AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meena Husband: మీనా భర్త మృతికి పావురాలే కారణం అంటూ షాకింగ్ రీజన్.. పావురాల పెంపకం ప్రాణాంతకమా..

ప్రేమకు చిహ్నమైన పావురాలు ప్రాణాలు తీస్తాయా...? మీనా భర్త మృతికి కారణం ప్రేమతో పెంచుకుంటున్న పావురాలేనా..? లేక డాక్టర్లు చెబుతున్నట్టు పోస్ట్ కొవిడ్ ప్రభావమా? పావురాల వల్ల నిజంగానే అంత ప్రమాదం ఉంటుందా..? పోస్ట్ కోవిడ్ బాధితుల్ని కూడా టెన్షన్ పెట్టిస్తోంది మీనా భర్త డెత్ మిస్టరీ.

Meena Husband: మీనా భర్త మృతికి పావురాలే కారణం అంటూ షాకింగ్ రీజన్.. పావురాల పెంపకం ప్రాణాంతకమా..
Meena Husband Death News
Surya Kala
|

Updated on: Jun 29, 2022 | 11:03 AM

Share

Meena Husband Death News: మీనా ఇంట తీవ్ర విషాదం… భర్తను కోల్పోయిన సీనియర్ నటి మీనా.. అనే వార్తలు సినీ సర్కిల్స్‌లోనూ, మీనా అభిమానుల్లోనూ కాస్త కలవరం పుట్టించాయి. చెన్నైలోని(Chennai) MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు విద్యాసాగర్ (Vidyasagar). కానీ… ఆయన మృతిపై ఇప్పుడు కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. విద్యాసాగర్‌తో పాటు… మీనా కుటుంబం మొత్తానికి గతంలో కరోనా సోకింది. అప్పట్లో ఆయన కోలుకున్నప్పటికీ… కొన్ని నెలలుగా పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలతో బాధపడుతున్నారు‌. లంగ్ ఇన్ఫెక్షన్‌తో రిసెంట్‌గా ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించి ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సివచ్చింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి లంగ్స్ కోసం వెతికారు. అంతలోనే విద్యాసాగర్ ఆకస్మికంగా మృతిచెందారు. పోస్ట్ కోవిడ్ సమస్యలు మాత్రమే ఆయన మృతికి కారణం కాకపోవచ్చని, ఆయన ప్రేమతో పెంచుకుంటున్న పావురాలే ఆయన్ను పొట్టనబెట్టుకున్నాయని మరో వెర్షన్ వినిపిస్తోందిప్పుడు.

విద్యాసాగర్‌కి పావురాలంటే ప్రాణం. ఆయన ఇంటి సమీపంలో కొన్ని పావురాలుండేవి. వాటికి దాణా వేస్తూ ఆలనా పాలనా చూస్తూ దాన్నొక హాబీగా మార్చుకున్నారు. కోవిడ్‌ సోకిన తర్వాత… డాక్టర్ల సూచన పట్టించుకోకుండా ఆయన పావురాల మధ్యనే ఎక్కువగా గడిపేవారు. దీనివల్లే విద్యాసాగర్‌ శ్వాసకోశ సమస్యలు రెట్టింపయ్యాయని, అది ప్రాణాంతకంగా మారిందని చెబుతున్నారు సన్నిహితులు.

ప్రేమకు ప్రతిరూపాలుగా, శాంతి కపోతాలుగా చెప్పుకునే పావురాలు ప్రాణాంతకంగా మారతాయా…? అనే టాపిక్ మరోసారి జనంలో మొదలైంది. ఆరోగ్యపరంగా చూస్తే పావురాలకు మనుషులు ముఖ్యంగా హెచ్‌ఐవీ, మధుమేహం, తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అవయవ మార్పిడి చేయించుకున్నవారు, స్టెరాయిడ్లు తీసుకునేవారు వీలైనంత దూరంగా ఉండటం మంచిదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పావురాలకు ప్రత్యేకంగా మూత్రకోశం ఉండదు. దీంతో విసర్జనలోనే మలమూత్రాలు రెండు ఉంటాయి. కనుక పావురాల విసర్జకం అత్యంత ప్రమాదకరమని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

పావురాలతో నిఫా వైరస్ లాంటివి వ్యాపిస్తాయని గతంలో ఒక భయం వెంటాడేది. పావురాల విసర్జితాల ద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని కొన్ని అధ్యయనాలు కూడా తేల్చేశాయి. పావురాల విసర్జితాలు ఎండిపోయి వాటి రేణువులు గాల్లో కలిసి… మనం ఊపిరి తీసుకున్నప్పుడు లోనికి చేరతాయి. తర్వాత క్రమంగా లంగ్ ఇన్ఫెక్షన్‌కి దారితీస్తాయి. అందుకే… ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవాళ్లు పావురాలకు దూరంగా ఉండాలని డాక్టర్లే సజెస్ట్ చేస్తారు. పావురాలకు బహిరంగ ప్రదేశాల్లో దాణా వెయ్యడాన్ని ఇప్పటికే కొన్ని దేశాలు నిషేదించాయి కూడా.

పావురాలకు దగ్గరగా ఉంటూ… అనారోగ్యం బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారంటూ గతంలో కూడా కొన్ని వార్తలొచ్చాయి. కానీ… పావురాలు ప్రాణాంతకమే అని నిర్ధారించే నిఖార్సయిన రుజువులేవీ ఇప్పటిదాకా లేవు. ప్రస్తుతానికి ఈ అంశం రిసెర్చ్ దశలోనే ఉంది. కారణాలేవైనా విద్యాసాగర్ మరణం మీనా కుటుంబానికి తీరని విషాదం. బెంగుళూరుకి చెందిన విద్యాసాగర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. 13 ఏళ్ల కిందట 2009 జూలై 12న మీనాకు, విద్యాసాగర్‌కీ పెళ్లయింది. వీళ్లకు నైనికా అనే కుమార్తె కూడా ఉంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..