Fake Milk: తెల్లనివన్నీ పాలు కాదు.. తస్మాత్ జాగ్రత్త.. కల్తీవి తాగితే తట్టెడన్ని రోగాలు
పాలు పౌష్టికాహారం.. కానీ అవే పాలు ఇప్పుడు ఆరోగ్యానికి హానికరంగా మారిపోయాయి. రోగనిరోధకశక్తిని పెంచే పాలు ఇప్పుడు రోగాల బారిన పడేస్తున్నాయి.
పాలు పౌష్టికాహారం.. కానీ అవే పాలు ఇప్పుడు ఆరోగ్యానికి హానికరంగా మారిపోయాయి. రోగనిరోధకశక్తిని పెంచే పాలు ఇప్పుడు రోగాల బారిన పడేస్తున్నాయి. కల్తీ పాల వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. కొందరి ఆదాయ అత్యాశ, నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే పరిస్థితి ఏర్పడింది. పాడి పశువులు తినే ఆహారం వల్ల కూడా పాలు కలుషితమవుతున్నాయి. మనిషి ఆరోగ్యం విషయంలో పాలు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో పాలు ఒక భాగం.. ఉదయం లేచింది మొదలు టీ తాగడం దగ్గర నుంచి మొదలుపెడితే నిద్రపోయే వరకు పాలు, పాల పదార్థాలను వినియోగిస్తాం. అయితే సంపూర్ణ ఆహారమైన పాలు కొన్ని చోట్ల కల్తీకి గురవుతున్నాయి. కలుషిత పాల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. రోగనిరోధకశక్తికి ఉపయోగపడే పాలు కాస్తా రోగాల బారిన పడేస్తున్నాయి.
ప్రపంచ దేశాల్లో పాలను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ ముందుంది. అయితే కల్తీ పాలలో కూడా మనదేశమే ముందు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పాల కల్తీ అనేక రకాలుగా జరుగుతోంది. పశువులు తినే ఆహారం నుంచి పాలు పోసే వ్యాపారి వరకు అంతా కల్తీకి కారణంగా కనిపిస్తోంది. పశువులు పాలు అధికంగా ఇచ్చేందుకు వాటికి ఇచ్చే హర్మోన్‌ల వల్ల కూడా పాలలో ఉండే సహజమైన ప్రొటీన్‌లు నాశనమవుతున్నాయి. పశువులు తినే గడ్డిలో రసాయనాలు కలపడం, పాలు చిక్కగా ఉండేందుకు చక్కెర, యూరియా, మంచినూనె, సర్ఫ్ కలిపి అసలైన పాలను కృత్రిమంగా మార్చేస్తున్నారు. ఈ పాలను వినియోగించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అన్నీ పాలు తెల్లగానే ఉన్నా.. వాటిని పరీక్షించి చూస్తే తప్ప అవి కల్తీ పాలా ? లేదా అనేది కనిపెట్ట లేము. అత్యాశతో త్వరగా డబ్బులు సంపాదించాలనే దురాశతో కొందరు పాలను కల్తీ చేస్తున్నారు. లీటర్ పాలను కాస్తా పది లీటర్లను చేసేస్తున్నారు. చక్కెర, డిటర్జెంట్, యూరియా, నూనెలను కలిపి లీటర్ పాలను పది లీటర్లు చేస్తున్నారు. పాలు చిక్కగా ఉండేందుకు రసాయనాలను కలుపుతున్నారు. ఇలా తయారు చేసిన పాలను కొందరు డైరెక్ట్‌గా అమ్ముతుండగా, మరికొందరు పాల కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. అయితే ఇలాంటి పాలను వినియోగించడం వల్ల అనారోగ్యం పాలు కావడం ఖాయమంటున్నారు వైద్యులు.
డిటర్జెంట్‌ను కలపడం వల్ల పాలు తెల్లగా, స్వచ్ఛంగా కనిపిస్తాయి. వీటిని తాగడం వల్ల జీర్ణకోశ సంబంధిత సమస్యలు, విరేచనాలు అవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యూరియా కలిపిన పాలు తాగడం వల్ల మూత్రపిండాల పనితీరులో మార్పు కనిపిస్తుందంటున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను పాల స్వచ్ఛతను ఎక్కువ కాలం కాపాడేందుకు కలుపుతారు. దీనివల్ల జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అల్సర్ సమస్య తీవ్రమై కడుపులో మంట మొదలవుతుందని వైద్యులు చెబుతున్నారు. స్టార్చ్ కలపడం వల్ల పాలు చిక్కగా కనిపిస్తాయని, ఈ పాలను ఎక్కువగా తాగడం వల్ల డయేరియా బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Also Read:హైదరాబాదీలు బీ అలెర్ట్… కాలకూట విషంగా మారిన భాగ్యనగరం మట్టి