H5 Bird Flu: ఓరీ దేవుడో.. దడ పుట్టిస్తున్న మరో కొత్త వైరస్..! లైట్ తీసుకున్నారంటే..
H5 బర్డ్ ఫ్లూ కోవిడ్ తర్వాత తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోంది. ఇది పక్షుల నుండి జంతువులకు వ్యాపిస్తూ, మ్యుటేషన్ ద్వారా మనుషులకు సోకే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనుషుల మధ్య వ్యాప్తి పెరిగితే, కోవిడ్ కన్నా పెద్ద మహమ్మారి కావచ్చు. అప్రమత్తత, పరిశుభ్రత, మాంసం-గుడ్లు సరిగా వండటం, అనుమానాస్పద మరణాలను అధికారులకు తెలియజేయడం వంటి నివారణ చర్యలు తప్పనిసరి.

ఏవియన్ ఇన్ఫ్లుఎంజా(H5 ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్) దీనినే బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఫ్లూ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి మొదటిసారిగా 2003లో వియత్నాంలో నమోదైంది. ఇది పక్షులకు సంబంధించిన వ్యాధి. ఇది చాలా ప్రాణాంతకమైంది. కానీ, ఇప్పుడు H5 బర్డ్ ఫ్లూ కోవిడ్ తర్వాత కొత్త ప్రమాదంగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. పక్షులను నాశనం చేసిన ఈ వైరస్ జంతువులకు వ్యాపిస్తోంది. మ్యుటేషన్ కారణంగా మనుషులకూ సోకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనుషుల మధ్య వ్యాప్తి పెరిగితే, కోవిడ్ కంటే పెద్ద మహమ్మారి వచ్చే ప్రమాదం ఉంది.
2003- 2025 మధ్య మనుషుల్లో దాదాపు 1,000 H5 బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరణాల రేటును 48శాతంగా నమోదు చేసింది. ఇటీవల USAలోని వాషింగ్టన్‌లో ఒక వ్యక్తి ఈ వ్యాధితో మరణించాడు. ప్రస్తుతం సోకిన కేసులు తక్కువే అయినా అప్రమత్తంగా ఉండాలి. పక్షులు, జంతువులకు దూరంగా ఉండటం, మాంసం–గుడ్లు బాగా ఉడికించి తినటం, పరిశుభ్రత పాటించడం, అనుమానాస్పద మరణాలను అధికారులకు తెలియజేయాలని చెబుతున్నారు.
వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్‌కు చెందిన డాక్టర్ గ్రెగోరియో టోర్రెస్ ప్రకారం..మనుషులకు ఈ వైరస్ సోకడం ఇప్పటికీ చాలా అరుదు అంటున్నారు. కాబట్టి రోజువారీ జీవితంలో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.. ఒకవేళ వైరస్‌లో మార్పులు వచ్చినా, కోవిడ్ మహమ్మారి తరువాత ప్రపంచం ఇప్పుడెన్నడూ లేనంతగా సిద్ధంగా ఉంది. కానీ, ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.
అత్యంత ప్రమాదకరమైన బర్డ్ ఫ్లూ రకం H5N1 వైరస్ నుంచి రక్షించుకోవడానికి ఈ క్రింది సూచనలు ఉపయోగపడతాయి:
* అనుమానాస్పదంగా కనిపించే పక్షులు లేదా జంతువులకు దూరంగా ఉండాలి.
* కోడి మాంసం, గుడ్లను పూర్తిగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి.
* పక్షులు, జంతువులతో పని చేసే వారు వ్యక్తిగత పరిశుభ్రతను తప్పకుండా పాటించాలి.
* మీ చుట్టూ ఉన్న పరిసరాల్లో పక్షులు అసహజంగా చనిపోతున్న విషయం గమనిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




