Curd Benefits: ఇది కదా సూపర్ ఫుడ్ అంటే.. మట్టికుండలోని పెరుగు చేసే మ్యాజిక్ తెలుసా?
వేసవిలో పెరుగు తినడం వల్ల చల్లదనం మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది శరీరంపై సహజంగా రిఫ్రెషింగ్ ప్రభావాన్ని కలిగిస్తుంది. వేడిని తగ్గించడంలో మరియు వేడి వాతావరణం నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉన్న పెరుగు జీర్ణక్రియకు సహాయపడుతుంది, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు జీర్ణ సమస్యలను నివారిస్తుంది. ఇందులోని అధిక నీటి శాతం హైడ్రేషన్ మరియు ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడంలో సహాయపడుతుంది.

మట్టి పాత్రల్లో వంట చేసుకునే సంప్రదాయం ఈనాటిది కాదు. భారతీయులకు ఇది ఎప్పటినుంచో అలవాటు. తరాలు మారుతున్న కొద్దీ వీటి వాడకం కూడా కనుమరుగైపోతుంది. మళ్లీ ఇప్పుడు మట్టి పాత్రల వాడకంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. కుండలో పెట్టి వండిన ఆహార పదార్థాలకు నగరంలోనూ డిమాండ్ పెరుగుతోంది. ఐస్ క్రీం, బిర్యానీ, లస్సీ ఇలా అనేక రకాల ఫుడ్స్ ను మట్టి కుండలో పెట్ట అమ్ముతున్నారు. ఇవి మాత్రమే కాదు.. మట్టి పాత్రల్లో తోడు పెట్టిన పెరుగంటే నగరవాసులు మనసు పారేసుకుంటున్నారు. చూడగానే నోట్లో నోరూరించే కుండ పెరుగును అనేక రెస్టారెంట్లతో సహా పలు దుకాణాల్లోనూ అమ్మకానికి ఉంచుతున్నారు. రుచి విషయం అటుంచితే అసలు ఇలా మట్టి కుండలో పెరుగును తయారు చేసుకుని తినడం వల్ల ఏమైనా ప్రయోజనాలున్నాయా.. అంటే అవుననే అంటున్నారు ఆరోగ్య నిపుణులు అవేంటో చూడండి.
ఎండ దెబ్బను తిప్పికొడుతుంది..
పెరుగు పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వడదెబ్బను సైతం తట్టుకోగల శక్తినిస్తుంది. ఎండలో కాలిపోయిన చర్మానికి ఉపశమనం ఇస్తుంది. పెరుగు వేసవి భోజనాలను మరింత రుచికరంగా మారుస్తుంది. ఎండా కాలంలో మొత్తం శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. అయితే పెరుగును తోడేసేందుకు మీరు ఎంచుకునే పాత్రలు కూడా చాలా ముఖ్యం. సరైన పాత్రను ఇందుకు వాడినప్పుడే అది మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందించగలదు.
ప్రొబయోటిక్స్ ఎక్కువ..
మట్టి పాత్రల్లో తయారు చేసే పెరుగులో ప్రొబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. స్టీలు, గాజు వంటి పాత్రల్లో చేసిన పెరుగు కంటే మట్టి పాత్రల్లో చేసిన పెరుగులో ఇవి అధికంగా ఉంటాయి. ప్రొబయోటిక్స్ జీర్ణక్రియను, రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. మట్టిలో ఉండే పోరస్ స్వభావం లోపల గాలిని ప్రసరించడానికి అనువుగా ఉంటుంది.
గడ్డ పెరుగుకు అసలు సీక్రెట్..
మట్టి కుండలో తయారు చేసే పెరుగు ఎక్కువ శాతం గడ్డ కట్టి ఉంటుంది. పెరుగును ఇలా తినడానికి ఎంతో మంది ఇష్టపడుతుంటారు. నిజానికి ఇలా గడ్డకట్టడం వెనుకు ఉన్నకారణం ఏమిటంటే.. మట్టి సహజంగానే నీటిని పీల్చుకుంటుంది. కాబట్టి అందులో పేరుకునే అదనపు నీటిని అందులో ఉండే పిలుపును మట్టి పీల్చేస్తుంది. గడ్డపెరుగుకు అసలు సీక్రెట్ ఇదే.
రుచిలో తేడా అందుకే..
మట్టి పాత్రలో నిల్వ ఉంచిన పెరుగుకు ఇతర పాత్రల్లో తోడు పెట్టిన పెరుగుకు కచ్చితంగా తేడా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే దీనికి ఈ రుచిని అందించేది బయటి పదార్థాలేమీ ఉండవు. మట్టిలోని సహజగుణాలు పెరుగు సహజ రుచిని పట్టి ఉంచుతుంది. పులుపును ఎక్కువ రానీయకుండా చేస్తుంది. అందుకే ఇందులో తినే పెరుగుకు ఆ రుచి వస్తుంది. ఆమ్ల తత్వం నశిస్తుంది.




