Stand Up Rahul : బాధ్యత.. బ్యాలెన్సింగ్‌ గురించి మాట్లాడే ‘స్టాండప్‌ రాహుల్‌’

స్టాండప్‌ కామెడీ గురించి ఈ మధ్య మన దగ్గర కూడా అవగాహన పెరుగుతోంది. ఇన్నాళ్లు నార్త్ లో ఎక్కువగా ఆదరణ పొందిన ఈ కాన్సెప్ట్, ఇప్పుడు తెలుగు సినిమాల్లో ప్రతిబింబిస్తోంది.

Stand Up Rahul : బాధ్యత.. బ్యాలెన్సింగ్‌ గురించి మాట్లాడే 'స్టాండప్‌ రాహుల్‌'
Stand Up Rahul
Follow us
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Rajeev Rayala

Updated on: Mar 18, 2022 | 3:31 PM

Stand Up Rahul: స్టాండప్‌ కామెడీ గురించి ఈ మధ్య మన దగ్గర కూడా అవగాహన పెరుగుతోంది. ఇన్నాళ్లు నార్త్ లో ఎక్కువగా ఆదరణ పొందిన ఈ కాన్సెప్ట్, ఇప్పుడు తెలుగు సినిమాల్లో ప్రతిబింబిస్తోంది. రీసెంట్‌గా మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ సినిమాలో స్టాండప్‌ కమెడియన్‌గా మెప్పించారు పూజా హెగ్డే. ఇప్పుడు లేటెస్ట్ గా రాజ్‌తరుణ్‌ చేసిన ప్రయత్నం ఎలా ఉంది? చదివేయండి..!

సినిమా: స్టాండప్‌ రాహుల్‌ నిర్మాణం: డ్రీమ్‌ టౌన్‌ ప్రొడక్షన్స్, హైఫైవ్‌ పిక్చర్స్ నటీనటులు: రాజ్‌తరుణ్‌, వర్ష బొల్లమ్మ, మురళీ శర్మ, ఇంద్రజ, వెన్నెల కిశోర్‌ తదితరులు రచన-దర్శకత్వం: సాంటో నిర్మాత: నందకుమార్‌ అబ్బినేని, భరత్‌ మగులూరి కెమెరా: శ్రీరాజ్‌ రవీంద్రన్‌ ఎడిటింగ్‌: రవితేజ గిరిజాల సంగీతం: స్వీకర్‌ అగస్తి విడుదల: మార్చి 18, 2022

రాహుల్‌ (రాజ్‌తరుణ్‌)కి స్టాండప్‌ కామెడీ అంటే ఇష్టం. తను మంచి స్టాండప్‌ కమెడియన్‌ కాగలడన్న నమ్మకం ఉంటుంది. అయితే అతని తల్లి ఇందు (ఇంద్రజ)కు అది నచ్చదు. కొడుకు సెటిలైతే చూడాలనుకుంటుంది ఇందు. ఆ విషయాన్నే కొడుకుతో స్పష్టంగా చెప్పేస్తుంది. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం జాబ్‌లో సెటిల్‌ కావాలనుకుంటాడు రాహుల్‌. అతని తండ్రి ప్రకాష్‌ (మురళీశర్మ)కి సినిమాలంటే ఇష్టం. తొలి సినిమాతోనే నేషనల్‌ అవార్డు తెచ్చుకుని, ఆ తర్వాత ప్యాషన్‌ కోసం ఫ్యామిలీకి దూరమవుతాడు. తన బాల్యంలో తల్లిదండ్రుల గొడవల్ని చూసిన రాహుల్‌కి పెళ్లంటే భయం పట్టుకుంటుంది. అయితే పెళ్లి భయపడాల్సిన విషయం కాదు… బాధ్యత అని నమ్ముతుంది శ్రేయారావు (వర్ష బొల్లమ్మ). రాహుల్‌ తో కలిసి చదువుకున్న శ్రేయా అతని జీవితంలోకి ఎలా ప్రవేశించింది? రాహుల్‌ని పెళ్లికి ఒప్పించగలిగిందా? లేదా? ఆమెకు తల్లి వైపు నుంచి అందిన సపోర్ట్ ఏంటి? రాహుల్‌ నచ్చిన పని చేసుకోగలిగాడా? లేకుంటే తల్లికిచ్చిన మాట మీద నిలుచున్నాడా? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు. డైరక్టర్‌ కొత్త వ్యక్తి అయినప్పటికీ సబ్జెక్ట్ ని బాగా డీల్‌ చేశారు. మనసు కోరే నచ్చిన పని, పెద్దలు ఒత్తిడితో చేయాల్సిన పని… అనేది యువత ముందు ఎప్పుడూ ఉండే సమస్యే. సరైన సమయంలో దాన్ని అధిగమించడంలోనే సగం సక్సెస్‌ ఉంటుంది. ఆ విషయాన్నే సరికొత్తగా చెప్పగలిగారు దర్శకుడు. మహిళలు ఉద్యోగాన్ని, జీవితాన్ని బ్యాలన్స్ చేసుకున్నట్టే, వృత్తిని, ప్రవృత్తిని బ్యాలన్స్ చేసుకోవచ్చనే కొత్త విషయాన్ని ఎస్టాబ్లిష్‌ చేసే ప్రయత్నం చేశారు. బంధం కలుపుకోవడమంటే బాధ్యతతో కూడిన వ్యవహారం. బాధ్యత తీసుకుంటే కదా తెలిసేది, సరిగ్గా నిర్వర్తించగలరో, లేదో… ఎప్పుడో ఒకరి లైఫ్‌లో జరిగిన ఘటనలు, ఆ పరిస్థితులు పునరావృతమవుతాయని ఎందుకు అనుకోవాలి? ఎవరి జీవితం వారిది… ఎవరు అర్థం చేసుకునే తీరు వారిది… కొన్నిసార్లు మనసు విప్పి మాట్లాడుకుంటే చాలా విషయాలు సర్దుకుంటాయి… ఇలాంటి విషయాలను సెన్సిటివ్‌గా డీల్‌ చేశారు డైరక్టర్‌. గాల్లో తిరిగే కోడలి ఆలోచనలు, కుటుంబం చుట్టూ తిరిగాయని అత్తగారు చెప్పే సీన్‌ చాలా మంది మహిళలకు తప్పకుండా కనెక్ట్ అవుతుంది. వాట్సాప్‌కి బ్లూ టిక్కులు కనుక్కున్న వారి మీద హీరో చూపించిన ఫ్రస్ట్రేషన్‌, కొన్ని స్టాండప్‌ కామెడీ ఎపిసోడ్స్ మెప్పిస్తాయి. కొన్ని చోట్ల కెమెరా యాంగిల్స్ వావ్‌ అనిపించేలా ఉన్నాయి. కొత్త లొకేషన్లని చూపించే ప్రయత్నంలో సక్సెస్‌ అయింది టీమ్‌. గత కొన్నాళ్లుగా సక్సెస్‌ కోసం వెయిట్‌ చేస్తున్న రాజ్‌తరుణ్‌ ఈ సినిమాలో కొత్తగా కనిపించారు. మేనరిజమ్స్ కూడా బావున్నాయి. వర్ష బొల్లమ్మ నటన డీసెంట్‌గా అనిపించింది. వెన్నెలకిశోర్‌ మెప్పించే ప్రయత్నం చేశారు. ఆయన ట్రాక్‌ ఇంకాస్త డీటైల్డ్ గా, కామెడీగా రాసుకుని ఉంటే బావుండేది. హీరో తల్లిదండ్రుల పోర్షన్‌, హీరోయిన్‌ తల్లిదండ్రుల ఎపిసోడ్‌ని ఇంకాస్త ఎఫెక్టివ్‌గా రాయాల్సింది. కథలో ట్విస్టులు లేకపోవడం, రొటీన్‌ క్లైమాక్స్ కాస్త నిరాశ కలిగిస్తుంది. – డా. చల్లా భాగ్యలక్ష్మి