షుగర్ ఉన్నవారు రైస్ కి బదులుగా రోటీ తింటున్నారా..? అయితే ఇది మీకోసమే..!
ప్రస్తుత రోజుల్లో షుగర్ సమస్య అనేది చాలా మందిని బాధిస్తున్న సమస్యగా మారింది. ఇది ఒకసారి వచ్చాక దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అయితే మన ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా దీన్ని కొంత వరకు నియంత్రించుకోవచ్చు. చాలా మంది రెగ్యులర్‌గా అన్నం తినడం తగ్గించి బదులుగా రోటీలను తీసుకోవడం మొదలుపెడుతున్నారు. ఎందుకంటే రైస్ లో ఉన్న అధిక కార్బోహైడ్రేట్స్ రక్తంలో షుగర్ లెవల్స్‌ను ఒక్కసారిగా పెంచేస్తాయి. అందుకే రోటీ తినడం ద్వారా అదుపులో ఉంచవచ్చని భావిస్తున్నారు. కానీ రోటీని కూడా తగిన విధంగా తయారు చేసుకోవాలి. అలా చేయకపోతే రోటీ తిన్నా ప్రయోజనం ఉండకపోవచ్చు.

చాలా మంది మార్కెట్లో దొరికే పిండి ఉపయోగించి రోటీలు తయారు చేస్తారు. కానీ కొన్ని బ్రాండెడ్ పిండుల్లోనూ కల్తీ ఉండే అవకాశం ఉంది. అందువల్ల గోధుమలతో నిత్యం స్వచ్ఛమైన పిండిని తయారు చేసుకొని రోటీలు చేయడం ఉత్తమం. నిజమైన గోధుమ పిండితో చేసిన రోటీలు రక్తంలో గ్లూకోజ్‌ను తక్కువ వేగంతో అబ్జార్బ్ చేస్తాయి. అంటే రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరగకుండా నియంత్రితంగా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా ఈ పిండిలో ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ బాగా మెరుగవుతుంది.
కేవలం గోధుమ పిండితో కాకుండా రోటీల పోషక విలువలను మరింత పెంచేందుకు కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను కలపాలి. ఉదాహరణకు బాదం పిండి, కొబ్బరి పిండి, శనగపిండి వంటి లో-కార్బ్ పిండులను గోధుమ పిండిలో మిక్స్ చేస్తే మరింత ఆరోగ్యకరంగా మారుతాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను నియంత్రించడంతో పాటు ప్రోటీన్లను అందిస్తాయి. బాదం పిండిలో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్‌ను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.
రోటీలను మరింత ఆరోగ్యంగా మార్చేందుకు అవిసె గింజల పొడి లేదా చియా విత్తనాల పొడిని ఉపయోగించవచ్చు. ఈ విత్తనాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ విత్తనాలను మెత్తగా పొడి చేసి తక్కువ పరిమాణంలో పిండిలో కలిపి రోటీలు తయారు చేసుకోవచ్చు.
కావాలంటే ఎంతైనా ఆరోగ్యకరంగా రోటీలను తయారు చేసుకోవచ్చు. కానీ వాటిని తినే విధానం కూడా చాలా ముఖ్యం. ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పెద్ద రోటీల బదులుగా చిన్న సైజ్ రోటీలను తినాలి. దీనికి తోడు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, కూరగాయలను కూడా భోజనంలో చేర్చాలి. ఇలా చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు.
రోటీలను తినేటప్పుడు దానితో పాటు తీసుకునే కూరలు కూడా చాలా ముఖ్యం. ఎక్కువగా కూరగాయలతో తయారు చేసిన సబ్జీలు, పెసరపప్పు, శనగపప్పు వంటి ప్రోటీన్ ఫుడ్‌ను రోటీతో కలిపి తింటే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. అలాగే నూనెలను ఉపయోగించే విధానాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువ నూనెతో వండిన సబ్జీలను తినడం కన్నా తక్కువ నూనెతో తయ్యారైన కూరలను తీసుకోవడం మంచిది.
షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచేందుకు సరైన ఆహారపు అలవాట్లు పాటించడం ఎంతో ముఖ్యం. కేవలం అన్నాన్ని మానేసి రోటీలు తినడమే కాకుండా అవి హెల్దీగా తయారు చేయడం కూడా చాలా ముఖ్యం. రోటీల్లో పోషక విలువలను పెంచి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




