వందే భారత్ కలర్ ముద్రతో రూ.100 కాయిన్! సొంతం చేసుకున్న ఆంధ్రా వాసి
భారత విద్యుత్ రైళ్ల శతాబ్దిని పురస్కరించుకుని కేంద్రం రూ.100 స్మారక నాణెం విడుదల చేసింది. 1925లో తొలి విద్యుత్ రైలు ప్రయాణానికి వంద ఏళ్లు పూర్తయ్యాయి. వందేభారత్ రైలు చిత్రంతో రూపొందించిన ఈ అరుదైన నాణెం సేకరణకారుల్లో విశేష ఆసక్తి రేపుతోంది.

దేశంలో విద్యుత్ రైళ్ల శతాబ్దిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక రంగుల స్మారక నాణెం సేకరణకారుల్లో విశేష ఆసక్తిని రేపుతోంది. భారత రైల్వే చరిత్రలో కీలక మైలురాయిగా భావించే ఈ సందర్భంగా విడుదలైన రూ.100 నాణెం అరుదైన అసెట్‌గా మారుతోంది. ముఖ్యంగా ఆధునిక ఇండియన్ రైల్వేస్ పురోగతికి ప్రతీకగా భావించే వందేభారత్ రైలు చిత్రంతో రూపుదిద్దుకోవడం దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భారతదేశంలో తొలి విద్యుత్ రైలు 1925 ఫిబ్రవరి 3న అప్పటి బాంబేలో విక్టోరియా టెర్మినస్ నుంచి కుర్లా వరకు ప్రారంభమైంది. ఆ ప్రయాణంతో భారత రైల్వే ఆధునికీకరణకు నాంది పలికింది. అప్పటి నుంచి విద్యుతీకరణ వేగంగా విస్తరించి, నేటికి దేశవ్యాప్తంగా వేల కిలోమీటర్ల రైల్వే మార్గాలు విద్యుతీకరణ పొందాయి. ప్రస్తుతం భారత రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ చారిత్రక ఘట్టానికి 100 సంవత్సరాలు పూర్తవడంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూ.100 విలువ గల ప్రత్యేక నాణెం విడుదలైంది. 35 గ్రాముల బరువు గల ఈ నాణెలో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ మిశ్రమం ఉంది. ముందుభాగంలో రంగుల్లో మెరిసే వందేభారత్ రైలు ప్రతిరూపం ఉండగా, వెనుక భాగంలో అశోక స్థంభం ముద్రించారు.
సాధారణ చలామణి కోసం కాకుండా పరిమిత సంఖ్యలో కలెక్టర్ల కోసం మాత్రమే ఈ నాణేలను విడుదల చేయడం విశేషం. ఫేస్ విలువ రూ.100 అయినప్పటికీ, వెండి మిశ్రమం, మింటింగ్ వ్యయాల కారణంగా అధికారిక ధర రూ.8,000కు పైగా నిర్ణయించారు. రైల్వే అభివృద్ధికి ప్రతీకగా నిలిచిన ఈ స్మారక నాణెం భవిష్యత్తులో మరింత విలువ పొందే అవకాశం ఉందని నాణేల సేకరణకారులు భావిస్తున్నారు. ఈ నాణెన్ని ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలం అనుమసముద్రం గ్రామానికి చెందిన నాణేల సేకర్త మహ్మద్ వాయిజ్ ఆన్‌లైన్‌లో జనవరి 13న రూ.8,072లకు కొనుగోలు చేశారు. శనివారం ఆయనకు కోల్‌కతా మింట్ నుంచి నాణెం అందింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
