శరీరంలో అసౌకర్యం: చేతులు, వీపు, మెడ, దవడ లేదా కడుపు వంటి పై శరీరంలో నొప్పి లేదా సాధారణ అసౌకర్యం.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: ఇది ఛాతీలో అసౌకర్యంతో లేదా లేకుండా రావచ్చు.
అసాధారణ అనుభూతులు: చల్లని చెమటలు, వికారం, వాంతులు లేదా తలతిరగడం వంటివి కలగడం. పురుషుల కంటే స్త్రీలు ఈ లక్షణాలను అనుభవించే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు అంటున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




