Health Tips: వామ్మో.. ఈ ఒక్క విటమిన్ లోపంతో 17రకాల క్యాన్సర్ల ముప్పు.. గుండెకు పెద్ద ప్రమాదమే..
విటమిన్ డి కేవలం ఎముకలకే కాకుండా గుండె ఆరోగ్యం, క్యాన్సర్ నివారణకు కీలకమని మీకు తెలుసా..? దీని లోపం వల్ల గుండె జబ్బులు, 17 రకాల క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది. సూర్యరశ్మి, ఆహారం ద్వారా ఈ విటమిన్‌ను పొందవచ్చు. ప్రస్తుత జీవనశైలి వల్ల లోపం కామన్‌గా మారింది. తగినంత విటమిన్ డి స్థాయిలను నిర్వహించడం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించడానికి అత్యవసరం.

సాధారణంగా ఎముకల ఆరోగ్యానికి మాత్రమే ముఖ్యమని భావించే విటమిన్ డి.. వాస్తవానికి గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ, క్యాన్సర్ నివారణ, రోగనిరోధక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. సూర్యకాంతి ద్వారా సహజంగా లభించే ఈ విటమిన్‌ను ప్రస్తుత బిజీ జీవనశైలి కారణంగా పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విటమిన్ డి లోపం వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలపై నిపుణుల ఏమంటున్నారు అనేది తెలుసుకుందాం..
విటమిన్ డి లోపంతో 17 రకాల క్యాన్సర్ల ముప్పు
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ చేసిన పరిశోధనల ప్రకారం.. విటమిన్ డి లోపం పదిహేడు రకాల క్యాన్సర్ల అభివృద్ధికి దారితీస్తుంది. ముఖ్యంగా రొమ్ము, ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్ల ప్రమాదం పెరుగుతుంది. క్యాన్సర్లతో పాటు గుండె జబ్బులు, స్ట్రోక్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, పీరియాంటల్ వ్యాధులు కూడా లోపం వల్ల వచ్చే ప్రమాదాలు.
గుండెపై ప్రతికూల ప్రభావాలు
రక్తపోటు పెరుగుదల: విటమిన్ డి రక్తపోటును నియంత్రించే RAAS వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. లోపం ఉన్నప్పుడు RAAS అతి చురుకై రక్త నాళాలు బిగుతుగా మారి, రక్తపోటు పెరుగుతుంది.
ధమనుల్లో ప్లేక్: లోపం ఉన్నప్పుడు దీర్ఘకాలిక తక్కువ-స్థాయి వాపు పెరిగి, ధమనులలో ప్లేక్ ఏర్పడటం వేగవంతమై గుండెపోటు, స్ట్రోక్ అవకాశాలు పెరుగుతాయి.
చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల: తక్కువ విటమిన్ డి స్థాయిలు అధిక LDL(చెడు కొవ్వు), తక్కువ HDL (మంచి కొలెస్ట్రాల్), ట్రైగ్లిజరైడ్‌లను పెంచుతాయి.
కార్డియాక్ అరిథ్మియా: విటమిన్ డి లోపం గుండె లయ తప్పడం, ఆకస్మిక గుండె మరణానికి దారితీస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
విటమిన్ డి లోపం గుండె జబ్బులకు నేరుగా కారణం కాకపోయినా ఇది ఇన్సులిన్ నిరోధకత, వాపు, పేలవమైన లిపిడ్ జీవక్రియ వంటి ప్రమాద కారకాలను పెంచుతుందని నిపుణులు అంటున్నారు.
ఎవరికి ప్రమాదం ఎక్కువ?
- సూర్యరశ్మి తక్కువగా తగిలే వ్యక్తులు.
- వృద్ధులు.
- ముదురు చర్మపు టోన్లు ఉన్నవారు.
- ఊబకాయం లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు.
మనకు ఎంత విటమిన్ డి అవసరం?
నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసిన్ సిఫార్సుల ప్రకారం:
- 1-70 సంవత్సరాలు: రోజువారీ 600 IU
- 71 ఏళ్ల కంటే ఎక్కువున్నవారికి: రోజువారీ 800 IU.
సూర్యరశ్మి కాకుండా విటమిన్ డి సహజంగా కొవ్వు చేపలు, గుడ్డు సొనలు, బలవర్థకమైన ఉత్పత్తులలో మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన గుండెను కాపాడుకోవడానికి ఆహార వనరులు, సురక్షితమైన సూర్యరశ్మి, అవసరమైతే సప్లిమెంట్ల ద్వారా తగినంత విటమిన్ డి స్థాయిలను నిర్వహించడం చాలా ముఖ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




