AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన బ్రేక్‌ ఫాస్ట్ ఐటమ్స్ ఇవే..!

మధుమేహం ఉన్నవారికి వారి రోజువారీ ఆహారపు అలవాట్లే ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోతే రక్తంలో చక్కెర స్థాయి అదుపు తప్పవచ్చు. అందుకే ప్రతిరోజు క్రమం తప్పకుండా శరీరానికి కావాల్సిన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఉదయం తీసుకునే అల్పాహారం ఎంతో కీలకం.

షుగర్ ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన బ్రేక్‌ ఫాస్ట్ ఐటమ్స్ ఇవే..!
Diabetes
Prashanthi V
|

Updated on: Jun 29, 2025 | 11:28 AM

Share

ఉదయం తినే ఆహారం రోజు మొత్తానికి కావాల్సిన శక్తికి మూలం. దీనిపైనే మన శరీరం పనిచేసే సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. మధుమేహులు ఉదయాన్నే పౌష్టిక ఆహారం తీసుకోవడం ద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. మధుమేహులు అల్పాహారంలో ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన మినరల్స్ ఉండేలా చూసుకోవాలి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి.

ఉదయం ఓట్స్‌ తో రోజు మొదలుపెట్టడం మంచి ఎంపిక. ఓట్స్‌ లో అధికంగా ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉంటుంది. ఓట్స్‌ లో బాదం, వాల్‌ నట్‌, డ్రై ఫ్రూట్స్, బ్లూబెర్రీల వంటి పోషకాలను కలిపి తీసుకుంటే మంచి ఆరోగ్యం దక్కుతుంది.

ప్రొటీన్ పుష్కలంగా ఉండే గుడ్లు అల్పాహారంలో చేర్చుకోవాలి. ఉడికించిన గుడ్డు, ఎగ్ ఆమ్లెట్ లేదా పోచ్డ్ ఎగ్ రూపంలో తీసుకోవచ్చు. గుడ్లలో ఉండే ప్రొటీన్ శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడమే కాదు.. రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంలో ఉంచుతుంది. రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల తక్కువ కేలరీలు లభించినా ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది.

మరో ఆరోగ్యకరమైన ఎంపిక మొలకెత్తిన పెసలు తీసుకోవచ్చు. వీటిని ఉదయాన్నే పెరుగు లేదా నిమ్మరసం కలిపి తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మొలకెత్తిన పెసలు తేలికగా జీర్ణమవుతాయి. వీటిలో ఫైబర్, ప్రొటీన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.

ఈ రోజుల్లో మధుమేహ సమస్య ఉన్నవారు రెడీ టూ ఈట్ ఫుడ్స్ పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. కానీ వీటిలో కొవ్వులు, చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ స్థాయిలకు హాని కలిగించవచ్చు. అందుకే ఇంట్లో తక్కువ సమయంలో తయారయ్యే ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహాం వస్తువులను ఎంచుకోవాలి.

మధుమేహులు ఉదయాన్నే శరీరానికి కావాల్సిన పోషకాలు అందేలా చూసుకుంటే రోజంతా శక్తివంతంగా ఉండటమే కాదు.. షుగర్ స్థాయిలను కూడా సమర్థవంతంగా నియంత్రించవచ్చు. చిన్న చిన్న మార్పులతో ఆరోగ్యంగా జీవించవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)