బొప్పాయి పండు తిని గింజలు పారేస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..!
బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనందరికీ తెలుసు. అయితే చాలా మంది ఆ పండు తిన్న తర్వాత దాని విత్తనాలను పనికిరానివిగా భావించి పడేస్తూ ఉంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం.. ఈ విత్తనాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బొప్పాయి విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి సంబంధించిన అనేక సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.

జీర్ణ సమస్యలకు మంచి పరిష్కారం.. బొప్పాయి విత్తనాలు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. అధిక గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలపై ఇవి బాగా పనిచేస్తాయి. 1 లేదా 2 విత్తనాలను మెత్తగా నలిపి 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపాలి. భోజనం తర్వాత రోజుకు ఒకసారి తాగితే జీర్ణవ్యవస్థ బాగుపడుతుంది.
మహిళలకు నెలసరి సమస్యల నివారణకు.. బొప్పాయి విత్తనాలు నెలసరి సమయంలో వచ్చే సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని ఆయుర్వేదం చెబుతోంది. నెలసరి క్రమంగా రావడానికి ఇది తోడ్పడుతుంది. 1 టీస్పూన్ బొప్పాయి విత్తనాల పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. నెలసరి రావడానికి 3 లేదా 4 రోజుల ముందు నుండి రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
చర్మ ఆరోగ్యానికి సహజ పరిష్కారం.. ఈ విత్తనాలు చర్మానికి సహజ టోనర్ లా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మొటిమలు, మచ్చలు, రంగు మారిన చర్మం వంటి సమస్యలకు ఇది ఉపశమనం కలిగించగలదు. 1 టీస్పూన్ విత్తనాల పొడిని తీసుకుని, అందులో 1 టీస్పూన్ తేనె లేదా పెరుగు కలిపి మిశ్రమం తయారు చేయాలి. ఈ ప్యాక్ ను ముఖంపై రాసి వారానికి కనీసం ఒకసారి వాడితే చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది.
శ్వాస సంబంధిత సమస్యలకు ఉపశమనంగా.. బొప్పాయి విత్తనాలలో సహజ సలైన్ శక్తి ఉండటం వల్ల శ్వాస సంబంధిత ఇబ్బందులపై ఇది పని చేస్తుంది. ముఖ్యంగా ఆస్తమా, శ్వాసకోశ వాపు వంటి సమస్యలతో బాధపడే వారికి ఉపశమనం కలిగిస్తుంది. 1 టీస్పూన్ విత్తనాల పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగాలి. దీని వల్ల శరీరంలోని మలిన శ్లేష్మం తొలగిపోతుంది.
బొప్పాయి విత్తనాలను పడేయకుండా.. వాటిని సరిగ్గా వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జీర్ణ సమస్యల నుండి మొదలుకొని చర్మం, నెలసరి, శ్వాస సమస్యల వరకు సహజంగా మెరుగుపడటానికి ఈ విత్తనాలు సహాయపడతాయి. ఇకపై బొప్పాయి తిన్నప్పుడు విత్తనాలను పడేయకుండా ఇలా జాగ్రత్తగా వాడండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)