Health Tips: మూడు పూటలా అన్నమే తింటున్నారా.. అమ్మ బాబోయ్ దీంతో ఇన్ని రోగాలొస్తాయా..
వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ, పప్పు, సాంబార్ ఇలా ఏది కలుపుకుని తిన్నా ఆహా.. స్వర్గం కంటిముందు కనిపిస్తుంది. ఎన్ని ఉన్నా అన్నం కడుపునిండా తినకపోతే కొంతమందికి భోజనం పూర్తైన భావన కలగదు. ఇది మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. కానీ, రోజూ మూడుపూటలా అన్నం మాత్రమే తినడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. వీటి వల్ల ప్రయోజనాల కన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మీకు ఇలా అతిగా అన్నం తినే అలవాటు ఉంటే మీరు ఈ సమస్యల బారిన పడే రిస్క్ ఎక్కువగా ఉంటుందట..

భారతీయ ఆహారపు అలవాట్లలో అన్నం ముఖ్యమైనది. అన్నం ప్రరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు. అంతలా మన ఆహారపు అలవాట్లలో వరి బియ్యానికి ప్రాధాన్యత ఉంది. మనకున్న వాతావరణ పరిస్థితులు, సాగుకు అనుకూలంగా ఉండే నేల వంటివి బియ్యాన్ని ఎక్కువగా పండించేలా చేస్తున్నాయి. ఒకప్పటి పరిస్థితి ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం అన్నం ఎక్కువగా తినేవారిలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వచ్చి చేరుతున్నాయి. డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడిన వారిని వైద్యులు అన్నం తగ్గించమని దానికి బదులుగా ఇతర పదార్థాలు తినాలని సూచిస్తుంటారు. అందుకు కారణం బియ్యంలో చక్కెర స్థాయిలను పెంచే గుణాలు ఎక్కువగా ఉండటమే. ఇదొక్కటే కాదు. రోజూ మూడు పూటలా అన్నం మాత్రమే తినేవారు భవిష్యత్తులో ఈ రోగాల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధిక గ్లైసెమిక్ ఇండెక్స్..
దీర్ఘకాలం పాటు ఇతర పోషకాలను తగ్గించి అన్నం మాత్రమే పుష్ఠిగా తినేవారు కచ్చితంగా ఇది తెలుసుకోవాలి. బియ్యానికి గ్లైసెమిక్ ఇండెక్స్ శాతం ఎక్కువ. రైస్ మాత్రమే తినేవారిలో రక్తంలో చక్కర శాతం వేగంగా పెరుగుతుంది. అదే షుగర్ వ్యాధికి దారితీస్తుంది. ఇక ఇప్పటికే షుగర్ ఉన్నవారు కూడా అన్నాన్ని తగ్గించి తీసుకోవడమే చాలా ఉత్తమం.
బరువు పెరిగిపోతున్నారా..
మీరు చూస్తుండగానే బరువు పెరిగిపోతున్నారా ఎన్ని చేసినా బరువు అదుపులో ఉండటం లేదా.. అయితే మీరు శారీరక శ్రమ తగ్గించి డైట్ లో రైస్ క్వాంటిటీని ఎక్కువగా చేసేస్తున్నారని అర్థం. మహిళల్లో అయితే థైరాయిడ్, పీసీవోడీ వంటి సమస్యలు కూడా ఇందుకు కారణం కావచ్చు. అయితే ఇలాంటి మెడికల్ హిస్టరీ లేని వారు సులువుగా బరువు తగ్గాలంటే కూరలు ఎక్కువగా తీసుకుని అన్నానికి బదులు ఫైబర్ ఎక్కువగా ఉండే చపాతీలు, జొన్నరొట్టెలు వంటివి కూడా తీసుకోవచ్చు.
గుండె సమస్యలు..
వైట్ రైస్ లో పోషకాలు తక్కువ స్థాయిలో ఉండి కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ గుండె ఆరోగ్యాన్ని కూడా మెల్లిగా దెబ్బతీస్తుంటాయి. రోజూ అన్నం మాత్రే తినేవారిలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు, చెడు కొలెస్ట్రాల్స్ వేగంగా పెరుగుతుంటాయి. ఇవన్నీ గుండె సంబంధిత అనారోగ్యాలకు దారితీసే ప్రమాదం ఉంది. అన్నాన్ని ఇష్టపడే వారు వైట్ రైస్ కి బదులుగా బ్రౌన్ రైస్ ను డైట్ లో యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
జీవక్రియకు ఆటంకం..
రోజూ అన్నమే తింటే అది క్రమంగా మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ ను పెంచుతుంది. అంటే జీవక్రియను నెమ్మదించేస్తుంది. దీని కారణంగానే బరువు పెరిగిపోవడం, జీర్ణాశయ సంబంధ సమస్యలు బయలుదేరుతుంటాయి. అందుకే వైట్ రైస్ ను తగిన మోతాదుకు మాత్రమే పరిమితం చేయాలంటున్నారు వైద్య నిపుణులు.
కొలెస్ట్రాల్ ను పెంచేస్తుంది..
అన్నం తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయనేది అందరికి తెలిసిన విషయమే. అయితే ఇదింకా సైంటిఫిక్ గా నిర్ధారణ కాలేదు. కానీ, శరీరంలో అనేక మార్పులు వస్తాయి. చెడు కొలెస్ట్రాల్ కు అన్నం కూడా ఒక కారణమే. కాబట్టి మీ డైట్ లో సమతులాహారం ఉండేలా చూసుకోవాలి.




