AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer Symptoms: ఈ 8 లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.. లేకపోతే ప్రాణాలకే ముప్పు..!

గుండెపోటు ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్యలలో మొదటి స్థానంలో ఉంది. దాని తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణవుతున్న మహమ్మారి ఏమిటంటే.. క్యాన్సర్. ఈ సమస్యకు ఔషధాలు..

Cancer Symptoms: ఈ 8 లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.. లేకపోతే ప్రాణాలకే ముప్పు..!
Lung Cancer Symptoms
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 04, 2023 | 9:45 AM

నేటి అధునిక ప్రపంచంలో చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకు వారు పాటిస్తున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ప్రధాన కారణం అని చెప్పుకోవాలి. అయితే వాటి కారణంగా సంభవించే వ్యాధులలో ఒకటైన గుండెపోటు ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్యలలో మొదటి స్థానంలో ఉంది. దాని తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణవుతున్న మహమ్మారి ఏమిటంటే.. క్యాన్సర్. ఈ సమస్యకు ఔషధాలు, చికిత్స ఉన్నప్పటికీ సకాలంలో గుర్తించకపోతే క్యాన్సర్ ప్రాణాంతకమవుతుంది. దీన్ని ప్రారంభ దశలోనే గుర్తించడం ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తించేందుకు కొన్ని రకాల లక్షణాలు శరీరంలో కనిపిస్తాయని కూడా వారు తెలియజేస్తున్నారు. ఆ క్రమంలో ప్రధానంగా ఈ 8 లక్షణాలు క్యాన్సర్‌ను సూచిస్తాయని, ఆయా లక్షణాలు కనిపిస్తే ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని అంటున్నారు. మరి అవేమిటంటే..

  1. విడవని దగ్గు: పలు కారణాలతో దగ్గు వస్తుంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు, ఆస్తమా, సీఓపీడీ, గ్యాస్ట్రోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) దగ్గుకు కారణమవుతాయి. అయితే అదేపనిగా దగ్గు వస్తుంటే అనుమానించాల్సిందే. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ కావొచ్చన్నది నిపుణుల మాట. ఇది పొడిదగ్గులా ప్రారంభమై, చివరికి దగ్గితే రక్తం పడే స్థాయికి చేరుతుంది.
  2. పేగుల కదలికల్లో మార్పులు: బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ (ఎన్ హెచ్ఎస్) ప్రకారం ఓ వ్యక్తికి పేగు క్యాన్సర్ సోకితే అనేక లక్షణాలు కనిపిస్తాయి. తరచుగా మల విసర్జనకు వెళ్లాల్సి రావడం, మలం జారిపోతున్నట్టుగా వెలుపలికి రావడం, మలంలో రక్తం కనిపించడం వంటివి ఆ లక్షణాల్లో ముఖ్యమైనవి.
  3. గడ్డలు, వాపులు: శరీరంలో అసాధారణరీతిలో వాపులు, గడ్డలు కనిపిస్తే దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందే. అన్ని రకాల గడ్డలు క్యాన్సర్ కాకపోవచ్చు కానీ… పెద్దగా, గట్టిగా, స్పర్శ లేనట్టుగా ఉండే గడ్డలు క్యాన్సర్ లక్షణాలుగా భావించవచ్చని, ఉన్నట్టుండి వాపు కనిపించడం కూడా తేలిగ్గా తీసుకోరాదని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ కారక గడ్డలు నిదానంగా పెరుగుతూ, చర్మం బయటికి వేళ్లాడుతుంటాయి. ఇలాంటివి ఎక్కువగా రొమ్ములు, వృషణాలు, మెడ, చేతులు, కాళ్లలో ఏర్పడుతుంటాయి.
  4. పుట్టుమచ్చల్లో మార్పులు: శరీరంపై పుట్టుమచ్చలు ఉండడం సహజం. అయితే ఆ పుట్టుమచ్చల్లో మార్పులు కనిపిస్తే శరీరంలో క్యాన్సర్ కణజాలం ఉందనడానికి సంకేతంగా అనుమానించాల్సి ఉంటుంది. పుట్టుమచ్చ పరిమాణం, రంగు మారితే మెలనోమాకు సంకేతం కావొచ్చు. మెలనోమా అంటే ఓ రకమైన చర్మపు క్యాన్సర్. చర్మం రంగు నిర్దేశించే పదార్థం మెలనిన్. ఈ మెలనిన్ ను ఉత్పత్తి చేసే కణాలు క్యాన్సర్ బారినపడితే దాన్ని మెలనోమా అంటారు.
  5. ఇవి కూడా చదవండి
  6. కారణం లేకుండా బరువు తగ్గడం: క్యాన్సర్ సోకిన వ్యక్తులు ఎలాంటి ప్రత్యేక కారణం లేకుండానే బరువు కోల్పోతుంటారు. క్యాన్సర్ తో బాధపడే వ్యక్తుల్లో కనిపించే తొలి లక్షణం ఇదేనట. ముఖ్యంగా, ఉదరం, పేంక్రియాస్, ఆహార వాహిక, ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకితే గణనీయంగా బరువు తగ్గిపోతారని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వెల్లడించింది.
  7. తగ్గని నొప్పులు: సాధారణంగా ఏదైనా శారీరక శ్రమ చేసినప్పుడు ఒళ్లు నొప్పులు సహజమే. అయితే ఎలాంటి పని చేయకుండానే నొప్పులు కలిగితే దాన్ని క్యాన్సర్ సంకేతంగా భావించవచ్చు. ఇలాంటి నొప్పులు వారాలు, నెలల తరబడి వేధిస్తుంటాయి. నీరసం, మంటలు పుడుతున్నట్టుగా నొప్పులు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదు.
  8. ఆహారం మింగడంలో ఇబ్బంది: ఆహారం మింగేటప్పుడు అసౌకర్యం కలిగితే దాన్ని తేలిగ్గా తీసుకోరాదు. దీన్ని డిస్ఫేజియా అంటారు. క్యాన్సర్ రోగుల్లో మెడలో పెరిగే కణితి వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల అన్నవాహిక కుచించుకుపోయి, మింగడం ఇబ్బందికరంగా మారుతుంది.
  9. మూత్రంలో రక్తం: బ్లాడర్ కు కూడా క్యాన్సర్ సోకుతుందని తెలిసిందే. ఈ తరహా క్యాన్సర్ తో బాధపడేవారిలో మూత్రంలో రక్తం పడుతుంది. దీన్ని వైద్య పరిభాషలో హెమటూరియా అంటారు. ఇలా మూత్రంలో రక్తం పడేటప్పుడు ఎలాంటి నొప్పి ఉండకపోవచ్చని, కానీ మూత్రంలో రక్తం పడడం బ్లాడర్ క్యాన్సర్ కు సంకేతంగా భావించవచ్చని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ చెబుతోంది. ఇక, ప్రోస్టేట్ క్యాన్సర్ బాధితుల్లోనూ ఇలా మూత్రంలో రక్తం పడడం గుర్తించినట్టు బ్రిటన్ కు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. ప్రోస్టేట్ గ్రంథి నుంచి రక్తస్రావం కారణంగా ఇలా జరుగుతుందట.