Sugar Detox: షుగర్ డిటాక్స్‌తో ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా?.. తెలియకపోతే ఇప్పుడే తెలుసుకోండి.. హెల్తీగా ఉండండి..

Sugar Detox: చాలామంది తమ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ చక్కెరను తీసుకుంటారు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.

Sugar Detox: షుగర్ డిటాక్స్‌తో ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా?.. తెలియకపోతే ఇప్పుడే తెలుసుకోండి.. హెల్తీగా ఉండండి..
Sugar Detox
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 07, 2021 | 11:29 AM

Sugar Detox: చాలామంది తమ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ చక్కెరను తీసుకుంటారు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే మితిమీరి చక్కెర పదర్థాలను ఆహారంగా తీసుకోవద్దు. అయితే, శరీరంలోని చక్కెరను తొలగించుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా షుగర్ డిటాక్స్. ఈ షుగర్ డిటాక్స్ వల్ల ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు. కూల్ డ్రింక్స్, బ్రెడ్, కేక్‌లు, స్వీట్స్ వంటి చక్కెర పదార్థాలను తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పాలలో ఉండే సహజ చక్కెర వలన ఎలాంటి నష్టం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే శరీరంలోని అధిక షుగర్ లెవల్స్‌ని తగ్గించుకోవడానికి షుగర్ డిటాక్స్ పద్ధతిని పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు. తీపి పదార్థాలు తినాలనే కోరికలను అణచివేసేందుకు.. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు కనీసం వారం నుంచి ఒక నెల పాటు చక్కెర పదార్థాలను తినకుండా ఉండాలంటున్నారు. దీనినే షుగర్ డిటాక్స్ అంటారు.

షుగర్ డిటాక్స్ ఎలా చేయాలి? షుగర్ డిటాక్స్ కోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. రోజూ తినే ఆహారంలో చక్కెర పదార్థాలు లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, స్వీట్లు, కేక్‌లు, కెచప్‌లకు దూరంగా ఉండాలి. శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగితే.. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. చక్కెర పదార్థాలను తినడం తగ్గించడం వలన తక్షణ ఫలితాలు చూపకపోయినా.. దీర్ఘకాలంలో అది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. షుగర్ డిటాక్స్ కనీసం ఒకటి నుంచి రెండు వారాల వరకు ప్రయత్నించాలి. షుగర్ డిటాక్స్ పూర్తయిన తరువాత.. తినే ఆహారంలో సహజ చక్కెర(పండ్లు, కూరగాయలు)ను స్వల్ప మొత్తంలో తీసుకుంటుండాలి.

షుగర్ డిటాక్స్ ప్రయోజనాలు.. షుగర్ డిటాక్స్ కేలరీలను తగ్గించడంలో, బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది. గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కావిటీస్, దంతాల రంగు మారడం, నోటి దుర్వాసనను తగ్గించడం ద్వారా మీ నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 2014 లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. ఒక్క రోజులో 17 నుంచి 21 శాతం కేలరీల షుగర్‌ను తీసుకునే వ్యక్తులు.. తక్కువ చక్కెరను వినియోగించే వ్యక్తుల కంటే 38 శాతం అధికంగా గుండె జబ్బుల బారిన పడి మరణిస్తున్నట్లు తేలింది.

షుగర్ డిటాక్స్ లక్షణాలు.. షుగర్ నియంత్రణ అంటే చాలా మందికి కష్టంగానే ఉంటుంది. ఈ షుగర్ డిటాక్స్ లక్షణాలు చాలామందిలో ప్రస్పుటంగా కనిపిస్తుంటాయి. షుగర్ డిటాక్స్ చేసే వ్యక్తుల్లో ధూమపానం(నికోటిన్‌) మానేసే ప్రయత్నం చేస్తున్న వారిలో కనిపించే లక్షణాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా.. తలనొప్పి, మైకం, చిరాకు వంటి లక్షణాలు ఒక వారం వరకు ఉంటాయి. ఆ లక్షణాలను తగ్గించడానికి ఈ కింది పద్ధతులను పాటించాలి.

అల్పాహారం తినండి.. ప్రొటీన్లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే అల్పాహారాన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమతులంగా ఉంటుంది. ఇవి తినడం వల్ల రోజంతా తీపి పదార్థాలను తినాలనే కోరికలను నియంత్రించవచ్చు.

నెమ్మదిగా ప్రారంభించండి.. షుగర్ పదార్థాలు తినకుండా ఉండటం కష్టంగా అనిపిస్తే.. ఒకేసారి మానేయకుండా.. మెల్ల మెల్లగా మానేయండి. రోజు తీసుకునే చెక్కర పదార్థాల స్థాయిని క్రమంగా తగ్గించండి.

ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు తినాలి.. వాల్ నట్స్, ఫ్యాటీ ఫిష్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వు కలిగిన పదార్థాలు.. తీపి పదార్థాలు తినాలనే కోరికను తగ్గించడంలో సహాయపడుతాయి. అవకాడో కూడా చాలా ప్రభావం చూపుతంది.

ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి.. మీరు రోజూ తినే ఆహార పదార్థాల్లో ప్రోటీన్స్ ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్స్ ఉన్న ఆహారం తినడం ద్వారా కడుపు నిండుగా అనిపిస్తుంటుంది. ఫలితంగా తరచుగా ఆహారం తినాలనే కోరికను తగ్గిస్తుంది. 2017లో జరిగిన ఓ అధ్యయనంలో టైప్ టూ డయాబెటిస్ ఉన్నవారు తక్కువ కార్బోహైడ్రేట్, కొవ్వు, అధిక ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా.. వారిలో తీపి పదార్థాలు తినాలనే కోరికను తగ్గించిందని కనుగొన్నారు.

స్నాక్స్‌గా పండ్లను తినాలి.. బెర్రీలు, పుచ్చకాయ, అరటి, ఫైబర్ కలిగిన పండ్లలో ఉండే సహజ చక్కెరలు.. తీపిపదార్థాలు తినాలనే మీలోని కోరికలను సంతృప్తి పరుస్తాయి. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

కూల్‌డ్రింక్స్ మానేయండి.. కూల్ డ్రింక్స్, సోడా, ప్యాకేజ్‌డ్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండండి. దీనికి బదులుగా ప్రెష్ జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

హైడ్రేటెడ్‌గా ఉండండి.. డీహైడ్రేషన్ చక్కెర కోరికలను తీవ్రతరం చేస్తుంది. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు త్రాగేలా చూసుకోండి.

Also read:

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రైవేటు వర్సిటీల్లో 35 శాతం కన్వీనర్‌ కోటా..

Telangana: తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక.. 14న టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష..

Andhra Pradesh: రైతుగా వచ్చిన సబ్ కలెక్టర్.. ఎరువుల షాపు యజమానులకు చుక్కలు చూపించారు..