టీబీ గుర్తింపులో ఏఐ విప్లవం.. చెస్ట్ ఎక్స్‌రే ఒక్కటి చాలు.. టీబీ ఉందో లేదో తెలిసిపోతుంది..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేక రంగాలలో పెద్ద విప్లవాన్ని సృష్టిస్తోంది. విద్య నుండి వైద్యం వరకు వివిధ రంగాలలో ఉపయోగిస్తున్నారు. తాజాగా క్షయవ్యాధి (TB)ని ముందస్తుగా గుర్తించడంలో AI-ఆధారిత ఎక్స్-రే యంత్రాలు ఇప్పుడు సహాయకారిగా మారాయి. క్షయ వ్యాధి గుర్తింపులో కిమ్స్ హాస్పిటల్స్ రికార్డ్ సృష్టించింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేక రంగాలలో పెద్ద విప్లవాన్ని సృష్టిస్తోంది. విద్య నుండి వైద్యం వరకు వివిధ రంగాలలో ఉపయోగిస్తున్నారు. తాజాగా క్షయవ్యాధి (TB)ని ముందస్తుగా గుర్తించడంలో AI-ఆధారిత ఎక్స్-రే యంత్రాలు ఇప్పుడు సహాయకారిగా మారాయి. క్షయ వ్యాధి గుర్తింపులో కిమ్స్ హాస్పిటల్స్ రికార్డ్ సృష్టించింది. చేతితో పట్టుకునే ఎక్స్-రే యంత్రాల కారణంగా, ఈ సంవత్సరం ప్రారంభంలో16,675 మంది టీబీ రోగులను గుర్తించి, వారి పరిస్థితి గురించి వారికి సమాచారం అందించింది.
చెస్ట్ ఎక్స్-రేలను ఉపయోగించి క్షయ వ్యాధి (టీబీ)ని గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి కిమ్స్ ఆస్పత్రి అతిపెద్ద పరిశోధన చేసిందని కిమ్స్ హాస్పిటల్స్ పల్మోనాలజీ విభాగాధిపతి డాక్టర్ లతా శర్మ తెలిపారు. ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా, క్యూఎక్స్ఆర్ అనే అత్యాధునిక ఏఐ టూల్‌ను ఉపయోగించి మొత్తం 16,675 మంది పేషెంట్ల చెస్ట్ ఎక్స్-రేలను విశ్లేషించారు. ఇందులో ప్రధానంగా రెండు అంశాలపై దృష్టిపెట్టారు. ముందుగా ఏఐ ద్వారా టీబీని గుర్తించడం, ఆ తర్వాత రేడియాలజిస్టులు దాన్ని నిర్ధారించడం.

Kims Hospitals Pulmonology Department
టీబీ కేసులను గుర్తించడంలో ఏఐ టెక్నాలజీ అత్యంత సమర్థమైనదని దీనిద్వారా తెలిసింది. మొత్తం గుర్తించిన కేసుల్లో 88.7% కచ్చితమైనవిగా తేలింది. దీంతో వ్యాధిని త్వరగా గుర్తించడంలో ఏఐ కీలకపాత్ర పోషిస్తుందని నిర్ధారణ అయ్యింది. దానికితోడు.. ఇందులో టీబీ లేదని నిర్ధారించడంలో 97% కచ్చితత్వాన్ని ఏఐ సాధించింది. ఏఐ టూల్ స్పెసిఫిసిటీ 69.1%గా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ప్రమాణాలను ఇది అందుకుంటోంది.
ఇందులో మరో కీలకమైన అంశం ఏమిటంటే.. ఏఐ గుర్తించిన కేసులన్నింటినీ నిపుణులైన రేడియాలజిస్టులు కూడా నిర్ధారించారు. అందువల్ల క్లినికల్ డయాగ్నసిస్‌లో ఏఐ సామర్థ్యం, దాని కచ్చితత్వాలకు ఇది నిదర్శనంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టీబీ కేసుల నేపథ్యం, సంప్రదాయ రేడియోగ్రఫీతో దాన్ని నిర్ధారించడానికి ఎక్కువ సమయం పడుతున్నందువల్ల ఇది మెరుగైన ప్రత్యామ్నాయం కానుంది.
ఈ సందర్భంగా పల్మోనాలజీ విభాగాధిపతి డాక్టర్ లతా శర్మ ఈ పరిశోధన ప్రభావం గురించి వివరించారు. “టీబీ గుర్తింపులో ఏఐ టూల్ సామర్థ్యం, దాని కచ్చితత్వం చాలా బాగున్నాయి. ఇది గేమ్ ఛేంజర్ కానుంది. ముఖ్యంగా నిపుణులైన రేడియాజిస్టులు ప్రతిసారీ అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇలాంటివి ఎంతగానో ఉపయోగపడతాయి” అని ఆమె చెప్పారు.
కిమ్స్ ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ డాక్టర్ చైతన్య ఇసమళ్ల ఇదే విషయాన్ని వెల్లడించారు. “మానవ నైపుణ్యానికి ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు గానీ, ప్రాథమిక పరీక్షల విషయంలో మాత్రం అది చాలా ఆధారపడదగ్గ పరికరంగా ఉపయోగపడుతుంది. అందువల్ల సంక్లిష్టమైన కేసుల్లో లోతుగా పరిశీలించేందుకు అవసరమైన సమయం వైద్యులకు దొరుకుతుంది” అని వివరించారు.
వైద్య పరీక్షలను విప్లవాత్మకం చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర పెరుగుతున్న విషయాన్ని ఈ పరిశోధన నిర్ధారిస్తోంది. క్యూఎక్స్ఆర్ లాంటి ఏఐ టూల్స్ అంతర్జాతీయ టీబీ గుర్తింపు ప్రమాణాలను అందుకోవడంతో రోజువారీ చికిత్సా విధానాల్లో వాటిని జతచేయడం వల్ల వ్యాధులను త్వరగా గుర్తించి, మెరుగైన చికిత్సా ఫలితాలు సాధించవచ్చు. ఏఐ రోజురోజుకూ మరింత వృద్ధి చెందుతుండడంతో టీబీ లాంటి సాంక్రమిక వ్యాధులపై సమరం మరింత సమర్థంగా చేయొచ్చు. దీనివల్ల మరింత సమర్థమైన చికిత్సలను అందించేందుకు వీలుంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..