ఆటిజం వర్సెస్ వర్చువల్ ఆటిజం.. మీ పిల్లల ప్రవర్తనలో ఈ మార్పులు గమనించారా..?
ఇటీవలి కాలంలో చిన్న పిల్లల్లో ఆటిజం లాంటి ప్రవర్తనలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వెనుక కారణం జన్యు సమస్య కాకుండా.. అధికంగా స్క్రీన్ టైమ్ ఉండటం. మొబైల్, టీవీ, కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల పిల్లల్లో సామాజిక నైపుణ్యాలు తగ్గి వర్చువల్ ఆటిజం అనే సమస్య వస్తోంది.

ప్రస్తుత రోజుల్లో నిపుణులు ఎక్కువగా ఏం చెబుతున్నారో తెలుసా..? 2 నుండి 9 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల్లో ఆటిజం లాంటి ప్రవర్తనలు పెరుగుతున్నాయి. దీనికి కారణం జన్యు సమస్య కాదు.. వాళ్ళు ఎక్కువగా స్క్రీన్లు (మొబైల్, టీవీ, కంప్యూటర్) చూడటమే. ఈ పరిస్థితిని వర్చువల్ ఆటిజం అని పిలుస్తున్నారు.
పిల్లలు బయటి ప్రపంచంతో కాకుండా డిజిటల్ ప్రపంచంలో ఎక్కువ సమయం గడిపినప్పుడు.. వారి సామాజిక నైపుణ్యాలు తగ్గిపోతాయి. స్క్రీన్ సమయం తగ్గిస్తే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
పిల్లల్లో కనిపించే మార్పులు
- శ్రద్ధ పెట్టలేకపోవడం
- కోపం ఎక్కువగా రావడం
- ఇతరులతో కలవలేకపోవడం
- భావోద్వేగ సమస్యలు
ఒక పరిశోధన ప్రకారం.. 5 ఏళ్ల లోపు పిల్లల్లో 73 శాతం మంది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన రోజుకు ఒక గంట స్క్రీన్ పరిమితిని దాటుతున్నారు. దీని వల్ల వారి ఎదుగుదల ఆలస్యమయ్యే అవకాశం 53 శాతం పెరుగుతుంది.
మన దేశంలో 11 శాతం కంటే ఎక్కువ మంది పిల్లలు ADHD (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్)తో బాధపడుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా 1.8 కోట్ల మంది పిల్లల్లో ఆటిజం లక్షణాలు 3 శాతం పెరిగాయి.
వర్చువల్ ఆటిజం అంటే ఏంటి..?
చిన్న వయసు నుంచే ఫోన్‌లు, టీవీలు ఎక్కువగా వాడటం వల్ల వచ్చే సమస్యే ఈ వర్చువల్ ఆటిజం. పిల్లలు ఇతరులతో మాట్లాడటం, ఆడుకోవడం తగ్గించి, డిజిటల్ పరికరాల ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని వల్ల వారి మాట్లాడే తీరు, సామాజిక నైపుణ్యాలు, ఏకాగ్రత దెబ్బతింటాయి. స్క్రీన్ సమయం తగ్గించి నిజ జీవితంలో ఆటలు ఆడేలా ప్రోత్సహిస్తే ఈ సమస్యలో మంచి మార్పు వస్తుంది.
ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD)
వర్చువల్ ఆటిజం, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) రెండింటిలోనూ కొన్ని లక్షణాలు ఒకేలా ఉంటాయి. కానీ వాటికి కారణాలు వేర్వేరు.
- ASD అనేది జన్యు సంబంధిత సమస్య. ఇది దీర్ఘకాలం ఉంటుంది, దీనికి ప్రత్యేక చికిత్స అవసరం.
- వర్చువల్ ఆటిజం అనేది తాత్కాలికమైనది. స్క్రీన్ సమయం తగ్గించి, పిల్లలను బయటి ఆటలలో, ముఖాముఖి సంభాషణలలో పాల్గొనేలా చేస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
వర్చువల్ ఆటిజం లక్షణాలు
- మాట్లాడటంలో ఆలస్యం, తక్కువ మాటలు మాట్లాడటం
- కళ్ళలోకి నేరుగా చూడకపోవడం
- ఏకాగ్రత లేకపోవడం
- ఇతరులతో ఆడుకోవడానికి ఆసక్తి చూపకపోవడం
- సామాజికంగా దూరంగా ఉండటం
- సూచనలను అర్థం చేసుకోవడంలో కష్టం
- చుట్టూ ఉన్న విషయాలపై ఆసక్తి చూపకపోవడం
వర్చువల్ ఆటిజం అనేది మన కాలంలో పిల్లల ఎదుగుదలకు ఎదురయ్యే ఒక ముఖ్యమైన సమస్య. తల్లిదండ్రులుగా మనం దీని గురించి తెలుసుకోవడం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కేవలం స్క్రీన్ సమయం తగ్గించడం మాత్రమే కాదు.. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం, బయట ఆటలలో పాల్గొనేలా ప్రోత్సహించడం, కథలు చెప్పడం వంటివి అలవాటు చేయాలి. నిజ జీవితంలో వారు నేర్చుకునే నైపుణ్యాలే వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




