బాత్రూంలో ఫోన్ వాడుతున్నారా.. ఈ భయంకర వ్యాధి లక్షణాలు మీకున్నాయా?
బాత్రూంలో ఎక్కువ సమయం గడపడం ఎన్నో రకాల అనారోగ్యాలను తీసుకువస్తుందని వైద్యులు చెప్తున్నారు. రోజులో 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే బాత్రూం కోసం కేటాయించాలంటున్నారు. లేదంటే త్వరలోనే ఆస్పత్రిలో చేరే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టేనని హెచ్చరిస్తున్నారు.

నిత్యం తమ వద్దకు వచ్చే పేషెంట్ల లిస్టులో హెమరాయిడ్స్ వంటి సమస్యలతో బాధపడేవారు అధికంగా ఉంటున్నారని వైద్యులు చెప్తున్నారు. అయితే ఇలాంటి వ్యాధులు రావడానికి గల కారణాలను సైతం వారు వెల్లడిస్తున్నారు. బాత్రూంలో మొబైల్ ఫోన్ చూసేవారు ఎక్కువవుతున్నారని ఈ కారణంగా వారు గంటల తరబడి టాయిలెట్ సీటు మీద గడుపుతున్నారని చెప్తున్నారు. ఇలా ఎక్కువ కాలం పాటు కొనసాగితే హెమరాయిడ్స్, పెల్విక్ మజిల్స్ వదులుగా మారడం వంటి సమస్యల బారిన పడుతున్నారట. అంతేకాదు భవిష్యత్తులో ఇవి మరింత తీవ్రమైన అనారోగ్యాలకు కూడా కారణమవుతాయని వారు హెచ్చరిస్తున్నారు.
ఇన్ని అనర్థాలా..
రోజుకు 10 నిమిషాల కన్నా బాత్రూంలో సమయం గడిపేవారి శరీరంలో ప్రతికూల మార్పులు చోటుచేసుకుంటాయట. అంటే ఈ కారణంగా వారి లోయర్ బాడీపై ఎక్కువ ప్రెజర్ పడుతుందని అంటున్నారు. అది రక్తప్రసరణను అడ్డుకుంటుంది. దీని కారణంగా శరీరానికి రక్తం ప్రసరించే పనితీరులో అవాంతరం ఏర్పడుతుంది. కొన్నాళ్ల తర్వాత ఇవే కొన్ని వ్యాధులను కలిగిస్తాయి. ఉదాహరణకు చాలా మంది మల ద్వారం దగ్గర సిరలు ఉబ్బినట్టుగా మారి భరించలేని నొప్పితో బాధపడుతుంటారు. ఇది కూడా బాత్రూంలో ఫోన్ చూస్తూ టైం పాస్ చేసేవారిలోనే ఎక్కువగా కనిపిస్తుందట. భవిష్యత్తులో ఇదే వారిలో హెమరాయిడ్స్ అంటే.. మల విసర్జన సమయంలో రక్తనాళాలు ఉబ్బడం వంటి సమస్యలకు దారితీస్తాయి. ఇలా ఎక్కువ సమయం ఒకే పొజిషన్ లో కూర్చోవడం వల్ల ప్రేగు కదలికలపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీర్ఘకాలికంగా మలబద్దకం లేదా అతిసారం ఉంటుంది. నొప్పి, దురద, చికాకు, రక్తస్రావం కావడం వంటివి హెమరాయిడ్స్ లక్షణాలే.
పేగు జారే ప్రమాదం..
ఎక్కువసేపు టాయిలెట్ లో కూర్చోవడం వల్ల కటి నేల కండరాలు బలహీనపడతాయి. ఇది స్మూత్ గా ఉండాల్సిన పేగు కదలికలను ఎంతో అవసరం. పేగు జారిపోయే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ఫోన్ చూడటం, బుక్స్ చదవడం వంటి అలవాట్లను కచ్చితంగా 5 నుంచి 10 నిమిషాల వరకే పరిమితం చేయాలని లేదంటే దీర్ఘకాలికంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు.
ఆ అలవాటును ఇలా మాన్పించండి..
టాయిలెట్ ను విశ్రాంతి పొందే స్థలంగా చూడటం మానుకోవాలని సీనియర్ వైద్య నిపుణులు చెప్తున్నారు. అప్పుడే ఈ ఫోన్ చూసే అలవాటును తగ్గించుకోగలరని అంటున్నారు. నిరంతరం హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వంటివి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. తద్వారా ఇలా బాత్రూంలో ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉండదని చెప్తున్నారు. మలంతో పాటు రక్తం కనిపించినా ఇంకే తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నా వారు వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.




