Healthy Street Food: నోరు కట్టేసుకోక్కర్లేదు.. స్ట్రీట్ ఫుడ్ తింటూనే గుండె జబ్బులకు చెక్ పెట్టండిలా!
రోడ్డు పక్కన దొరికే స్ట్రీట్ ఫుడ్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి నూనెలో వేయించిన సమోసాలు, బజ్జీలు. ఇవి రుచిగా ఉన్నా, వీటిలోని అధిక క్యాలరీలు, సంతృప్త కొవ్వులు గుండె ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. అయితే, స్ట్రీట్ ఫుడ్ తింటూనే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆలోక్ చోప్రా కొన్ని అద్భుతమైన సూచనలు చేశారు.

వేయించిన పదార్థాలకు బదులుగా కాల్చిన, ఉడకబెట్టిన లేదా ఆవిరిపై ఉడికించిన పదార్థాలను ఎంచుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన చెబుతున్నారు. మనం బయట దొరికే ఆహారంలో కొన్ని స్మార్ట్ ఎంపికలు చేయడం ద్వారా రుచిని ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేయవచ్చు.తక్కువ ఖర్చుతో దొరికే ఆ ఆరోగ్యకరమైన స్ట్రీట్ ఫుడ్ ఎంపికలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆలోక్ చోప్రా ప్రకారం,
ఆరోగ్యకరమైన టాప్ 5 స్ట్రీట్ ఫుడ్ ఎంపికలు:
వేయించిన శనగలు : ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్‌కు నిలయం. ఇందులో ఉండే ఫైబర్ బరువు తగ్గడానికి జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ఐరన్, పొటాషియం వంటి పోషకాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి.
లైట్ బెల్ పూరీ : మరమరాలతో చేసే ఈ స్నాక్ చాలా తేలికగా ఉంటుంది. ఇందులో కూరగాయలు, నిమ్మరసం కలపడం వల్ల తక్కువ కొవ్వు ఎక్కువ ఫైబర్ లభిస్తుంది.
కాల్చిన మొక్కజొన్న : నేరుగా మంటపై కాల్చి, నిమ్మరసం, ఉప్పు రాసిన మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి జీర్ణక్రియకు సహాయపడుతుంది.
చిలగడదుంప చాట్ : చిలగడదుంపను ఉడకబెట్టి చాట్‌లా తీసుకుంటే విటమిన్ A, C బీటా-కెరోటిన్ లభిస్తాయి. ఇది చర్మం జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఉడకబెట్టిన గుడ్లు : ప్రయాణాల్లో లేదా బయట ఉన్నప్పుడు తక్షణ ప్రోటీన్ కోసం ఉడకబెట్టిన గుడ్లు ఉత్తమ ఎంపిక. ఇవి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూస్తాయి.
మరికొన్ని ముఖ్యమైన చిట్కాలు:
తాజా పదార్థాలకే ప్రాధాన్యత ఇవ్వండి: సీజనల్ కూరగాయలు, తాజా పదార్థాలతో చేసిన వంటకాలనే ఎంచుకోండి.
మితంగా తినండి : బయట వడ్డించే పోర్షన్లు ఎక్కువగా ఉండవచ్చు, కాబట్టి వాటిని స్నేహితులతో పంచుకోవడం లేదా చిన్న ప్లేట్ తీసుకోవడం మంచిది.
వండే పద్ధతిని గమనించండి: డీప్ ఫ్రై చేసిన వాటికంటే గ్రిల్డ్, స్టీమ్డ్ లేదా రోస్టెడ్ చేసిన వాటికే ఓటు వేయండి.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మీ శారీరక స్థితిని బట్టి ఆహార నియమాలను పాటించడం నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.
