Gestational Diabetes: గర్భిణులకు గుడ్ న్యూస్.. రాత్రి పూట ఇలా చేస్తే మధుమేహానికి చెక్! పూర్తి వివరాలు తెలుసుకోండి..
గర్భిణులు రాత్రిసమయంలో నిద్రపోవడానికి కొద్ది గంటల ముందు గదిలో లైట్లను ఆర్పివేయడమో లేదా.. ఫోకస్ తగ్గించి, డిమ్ లైట్ పెట్టుకోవడమో చేస్తే మధుమేహం ముప్పును నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గర్భం దాల్చిన సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. బీపీ, షుగర్ బాగా ఫ్లక్చుయేట్ అవుతుంటాయి. ఈ సమయంలో వారు చాలా ఆహార నియమాలు పాటించడంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అయితే గర్భిణులు రాత్రిసమయంలో నిద్రపోవడానికి కొద్ది గంటల ముందు గదిలో లైట్లను ఆర్పివేయడమో లేదా.. ఫోకస్ తగ్గించి, డిమ్ లైట్ పెట్టుకోవడమో చేస్తే మధుమేహం ముప్పును నివారించవచ్చట. ముఖ్యంగా కంప్యూటర్, మొబైల్ స్కీన్ల వెలుతురును ఆర్పివేయాలని అమెరికాలోని నార్త్ వెస్టర్న్ వర్సిటీ స్పష్టం చేసింది. వారు చేసిన ఓ తాజా అధ్యయనంలో ఈ మేరకు వారికి స్పష్టమైన ఆధారాలు లభించాయని ప్రకటించింది. నిద్రపోయే ముందు వరకూ కాంతివంతమైన లైట్ల కింద గడిపితే శరీరంలో గ్లూకోజ్ నియంత్రణ గాడి తప్పుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఇంకా ఏమేమి విషయాలు ఈ అధ్యయనంలో తేల్చారో చూద్దాం..
అధిక కాంతి గల లైట్ల కింద ఉంటే ఏమవుతుంది..
నిద్రకు ముందు ఎక్కువ కాంతి కలిగిన వాటి కింద గర్భిణులు ఉంటే వారిలో జెస్టేషనల్ డయాబెటిస్ మెల్లిటస్‌ను అభివృద్ధి చేసినట్లు నార్త్‌వెస్టర్న్ మెడిసిన్ శాస్త్రజ్ఞులు గుర్తించారు. నిద్రవేళకు ముందు రాత్రి కాంతికి గురికావడం వలన మహిళలకు వారి రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ అదుపుతప్పుతుంది. అలాగే నిద్రకు ముందుకు లైట్ల వెలుగులో బాగా గడిపితే పొత్తి కడుపు పెరగడం, అధిక రక్తపోటు వంటి సమస్యలకూ దారి తీస్తుంది. అదే సమయంలో పగటి కాంతిని గ్రహించిన వారికి, త్వరగా నిద్రపోయే వారికి ఈ సమస్య లేనట్లు తమ అధ్యయనంలో వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు.
పరిశోధనలో తేలింది ఇది..
741 మంది గర్భిణులపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు నిర్ధారణ అయ్యాయని ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన అసిస్టెంట్ ప్రోఫసర్ మింజీ కిమ్ తెలిపారు. అందుకే వీలైతే గర్భధారణ సమయంలో కంప్యూటర్లు, మొబైల్, టీవీ వాడకానికి పూర్తిగా దూరంగా ఉండటం చాలా మందని ఆయన సూచించారు. కుదరని పక్షంలో కనీసం వాటిని వీలైనంత డిమ్ గా మార్చుకోవాలని చెప్పారు.
మధుమేహంతో గర్భిణులు జాగ్రత్త..
గర్భస్థ మధుమేహం ప్రసూతి సంబంధ సమస్యలను పెంచుతుంది. ఇది తల్లుల్లో మధుమేహం, గుండె జబ్బులు, చిత్తవైకల్యం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. పిండం పెరిగేకొద్దీ స్థూలకాయం, గర్భస్థ రక్తపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో గ్లూకోజ్ సమస్యలు లేని వారితో పోలిస్తే గర్భధారణ మధుమేహం ఉన్న మహిళల్లో టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ వచ్చే అవకాశం దాదాపు 10 రెట్లు ఎక్కువ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..