Exercise: వ్యాయామం చేస్తున్నారా.. అయితే ఇవి గుర్తుంచుకోండి.. లేకుంటే..

Exercise: వ్యాయామం చేస్తున్నారా.. అయితే ఇవి గుర్తుంచుకోండి.. లేకుంటే..
Exercise (1)

ఆరోగ్యానికి శారీరక శ్రమ అత్యవసరం. ఇది చాలా మందికి తెలుసు. అయితే ఇప్పటిలా ఒకప్పుడు ఎవరూ ప్రత్యేకించి వ్యాయామాలేవీ చేసేవారు కాదు..

Srinivas Chekkilla

|

Jan 28, 2022 | 10:39 PM

ఆరోగ్యానికి శారీరక శ్రమ అత్యవసరం. ఇది చాలా మందికి తెలుసు. అయితే ఇప్పటిలా ఒకప్పుడు ఎవరూ ప్రత్యేకించి వ్యాయామాలేవీ చేసేవారు కాదు. అప్పటి పనులు, వృత్తులు, జీవనశైలితోనే శరీరానికి తగిన శ్రమ లభించేది. ఇప్పుడలా కాదు. మన పనుల తీరు, జీవనశైలి మారిపోయాయి. ఎక్కువసేపు కూర్చొని చేసే పనులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మునుపటిలా కదలటం తగ్గిపోయింది. దీంతో అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టే ప్రత్యేకించి వ్యాయామాల అవసరం రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. ఇవి శరీర దృఢత్వానికే కాదు, చక్కటి మానసిక ఆరోగ్యానికీ ఉపయోగపడతాయి. వ్యాయామం చేసినప్పుడు శరీరం శ్రమను తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. దీంతో కండరాలు, ఎముకలు, కండర బంధనాలతో పాటు గుండె, మెదడు, ఊపిరితిత్తుల వంటి ముఖ్యమైన అవయవాలన్నీ బలోపేతమవుతాయి.

జీర్ణకోశ, గ్రంథుల వ్యవస్థల పనితీరు సైతం మెరుగువుతుంది. ఇవన్నీ కండలు, శరీర సౌష్ఠవం ఇనుమడించటానికే కాదు. ఉద్యోగాలు, పనుల్లో రాణించటానికీ, ఆనందకరమైన కుటుంబ జీవనాన్ని గడపటానికీ తోడ్పడతాయి. గుండె, ఊపిరితిత్తులు, మెదడు బలంగా లేకపోతే జీవితాన్ని ఆస్వాదించలేం. అనారోగ్యంతో, జబ్బులతో కునారిల్లాల్సిందే. ఇలాంటి విపత్కర పరిస్థితిని వ్యాయామాలతో తప్పించుకోవచ్చు. అయితే దేనికీ అతి పనికి రాదంటారు. ఇది వ్యాయామాలకూ వర్తిస్తుంది. వీటికి ఒక పద్ధతి ఉంది. ఫిట్‌నెస్‌ అనేది ఒక్కరోజుకో, ఒక్క అవయవానికో సంబంధించింది కాదు. దీన్ని రాత్రికి రాత్రే సాధించలేం. హాయిగా, ఆనందంగా జీవితాంతం కాపాడుకోవాల్సిన, నిలబెట్టుకోవాల్సిన వ్యవహారమిది. వ్యాయామాలను చిన్నగా మొదలుపెట్టి, నెమ్మదిగా.. అంచెలంచెలుగా పెంచుకుంటూ రావాల్సి ఉంటుంది. అప్పుడే శరీరం వాటిని అంగీకరిస్తూ, తట్టుకునే శక్తిని సంపాదించుకుంటుంది.

శ్రమను ఓర్చుకునేలా, శక్తిమంతంగా మారుతుంది. పూర్తిగా అలసిపోయేంత వరకు కాకుండా ఇంకాస్త శక్తి ఉంది, మరికొంచెం సేపు వ్యాయామం చేయగలనని అనిపించే దశలోనే ఆపెయ్యాలి. ఇలా సాధన చేస్తే శరీరం సన్నద్ధమవుతూ వస్తుంది. క్రమంగా ఒత్తిడిని తట్టుకునేలా తయారవుతుంది. దీన్నే వ్యాయామ పరిభాషలో ‘వర్క్‌ హార్డెనింగ్‌’ అంటారు. అయితే శ్రమను ఓర్చుకునే స్థితికి చేరుకోకుండానే, అనతికాలంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలనే ఉద్దేశంతో శరీరాన్ని మరింత ఒత్తిడికి గురిచేస్తే ఏదో ఒక దశలో చేతులెత్తేయటం ఖాయం. కొందరు వేగంగా పరుగెత్తూనో, ఆటలు ఆడుతూనో, జిమ్‌లో కసరత్తులు చేస్తూనో కుప్పకూలటం చూస్తుంటాం. ఇది ఆ రోజున, అప్పుటి శారీరక పరిస్థితి, ఆరోగ్యం, ఇతరత్రా సమస్యలను బట్టి ఆధారపడి ఉంటుంది.

కొందరు అంతకుముందు రోజు మద్యం ఎక్కువగా తాగి ఉండొచ్చు. విపరీతమైన ఒత్తిడికి గురై ఉండొచ్చు. రాత్రిపూట సరిగా నిద్రపోయి ఉండకపోవచ్చు. దీంతో మర్నాడు శరీరం వ్యాయామానికి సహకరించకపోవచ్చు. అయినా కూడా వీటిని పట్టించుకోకుండా ఎప్పటి మాదిరిగానే వ్యాయామాలకు ఉపక్రమించొచ్చు. ముఖ్యంగా వారాంతాల్లో జిమ్‌లకు వెళ్లేవారు ఎట్టి పరిస్థితుల్లోనైనా వ్యాయామం చేయాలనే ఉద్దేశంతో పట్టుబట్టి చేస్తుంటారు. ఇది శరీరం, అవయవాల మీద విపరీత ప్రభావం చూపిస్తుంది. పైగా కొందరికి అప్పటికే తెలియకుండా గుండె సమస్యలు, అధిక రక్తపోటు, మధుమేహం వంటివి ఉండి ఉండొచ్చు. పుట్టుకతో వచ్చే కొన్ని గుండె సమస్యలున్నా పైకి ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అసలు అలాంటి సమస్య ఉన్న సంగతైనా తెలియదు. అధిక రక్తపోటు, మధుమేహంలోనూ తప్పనిసరిగా లక్షణాలు కనిపించాల్సిన అవసరం లేదు. మనదగ్గర వీటిని గుర్తించటానికి ముందుగా పరీక్షలు చేసుకునేవారు చాలా తక్కువ.

Read Also.. Heart: ఆరోగ్యమైన గుండె కోసం ఐదు సూత్రాలు.. దీర్ఘాయుష్షు పొందాలంటే ఇవి చాలు..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu