Goat Blood: మేక రక్తం నల్ల అదే పనిగా తింటున్నారా..? అవి కొట్టేస్తాయ్ జాగ్రత్త..
మేక రక్తంలో విటమిన్లు సమృద్ధిగా ఉన్నప్పటికీ, అశుభ్రత వల్ల ఇన్ఫెక్షన్లు, అధిక ఐరన్ వల్ల హిమోక్రోమాటోసిస్ వంటి సమస్యలు రావచ్చు. నరాల ఆరోగ్యం, మెదడు పనితీరుకు ఉపయోగకరమైనదిగా నిపుణులు చెబుతున్నప్పటకీ.. శుభ్రంగా వండి, మితంగా తీసుకోవడం, వైద్యుల సలహా పాటించడం అత్యవసరం.

మేక రక్తంలో విటమిన్ బి2, బి3, బి6, బి12 వంటి కీలకమైన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలోని నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మెదడు పనితీరును సమర్థవంతంగా ఉండేలా చేయడంలో, అలాగే శక్తి ఉత్పత్తిలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, పోషక విలువలతో పాటు ఇందులో కొన్ని ఆరోగ్యపరమైన ప్రమాదాలు కూడా ఉన్నాయి. శుభ్రత లేని పరిస్థితులలో రక్తాన్ని సేకరించినప్పుడు, అది ఇన్ఫెక్షన్లు, వైరస్లు, బ్యాక్టీరియాలతో కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి రక్తాన్ని తీసుకుంటే జ్వరాలు, దృష్టి లోపం, అంతకంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆహార నిపుణులు సూచించిన విధంగా.. మేక రక్తాన్ని బాగా శుభ్రం చేసి, పూర్తి వేడి పద్ధతిలో ఉడికించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా అందులోని సూక్ష్మజీవులు నశించి, శరీరం ఎలాంటి హానికరమైన ప్రభావాలు లేకుండా జీర్ణించుకోగలుగుతుంది.
మేక రక్తంలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. దీన్ని తరచుగా, అధికంగా తినడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయిలు బాగా పెరిగి, హిమోక్రోమాటోసిస్ అనే వ్యాధికి దారితీయవచ్చు. ఈ పరిస్థితి కాలేయం, గుండె వంటి ముఖ్యమైన అవయవాల పనితీరును దెబ్బతీస్తుంది. కాబట్టి, మేక రక్తం పోషక విలువలతో కూడుకున్నప్పటికీ, దానిని తీసుకునే ముందు శుభ్రత, వండే విధానం, మోతాదు వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. వైద్యుల సలహాతో, మితంగా తీసుకుంటే ఇది ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది.
(ఈ సమాచారం నిపుణుల నుంచి సేకరించాం. మీరు తినేముందు డైటీషయన్లు లేదా డాక్టర్లు సలహా తీసుకోండి)
