Dental Health: వామ్మో… దంత సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారా..? ప్రాణాలకే ముప్పు..!
Dental health benefits: ఆరోగ్యకరమైన దంతాలు సంపూర్ణ శారీరక ఆరోగ్యానికి కీలకం. దంత సమస్యలను నిర్లక్ష్యం చేస్తే మధుమేహం, గుండె జబ్బులు వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది, కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. క్రమం తప్పకుండా డెంటల్ చెకప్స్ చేయించుకోవడం ద్వారా సమస్యలను ముందుగానే గుర్తించి, తీవ్రం కాకముందే నివారించవచ్చు.

Oral Health Tips: మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. మొదట మన దంతాలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే. దంతాల ఆరోగ్యం చెడిపోతే మన ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. అందుకే, పళ్ల ఆరోగ్యం ఎప్పుడూ కాపాడుకోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. దంతాలు దృఢంగా ఉంటే.. వయస్సు పెరిగినప్పటికీ.. యువకుల్లా అన్ని ఆహార పదార్థాలను తీసుకోగలుగుతాం. దీంతో సమతుల ఆహారం తీసుకోవడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. అందుకే దంతాలలో ఏ సమస్య ఉన్నా.. వెంటనే డెంటిస్టులను సంప్రదించాలని సూచిస్తున్నారు. సంవత్సరంలో రెండు మూడు సార్లు అయినా డెంటల్ చెకప్ చేసుకుంటే.. దంత సమస్యలను తీవ్రం కాకముందే నివారించవచ్చని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు.
దంతాల సమస్యలు నిర్లక్ష్యం చేయొద్దు
దంతాలు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటే.. జీవితకాలం కూడా పెరుగుతుందని వైద్యారోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది పంటి నొప్పి, పుప్పళ్లు లాంటి సమస్యలతో బాధపడుతుంటారు. కానీ, వాటిని పెద్దగా పట్టించుకోరు. చికిత్స తీసుకోవడంలోనూ ఆలయం చేస్తారు. ఇలా చేయడం సమస్య తీవ్రతను మరింత పెంచడమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమస్య వచ్చిన వెంటనే డెంటిస్టును సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రమాదకరమైన వ్యాధులు
నోటి శుభ్రత, దంతాల ఆరోగ్యంపై డెంటిస్టులు చెప్పే సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా డెంటిస్టులను సంప్రదించడం వల్ల సమస్యలను తీవ్రం కాకముందే పరిష్కరించవచ్చని అంటున్నారు. డెంటల్ హెల్త్‌ను నిర్లక్ష్యం చేస్తే మధుమేహం, గుండె జబ్బులు, ఇతర వ్యాధుల బారినపడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందుకే డెంటల్ చెకప్ అవసరాన్ని సూచిస్తున్నారు.
ప్రాణాంతకం కూడా కావచ్చు..
దంత క్షయం, చిగుళ్లు వ్యాధులు, నోటి క్యాన్సర్, ఇతర సమస్యలను ముందుగానే నివారించడానికి డెంటల్ చెకప్స్ అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పంటి నొప్పి, ఇన్ఫెక్షన్, దంతక్షయం వంటి సమస్యలకు చికిత్స తీసుకోకుంటే.. చివరకు మరణం కూడా సంభవించవచ్చని హెచ్చరిస్తున్నారు.
డెంటల్ చెకప్స్ ఎందుకు అవసరం..?
డెంటిస్టును సంప్రదించిన సమయంలో వారు తీసే ఎక్స్ రే లాంటి వాటితో కేవిటీస్, ఇన్ఫెక్షన్స్, పళ్ల పగుళ్లు, కణితులు, వంటి సమస్యలుంటే గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో సమస్య తీవ్రం కాకముందే చికిత్స అందించి వాటిని నివారిస్తారు. అందుకే రెగ్యూలర్ డెంటల్ చెకప్స్‌తో నోటి ఆరోగ్యంతోపాటు శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నోటి శుభ్రత, దంతాలు ఆరోగ్యంగా ఉంటే మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీ నవ్వును చాలా మంది ఇష్టపడతారు. శుభ్రమైన నోరు నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.
